మోడీపై పాక్ మంత్రి వ్యాఖ్యలపై ఎందుకు మాట్లాడవ్?: బండి సంజయ్

మోడీపై పాక్ మంత్రి వ్యాఖ్యలపై ఎందుకు మాట్లాడవ్?: బండి సంజయ్

బషీర్ బాగ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు బీజేపీ నిరసన ర్యాలీ 

హైదరాబాద్, వెలుగు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు ఖండించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. పాకిస్తాన్ ను విమర్శిస్తే ఎంఐఎం ఎక్కడ  బాధపడుతుందోనని కేసీఆర్ మాట్లాడటం లేదేమోనని ఆయన ఎద్దేవా చేశారు. ఒక వర్గం ఓట్ల కోసమే కేసీఆర్ మౌనంగా ఉన్నారని ఫైర్ అయ్యారు. ‘‘కేసీఆర్ ఇంకా నిద్ర లేచాడో లేదో.. మోడీపై పాక్ మంత్రి  చేసిన వ్యాఖ్యలు ఆయనకు తెలిశాయో, లేదో.. ఇలాంటి వ్యక్తి బీఆర్ఎస్ పెడుతాడు.. దేశానికి ప్రధాని అవుతాడట” అని సంజయ్​విమర్శించారు. ప్రధాని మోడీపై పాక్ మంత్రి కామెంట్లను ఖండిస్తూ శనివారం బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ లోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ట్యాంక్ బండ్ వద్ద పాకిస్తాన్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. దేశం ఎటు పోయినా వాళ్లకు అవసరం లేదని బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. ముందుగా దేశం కోసం ఆలోచించని సెక్యులరిస్టులను కంట్రోల్ చేయాలన్నారు. 

పాక్​పై మాట్లాడనోళ్లు దేశద్రోహులే.. 

పాకిస్తాన్ వైఖరిపై మాట్లాడని వాళ్లు దేశ ద్రోహులతో సమానమని సంజయ్ మండిపడ్డారు. దేశం కోసం తెగించి కోట్లాడే వాళ్లు బీజేపీ కార్యకర్తలు మాత్రమేనన్నారు. ప్రపంచమే మోడీని గొప్ప నాయకుడిగా చూస్తోందన్నారు. ‘‘బిలావల్​ భుట్టో.. నీ తల్లిని పొట్టనపెట్టుకున్నది టెర్రరిస్టులే. అలాంటి దేశంలోనే నీవున్నావని గుర్తుంచుకోవాలి. మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ వద్దనుకుంటే పాకిస్తాన్ జాగ్రత్తగా ఉండాలి” అని సంజయ్ హెచ్చరించారు. బెంగళూరు డ్రగ్స్ కేసు విషయంలో తనపై పైలెట్ రోహిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తేలిగ్గా తీసిపారేశారు. ఎవరికి పడితే వారికి సమాధానం చెప్పనన్నారు. ర్యాలీలో సంజయ్ తో పాటు పార్టీ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, చింతల రాంచంద్రా రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, గౌతం రావు, ఇతర నాయకులు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.