- మహాజాతరకు పక్షం రోజుల ముందే పనులు పూర్తి చేస్తామని వెల్లడి
ములుగు/తాడ్వాయి, వెలుగు: మేడారం మహాజాతరకు పక్షం రోజుల ముందే అభివృద్ధి పనులు పూర్తవుతాయని, నాణ్యతలో రాజీపడేది లేదని, లోపాలుంటే చర్యలు తప్పవని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల్లో జాప్యం జరగడంపై సంబంధిత అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ శ్రీనివాస రాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ బుధవారం సమ్మక్క, సారక్కకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
పనులు పర్యవేక్షిస్తున్న సమయంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ కింద పడిపోగా, మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఆమెను పైకి లేపారు. ఈ ఘటనతో మంత్రి పొంగులేటి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, మంత్రులు, మీడియా మాత్రమే ఇక్కడ ఉండేలా చూడాలని ఆదేశించారు.
ఆఫీసర్లపై ఆగ్రహం..
హరిత హోటల్లో అధికారులు, గుత్తేదారులతో మంత్రి పొంగులేటి వివిధ అంశాలపై రివ్యూ చేశారు. ఆర్అండ్బీ శాఖ పరిధిలో జరుగుతున్న పనుల్లో జాప్యంపై ఈఈ శ్యాం సింగ్ సరైన వివరణ ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మరో చోటికి బదిలీ చేయాలని ఆదేశించడంతో పాటు ఏఈని సైతం మందలించినట్లు సమాచారం.
మేడారం–తాడ్వాయి రోడ్డు విస్తరణ పనుల్లో ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చిందా? అని ప్రశ్నించారు. విద్యుత్ పోల్స్ ఏర్పాటు ఎందుకు ఆలస్యం అవుతోందని నిలదీశారు. రోడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని హెచ్చరించారు.
ప్రాకారం, సివిల్, గద్దెల ఎత్తు పెంపు, ప్రధాన ద్వారాలు, ఆర్చ్, వాచ్ టవర్లు, సీసీ రోడ్ల పనులపై రెండు గంటల పాటు రివ్యూ చేశారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని, గ్రీనరీ, ప్లాంటేషన్ వర్క్స్ సైతం కంప్లీట్ చేయాలని సూచించారు.
గద్దెల వద్ద భక్తుల కెపాసిటీ 3 వేల నుంచి 10 వేలకు పెంచనున్నట్లు తెలిపారు. 19 ఎకరాల భూసేకరణ ప్రక్రియ స్పీడప్ చేయాలని ఆదేశించారు. పర్మినెంట్ బస్ స్టేషన్, జంపన్నవాగు అభివృద్ధి, సుందరీకరణ ప్రపోజల్స్ సిద్ధం చేయాలన్నారు.దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.హారీశ్, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరిశ్ పాల్గొన్నారు.
దేవుళ్లపై రాజకీయాలొద్దు: సీతక్క
ప్రతిపక్షాలు దేవుళ్లపై రాజకీయాలు చేయడం మానుకోవాలని మంత్రి సీతక్క హితవు పలికారు. వనదేవతలంటే సీఎం, మంత్రులు, తనకు ఉండేది భక్తితో కూడిన భావోద్వేగమని స్పష్టం చేశారు. గిరిజనుల సంప్రదాయ పద్ధతి ప్రకారమే గద్దెల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. భక్తులు ఎంతో నమ్మకంతో అమ్మవార్లను దర్శించుకోవడానికి వస్తున్నారని, వారి విశ్వాసం దెబ్బతినకుండా ఆదివాసీల అస్తిత్వం కాపాడుకుంటూ పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు.
