హెచ్ సిటీ పనులు ఎందుకైతలేవ్?.. ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్పై సీఎం సీరియస్

హెచ్ సిటీ పనులు ఎందుకైతలేవ్?.. ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్పై సీఎం సీరియస్
  • బల్దియాలో అధికారుల మధ్య సమన్వయలోపం
  •  సాకులు చెప్తూ కాలం  గడుపుతున్న ఉన్నతాధికారులు
  • ఇంకా భూసేకరణే పూర్తి కాలే..
  • ఇంజినీరింగ్ అధికారులు  వివరాలు ఇవ్వడం లేదంటున్న జోనల్​ కమిషనర్లు 

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్సర్మేటివ్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్(హెచ్ సిటీ) లో భాగంగా చేపట్టిన పనులు నత్త నడకన సాగుతున్నాయి. హెచ్ సిటీ  పనులకు సీఎం రేవంత్ రెడ్డి గతేడాది డిసెంబర్ లో శంకుస్థాపన చేసినా ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభం కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బల్దియాలోని టౌన్​ప్లానింగ్​, ఇంజినీరింగ్​విభాగాల మధ్య సమన్వయ లోపమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తుండగా, ఉన్నతాధికారులు ఒకరిపై ఒకరు సాకులు చెబుతూ కాలం గడుపుతున్నారు. 

పనుల్లో ఆలస్యంపై ఇటీవల సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయంలో బల్దియా ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్  పై సీరియస్ అయినట్లు తెలిసింది. హెచ్ సిటీ ప్రతిపాదన సమయంలో హెచ్ఎండీఏ ప్రతిపాదించిన ప్యారడైజ్ –డెయిరీ ఫామ్ ఎలివెటేడ్ కారిడార్ పనులు మొదలైనా హెచ్ సిటీ పనులెందుకు షురూ కాలేదని ఇంజినీర్లపై సీఎం అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయిదు ప్యాకేజీల కింద 23 ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రభుత్వం రూ. 7,038 కోట్ల నిధులకు పరిపాలనపరమైన అనుమతులిచ్చినా పనులు ముందుకు సాగడం లేదు. 

జోనల్ కమిషనర్లకూ సహకరించట్లే..

హెచ్ సిటీ కింద రూ.7,032  కోట్లతో 25 పనులు చేపట్టగా ఇందులో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, ఆర్ఓబీలను నిర్మించాల్సి ఉన్నది. మరో 13 పనులు రోడ్ల విస్తరణకి సంబంధించినవి. ఈ పనులకు నిధుల కొరత లేదు. ఎంత స్పీడ్ గా పనులు చేపట్టాలనేది ప్రాజెక్టు విభాగం అధికారులపైనే ఉంది. అయితే, ప్రాజెక్టు విభాగానికి సంబంధించిన చీఫ్ ఇంజనీర్ పట్టించుకోకపోవడంతోనే పనులు ముందుకుసాగడం లేదని ఆ విభాగంలోని వారే చెప్తున్నారు. 

పనులు ఆలస్యంపై గత నెలలో కమిషనర్ కర్ణన్​మీటింగ్​నిర్వహించారు. బాధ్యతలను జోనల్​ కమిషనర్లకు అప్పగించారు. గ్రేటర్ లో ఉన్న జోన్లలో హెచ్ సిటీ కింద ప్రతిపాదించిన పనులున్నాయి. వీటి వివరాలు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వద్దనే ఉన్నాయి. అయితే, తాము వివరాలడిగితే ఇంజినీరింగ్ అధికారులు స్పందించడం లేదని పలువురు జోనల్ కమిషనర్లు ఆరోపిస్తున్నారు. 

భూసేకరణే జరగట్లే..

హెచ్ సిటీ పనుల్లో భాగంగా నిత్యం రద్దీగా ఉండే కేబీఆర్ పార్కు చుట్టూ సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు రూ.1090 కోట్లతో ఆరు స్టీల్ ఫ్లై ఓవర్లు, ఆరు అండర్ పాస్ లు నిర్మించాలని నిర్ణయించారు. భూసేకరణకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల ఆస్తులకు జీహెచ్ఎంసీ మార్కింగ్ కూడా చేసింది. అయితే,  నేటికీ భూ సేకరణ కొలిక్కి రావడం లేదు. కొన్ని ఆస్తులకు సంబంధించి పలువురు కోర్టును ఆశ్రయించడంతో ముందు కోర్టు పరిధిలో లేని ఆస్తుల నుంచి భూసేకరణ చేయాలని బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. అయినా, పనులను మాత్రం ప్రారంభించలేకపోయారు. 

అలాగే రేతిబౌలి–నానల్ నగర్ ఫ్లైఓవర్ , ఏవోసీ సెంటర్ ఆల్టర్నేట్​రోడ్లు, ఖాజగూడ జంక్షన్, ట్రిపుల్​ఐటీ ఫ్లైఓవర్లు, టీవీ9, ఎన్ ఎఫ్ సీఎల్ నుంచి వెంగళరావు పార్కు ఫ్లైఓవర్, విరించి నుంచి కేబీఆర్ పార్కు వరకు రోడ్డు వైడెనింగ్, రసూల్ పురా ఫ్లైఓవర్, హబ్సిగూడ నుంచి నాగోల్ ఫ్లైఓవర్ తదితర ప్రాజెక్టుల పనులు కూడా  ముందుకుసాగడంలేదు. 

ఏమీ చేయని  ఇన్​హౌస్​ డిజైన్ ​వింగ్​ 

హెచ్ సిటీ, ఎస్ఆర్డీపీ  తదితర ప్రాజెక్టుల డిజైన్లు, టెక్నాలజీని పరిశీలించేందుకు ఇన్-హౌస్ డిజైన్ వింగ్ ఏర్పాటు చేస్తూ రెండు నెలల క్రితం బల్దియా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఈ నేతృత్వంలో10 మందితో కూడిన డిజైన్ వింగ్ లో సీనియర్ ఇంజినీర్లతో పాటు ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్ఐటీలో చదివిన జీహెచ్ఎంసీ ఇంజినీర్లకు చోటు కల్పించారు. ఈ ప్రత్యేక విభాగం పర్యవేక్షక ఇంజినీర్ (ప్రాజెక్ట్స్) నేతృత్వంలో ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజినీర్ నియంత్రణలో పని చేయాల్సి ఉంది.  

ప్రైవేట్ కన్సల్టెంట్ల సాయం లేకుండా జీహెచ్ఎంసీ ఇంజిరింగ్ అధికారులే  స్వయంగా ప్రాజెక్టుల డిజైన్లు చేపట్టాల్సి ఉంది. -దీనివల్ల ప్రైవేట్ వ్యక్తులపై ఆధారపడకుండా ఉండడంతో పాటు జీహెచ్ఎంసీకి కొంత మేర ఖర్చు కూడా తగ్గుతుంది. కానీ, ఈ వింగ్ ఏర్పాటు చేసినా డిజైన్లు రూపొందించేందుకు నేటికి బయటి వారినే ఆశ్రయిస్తున్నారు.