ఎడమచేతి వాటం వాళ్లకే క్రియేటివిటీ ఎక్కువ.. ఆగస్టు 13న ప్రపంచ లెఫ్ట్ హ్యాండర్స్ డే.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ !

ఎడమచేతి వాటం వాళ్లకే క్రియేటివిటీ ఎక్కువ..  ఆగస్టు 13న ప్రపంచ లెఫ్ట్ హ్యాండర్స్ డే.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ !

ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు పొరపాటున ఎడమ చేయి చాపితే..‘కుడి చేత్తో తీస్కో’ అంటుంటారు. పిల్లలు ఎడమ చేత్తో రాస్తే.. ‘కుడి చేత్తో రాయి’ అని గద్దిస్తుంటారు. అంతెందుకు ఇంటికి మొదటిసారి వచ్చే కోడల్ని కూడా ‘కుడి కాలు పెట్టి లోపలికి రా’ అంటారు. ఎడమంటే ఎందుకంత చిన్నచూపు! అందుకే..ఓ కవి ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌‌‌‌’ అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెఫ్ట్‌‌‌‌ హ్యాండర్స్ అందరూ ఇదే మాట అంటున్నారు. వాళ్లసమస్యలు, బలాలు అందరికీ తెలియాలనే ప్రతి ఏటాఆగస్టు 13న లెఫ్ట్‌‌‌‌ హ్యాండర్స్‌‌‌‌డేని నిర్వహిస్తున్నారు.  

మనలో చాలామంది కుడిచేతి వాటం, కొంతమంది మాత్రమే ఎడమచేతి వాటం వాళ్లు ఉంటారు. లెఫ్ట్‌‌‌‌ హ్యాండర్స్ సంఖ్య తక్కువగా ఉండడం వల్లే ‘ఎడమ’కు ఈ వివక్ష. అంతేకాకుండా పురాతనకాలం నుంచి కొన్ని ముఖ్యమైన పనులకు ఎడమచేతిని వాడితే వింతగా చూసేవాళ్లు. మన దగ్గరే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా సంస్కృతుల్లో ఇదే పరిస్థితి. 

ప్రపంచ జనాభాలో దాదాపు 10 నుంచి 12 శాతం మంది ఎడమచేతి వాటం వాళ్లు ఉన్నారు. సాధారణంగా రోజువారి పనులు అంటే జుట్టు దువ్వుకోవడం, బరువులు ఎత్తడం లాంటివి చేసినప్పుడు ఏ చేతిని ఎక్కువగా ఉపయోగిస్తే అదే అతని చేతివాటం. ఇది పుట్టుకతో వస్తుంది. గర్భంలో ఉన్నప్పుడే శిశువు ఏ చేతివాటం అనేది తెలిసిపోతుంది. గర్భంలో ఉన్నప్పుడు ఎక్కువ శాతం శిశువులు తమ కుడి బొటనవేలును నోట్లో పెట్టుకుంటారు. వాళ్లంతా దాదాపు కుడిచేతివాటం వాళ్లే అవుతారు. ఎడమ బొటనవేలు పెట్టుకునేవాళ్లలో మూడొంతుల మంది ఎడమచేతి వాటం వాళ్లు అవుతారు. ఇది వంశపారంపర్యంగా కూడా వస్తుంది. తల్లిదండ్రులకు ఎడమచేతివాటం ఉంటే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు.. జీన్స్‌‌‌‌లో తేడాలున్నా ఎడమచేతి వాటంతో పుడతారని సైంటిస్ట్‌‌‌‌లు గుర్తించారు.   

కుడిచేతి వాటమే ఎక్కువ

ఎక్కువమంది కుడిచేతివాటంతోనే ఎందుకు పుడుతున్నారంటే.. ఈ ప్రశ్నకు ఇప్పటికీ సరైన సమాధానం దొరకలేదు. కానీ.. మానవుడు పుట్టి, సమాజాలు ఏర్పడే దశలో సామాజిక సహకారం కోసం కుడిచేతిని ఉపయోగించి ఉంటాడు. అలా కాలక్రమేణా అందరికీ అదే అలవాటు అయ్యి ఉంటుందనేది ఒక అంచనా. 

ఎడమవాటం మనుషులకేనా?

