సింగరేణి కాలరీస్లో పూర్తిస్థాయి డైరెక్టర్ల కరువు

సింగరేణి కాలరీస్లో పూర్తిస్థాయి డైరెక్టర్ల కరువు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి కాలరీస్ కంపెనీలో పూర్తిస్థాయి డైరెక్టర్లు కరువయ్యారు. కంపెనీలో కీలకమైన డైరెక్టర్ పా, డైరెక్టర్ ప్రాజెక్ట్, ప్లానింగ్ పోస్టులు కొన్నేండ్లుగా ఖాళీగా ఉన్నాయి. కొంతకాలంగా డైరెక్టర్ పా, డైరెక్టర్ ప్రాజెక్ట్, ప్లానింగ్ పోస్టులకు డైరెక్టర్ ఫైనాన్స్ బలరామ్ ఇన్​చార్జిగా వ్యవహరిస్తున్నారు. పూర్తిస్థాయి డైరెక్టర్లు లేకపోవడంతో కొత్త మైన్స్ అనుమతులతోపాటు ఉన్న మైన్స్​ఎక్స్​టెన్షన్, ఇండస్ట్రియల్ రిలేషన్ వంటి పలు విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరో రెండు మూడు నెలల్లో కంపెనీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికల బాధ్యతలన్నీ డైరెక్టర్ పానే చూస్తుంటారు. 

భర్తీలో ఎందుకీ నిర్లక్ష్యం 

సింగరేణిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన డైరెక్టర్ పర్సనల్ అండ్ వెల్ఫేర్(పా) పోస్టు దాదాపు ఎనిమిదేండ్లుగా ఖాళీగా ఉంది. ఎనిమిదేండ్ల కాలంగా డైరెక్టర్ పా పోస్టును డైరెక్టర్ ఆపరేషన్స్, డైరెక్టర్ ఫైనాన్స్​గా ఉన్నవాళ్లే ఇన్​చార్జీగా అదనపు బాధ్యతలు చేపడుతున్నారు. సాధారణంగా డైరెక్టర్ పా పోస్టులో ఐఏఎస్ ఆఫీసర్​ను నియమించాల్సి ఉంది. కంపెనీలో గుర్తింపు సంఘం ఎన్నికలు, ఇండస్ట్రియల్ రిలేషన్ షిప్(ఐఆర్), కార్మికులు, ఆఫీసర్ల ప్రమోషన్లు, ట్రాన్స్​ఫర్లు వంటి పలు కీలక అంశాలను డైరెక్టర్ పా పర్యవేక్షిస్తుంటారు. కంపెనీలో అతి ముఖ్యమైన విజిలెన్స్​కు డైరెక్టర్ పా అధిపతిగా ఉంటారు. ప్రస్తుతం డైరెక్టర్ లేకపోవడంతో ఆఫీసర్లపై వచ్చే ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టడంలో కొంత నిర్లక్ష్యం జరుగుతుందనే విమర్శలున్నాయి. కంపెనీలో కొత్త మైన్స్ అనుమతితో పాటు ఉన్న మైన్స్​ఎక్స్​టెన్షన్ వంటి కీలక పనులను పర్యవేక్షించే డైరెక్టర్ ప్రాజెక్ట్, ప్లానింగ్ కుర్చీ ఏడాదిన్నరగా ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్న డైరెక్టర్ ప్రాజెక్ట్, ప్లానింగ్​తో పాటు డైరెక్టర్ ఈఅండ్ఎం పోస్టులకు 2020 సెప్టెంబర్ 25న ఇంటర్వ్యూలు చేసి కంపెనీలోని సీనియర్ ఆఫీసర్లను ఎంపిక చేశారు.

ఈఅండ్ఎం డైరెక్టర్​గా సత్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్, ప్లానింగ్​కు వీరారెడ్డిని యాజమాన్యం సెలెక్ట్ చేసింది. కాగా వీరారెడ్డి అప్పటికే సింగరేణి నుంచి వెళ్లిపోయి ఈసీఎల్​లో డైరెక్టర్​గా చేస్తున్నారు. జాయిన్ అవుతానంటూ టైం తీసుకుని ఆయన జాయిన్ కాలేదు. కోల్ ఇండియాలో టెక్నికల్ డైరెక్టర్ పోస్టు ఖాళీ కావడంతో అటు వెళ్లిపోయారు. ఆయన స్థానంలో కొత్త డైరెక్టర్​ను నియమించకపోవడంతో డైరెక్టర్ ఫైనాన్స్​గా ఉన్న బలరామ్​కు యాజమాన్యం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రధానమైన మూడు డైరెక్టర్ పోస్టులను నిర్వహించాల్సి రావడం, ఎక్కువగా హైదరాబాద్, ఢిల్లీ, జేబీసీసీఐ మీటింగ్​లతో పాటు నైనీ ప్రాజెక్ట్ పనుల బిజీలో బలరాం ఉంటున్నారు. దీంతో కార్మికులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండని పరిస్థితి. కంపెనీలో కీలకమైన డైరెక్టర్ల పోస్టుల భర్తీపై యాజమాన్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.