‘కాళేశ్వరం’ అక్రమాలపై.. కేసీఆర్​ను ఎందుకు విచారించరు?

‘కాళేశ్వరం’ అక్రమాలపై.. కేసీఆర్​ను ఎందుకు విచారించరు?

న్యూఢిల్లీ, వెలుగు: సుప్రీంకోర్టు కొట్టేసిన కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని.. ఈడీ పేరుతో కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మండిపడ్డారు. కానీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో వేలకోట్ల అక్రమాలకు పాల్పడిన సీఎం కేసీఆర్​పై ఈడీ ఎందుకు విచారించట్లేదని ఆయన ప్రశ్నించారు. రాహుల్​పై ఈడీ విచారణకు, అగ్నిపథ్​ స్కీంకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్  వద్ద కాంగ్రెస్ చేస్తున్న సత్యాగ్రహ దీక్షలో సోమవారం ఆయన పాల్గొని మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు  అవినీతిపై ప్రధాని మోడీకి నేరుగా ఫిర్యాదు చేసినా ఇప్పటికీ స్పందించలేదన్నారు. ‘‘మోడీ నుంచి మొదలు బండి సంజయ్ దాకా అందరూ కేసీఆర్​ను జైల్లో పెడ్తమంటరు. కానీ, చర్యలు తీస్కోరు. అక్రమాల చేసిన కేసీఆర్​ను అరెస్ట్ చేసుడు చేతగాదు. దేశం నుంచి పారిపోయిన నీరవ్​మోడీ లాంటోన్ని తీసుకువచ్చి విచారించుడు బీజేపీతోటి ఏడైతది? ఈడీ పేరుతో రాహుల్​గాంధీని ప్రశ్నించుడు.. కాంగ్రెస్​ను దెబ్బదీసేందుకు ప్రయత్నించుడు మాత్రమే తెలుసు” అని కోమటిరెడ్డి కామెంట్ చేశారు.