మనుషుల్లాగే కొన్ని జంతువుల్లోనూ ఎడమవాటం ఉంటుందట! అంటే ముఖ్యమైన పనుల కోసం అవి ఎడమ కాలుని ఎక్కువగా వాడతాయి. అలాంటివాటిలో కంగారూలు కూడా ఉన్నాయి. కొన్ని కంగారూలు నిమరడం, తినడం లాంటి పనుల కోసం ఎడమ కాలిని వాడతాయి. అలాగే 90 శాతం చిలుకలు వస్తువులను తీసుకోవడానికి వాటి ఎడమ పాదాన్ని ఉపయోగిస్తాయని ఒక రీసెర్చ్‌‌‌‌లో తేలింది. 

►ALSO READ | యూట్యూబర్ : బెంగాలీ వంటల రాణి.. 83 ఏళ్ల వయసులో లక్షల్లో సంపాదిస్తోంది !

ఆది మానవుల్లోనూ..

మనలాగే మన పూర్వీకులు అంటే ఆదిమానవుల్లో కూడా పదిశాతం వరకు ఎడమచేతివాటం వాళ్లే అనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. వేల సంవత్సరాల క్రితం నియాండర్తల్స్‌‌‌‌ అనే ఆదిమానవులు ఎక్కువగా పచ్చి మాంసాన్ని తినేవాళ్లు. కొన్నిసార్లు పెద్ద ముక్కల్ని నమలడానికి ఇబ్బంది పడేవాళ్లు. అందుకే మాంసాన్ని ఒకవైపు నోటితో కొరికి పట్టుకుని, మరో వైపు చేత్తో పట్టుకుని, పదునైన రాళ్లతో కోసేవాళ్లు. అప్పుడు ఆ రాళ్లు వాళ్ల పళ్లకు గీసుకుపోయేవి. ఆ గీతల దిశను బట్టి పది శాతం నియాండర్తల్‌‌‌‌లకు ఎడమచేతి వాటం ఉందని తెలిసింది. 

లాభాలెన్నో.. 

క్రియేటివిటీ : వీళ్లలో క్రియేటివిటీ కాస్త ఎక్కువగానే ఉంటుంది. భిన్నమైన కోణాల్లో ఆలోచించి సమస్యలకు పరిష్కారాలను కనుగొనే సామర్థ్యం ఎక్కువని ఎక్స్‌‌పర్ట్స్‌ చెప్తున్నారు. 

కళల్లో నైపుణ్యం: చాలామంది ప్రసిద్ధ కళాకారులు, సంగీతకారులు, రచయితలు ఎడమచేతివాటం ఉన్నవాళ్లే. దీని అర్థం వాళ్లలో కళా నైపుణ్యం ఎక్కువగా ఉంటుందని. 

మల్టీ టాస్కింగ్ : మల్టీ టాస్కింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని సైన్స్ కూడా చెప్తోంది. ఎడమచేతివాటం ఉన్నవాళ్ల మెదడులోని రెండు అర్ధగోళాల మధ్య కనెక్టివిటీ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్లకు ఈ సామర్థ్యం వస్తుంది. 

ఆటల్లో టాప్‌‌‌‌ : టెన్నిస్, బేస్ బాల్, బాక్సింగ్ లాంటి ఆటల్లో బాగా రాణిస్తారు. వాళ్లు టైపింగ్‌‌‌‌ కూడా చాలా వేగంగా చేయగలరు. ఎందుకంటే క్వర్టీ కీబోర్డులో కేవలం ఎడమ చేతితోనే మూడు వేల ఇంగ్లీష్‌‌‌‌ పదాలు టైప్‌‌‌‌ చేయొచ్చు. కుడి చేత్తో దాదాపు మూడు వందల పదాలు మాత్రమే టైప్‌‌‌‌ చేయగలం.

నష్టాలేంటి? 

