వీర్ సావర్కర్‌‌కు భారత రత్న ఎందుకివ్వట్లేదు?

వీర్ సావర్కర్‌‌కు భారత రత్న ఎందుకివ్వట్లేదు?

ముంబై: దసరా ఉత్సవాల సందర్భంగా బీజేపీపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే విరుచుకుపడ్డారు. దమ్ముంటే తన ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీకి సవాల్ విసిరారు. అలాగే హిందూత్వ విషయంలో బీజేపీతో పోలిస్తే తాము పాటించే హిందూత్వ వైరుధ్యమన్నారు. తాజాగా మరో శివ సేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ బీజేపీపై విమర్శలకు దిగారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వీర్ సావర్కర్‌‌కు భారత రత్న పురస్కారాన్ని ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. 

మహారాష్ట్రలో కాంగ్రెస్‌‌తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సావర్కర్‌‌ను శివ సేన అవమానించిందని బీజేపీ తమను విమర్శిస్తోందని సంజయ్ రౌత్ చెప్పారు. అయితే సావర్కర్ విషయంలో శివ సేన వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని రౌత్ స్పష్టం చేశారు. సావర్కర్‌‌ను అవమానించేలా ఎవరు కామెంట్స్ చేసినా తాము ఖండించామని గుర్తు చేశారు. సావర్కర్ విషయంలో శివ సేనను ప్రశ్నిస్తున్న బీజేపీ.. ఆయనకు ఇంకా భారత రత్న అవార్డును ఎందుకివ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ సావర్కర్‌‌కు బీజేపీ అవార్డు ఇవ్వలేకపోయిందని మండిపడ్డారు.