అన్ని కుడివైపే: ఈ ప్రపంచంలో అన్ని వస్తువులు రైట్‌‌‌‌ హ్యాండర్స్‌‌‌‌ కోసమే తయారుచేస్తుంటారు. బైక్ యాక్సిలరేటర్‌‌‌‌‌‌‌‌ కుడివైపే ఉంటుంది. కంప్యూటర్ మౌస్‌‌‌‌ని కూడా కుడి చేతివైపు పెట్టుకుని వాడే విధంగా డిజైన్ చేశారు. కత్తెరలు, డబ్బాల ఓపెనర్లు.. అంతెందుకు ఎలక్ట్రానిక్ పరికరాల్లోని అన్ని ముఖ్యమైన నాబ్‌‌‌‌లు కుడి వైపునే ఉంటాయి. దీనివల్ల ఎడమచేతి వాటం వాళ్లు కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది.  

చేతిరాత: సాధారణంగా ఏ భాషనైనా ఎడమ నుంచి కుడికి రాస్తారు. అది కుడిచేతి వాళ్లకు అది చాలా సౌకర్యంగా ఉంటుంది. కానీ.. ఎడమ చేతివాటం ఉన్నవాళ్లకు అలా రాయడం ఈజీగా అలవాటు కాదు.  

అనారోగ్య సమస్యలు: ఒక అధ్యయనం ప్రకారం.. ఎడమచేతివాటం ఉన్నవాళ్లలో కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిసింది. కాకపోతే దీనికి కచ్చితమైన కారణం మాత్రం తెలియలేదు. ముఖ్యంగా వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని సైంటిస్ట్‌‌‌‌లు చెప్తున్నారు. స్కిజోఫ్రెనియా అనే మానసిక సమస్య వచ్చే ప్రమాదం కూడా ఉందట. 

ఎంతోమంది ప్రముఖులు

అమితాబ్ బచ్చన్: బాలీవుడ్‌‌‌‌ మెగాస్టార్ అమితాబ్‌‌‌‌ ఐదు దశాబ్దాలుగా ఎన్నో రోల్స్‌‌‌‌లో నటించి మెప్పించారు. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు.  

నరేంద్ర మోదీ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి మూడోసారి ప్రధాన మంత్రిగా సేవలు అందిస్తున్నారు. 

సచిన్ :  క్రికెట్ గాడ్‌‌‌‌గా గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా తను లెఫ్ట్‌‌‌‌ హ్యాండర్‌‌‌‌‌‌‌‌ని అని చెప్పారు. 

రతన్ టాటా: టాటా గ్రూప్ మాజీ చైర్మన్‌‌‌‌. ఆయన టాటా సంస్థను ఎంతో అభివృద్ధి చేశారు. సామాజిక బాధ్యతతో టాటా ట్రస్ట్‌‌‌‌ల ద్వారా విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధికి కృషి చేశారు. 

నికోలా టెస్లా: సైంటిస్ట్‌‌‌‌గా విద్యుత్, అయస్కాంతతత్వంలో కృషి చేశాడు. ఆయన పేరుమీద 125 పేటెంట్లు ఉన్నాయి. 

బరాక్ ఒబామా : 2007 నుంచి 2017 వరకు అమెరికా 44వ అధ్యక్షుడిగా పనిచేశారు. రెండుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి ఆఫ్రికన్ అమెరికన్ ఆయనే. 2009లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది. 

రాఫెల్ నాదల్ : స్పానిష్ టెన్నిస్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌. ఎన్నో టైటిళ్లు సొంత చేసుకున్న నాదల్‌‌‌‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 

బిల్ గేట్స్: మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్‌‌‌‌. సాంకేతిక విప్లవానికి బిల్‌‌‌‌గేట్స్‌‌‌‌ని పర్యాయపదంగా చెప్తుంటారు. ఆయన వినూత్న ఆలోచనలు, దూరదృష్టి ఆధునిక కంప్యూటింగ్ ప్రపంచానికి ఎంతో ఉపయోగపడ్డాయి. అంతకుమించి ఆరోగ్యం, విద్య, పేదరిక నిర్మూలనకు ఎంతో కృషి చేశారు. 

లియోనార్డో డావిన్సి: గొప్ప కళాకారుడు, శాస్త్రవేత్త, ఆవిష్కర్త. ఆయన గీసిన మోనాలిసా, ది లాస్ట్ సప్పర్‌‌‌‌‌‌‌‌ పెయింటింగ్స్‌‌‌‌ కళా ప్రపంచంలో ఐకానిక్ కళాఖండాలుగా మిగిలిపోయాయి.