కేసీఆర్ ఏపీదాక ఎందుకు.. మనకాడ ఉన్నయ్ నాట్లేయని శెల్కలు!

కేసీఆర్ ఏపీదాక ఎందుకు.. మనకాడ ఉన్నయ్ నాట్లేయని శెల్కలు!
పెద్ద రైతు కేసీఆర్​ సార్​ మొన్నీమధ్య ఆంధ్రా రైతు ఉప్పల ప్రసాదరావుకి ఫోన్​ కొట్టిండు. ‘మీ తాన వడ్లు ‘వెద’పెట్టి వరి పండిస్తున్నరంట! ఔ.. అట్ల జేస్తే దిగుబడెట్లుంది?’ అని అడిగిండు. ‘ఖర్చు తక్కువ దిగుబడి రాదనే దిగులే లేదు సార్​’ అని ఉబ్బితబ్బిబ్బయి ఆ రైతు అనేసరికి సార్​ గూడ మస్త్​ ఖుషీ అయిండు. ‘ఓ పాలి మా ఫాం హౌస్​కు రావాలె, ఓ దినం చూసిపోవాలె. కలిసి తిందాం రా’ అని రైతుకి దావత్​ ఆఫర్​ జేసిండు కేసీఆర్. అప్పటి సంది శానా ఊళ్లల్ల వరినాటు లేకుండ వడ్లనే వెదపెడుతున్నరని అనుకుంటున్నరు. అయితే ఇట్ల జేసే రైతులు తెలంగాణలోగూడ శానా మందే ఉన్నరు.  ఆ రైతులందరికీ ఆదర్శరైతు ‘ రూపిరెడ్డి లక్ష్మీ’. ఈ అమ్మ చెలకలో మొలకలు చల్లితే మొదాల అందరూ నవ్విన్రు. మొక్కలకు చెమట తాపి భూమి నుంచి బువ్వ తీస్తే, నవ్వినోళ్లే కాదు గవర్నమెంటోళ్లు కూడా మెచ్చుకున్నరు! రూపిరెడ్డి తిరుపతిరెడ్డికి పన్నెండకరాల శెల్క ఉండె. నాట్ల సీజనొస్తే కూలోళ్లు దొరకకపాయె. ఎప్పుడూ ఇబ్బందే. గిదేందిరబై పెట్టే పెట్టుబడి తప్పట్లే, కూలోళ్ల కోసం ఇబ్బంది పోవట్లే. గిది మారదా అనుకున్నది తిరుపతిరెడ్డి భార్య లక్ష్మి. గిప్పుడే కూలోళ్లు దొరకట్లే. ఇక ముందు ఇంకెట్లుంటది? అందరూ సదువుకుంటన్నరు. వంగి నాట్లేయడానికి కొత్త తరం రావట్లే. రేపటికి ఇబ్బంది అచ్చినంక ఆలోచించుడేంది. రాకముందే ఏదో ఒకటి చేస్తే బాగుంటదిగా అనుకున్నది. నారు పోసుడు, నాటేసుడు లేకుండా చేలల్లో వెద పెట్టినట్టే వడ్లని కూడా వెదపెడితే గెట్లుంటదని ఆలోచన చేసింది. ‘ఏమైతదో చూద్దం తియ్​. పండితె పండింది, పోతే పోయింద’ని శెల్కలోకి దిగింది. తిరుపతి రెడ్డి, లక్ష్మీ కలిసి పొలమంతా దుక్కి దున్నిన్రు. నీళ్లు పెట్టి దమ్ము చేసిన్రు. తర్వాత వడ్లను మొలకలు కట్టి చల్లిన్రు. గట్ల చల్లుతుంటే ఒరం మీద నడుచుకుంట పోయేటోళ్లు ఇచ్చిత్రంగ చూసిన్రు. నవ్వుకున్నోళ్లు నవ్వుకున్నరు. ఎక్కిరించినోళ్లు ఎక్కిరించిన్రు. ‘కూలీలు ఇయ్య లేకనా, ఎవుసం చేయ చేతగాకనా? ఈ పనిలేని పని’ అని ఎన్ని మాటలన్నరో. ‘ఎవలేమన్నా అనుకోని, మనం మాత్రం గిట్లనే చేద్దమ’ని లక్ష్మి, తిరుపతి రెడ్డి గట్టిగ అనుకున్నరు. లక్ష్మి మొన్న రైతు బిడ్డ. తర్వాత రైతు భార్య. నేడు ఆదర్శ రైతు. ఆమె పొలం దున్నుతుంది. పశువులు మేపుతుంది.వెద పెడుతుంది. కలుపు తీస్తుంది.  ఎరువు చల్లుతుంది. పురుగు మందు కొడుతుంది. చేలో పనులన్నీ అయి పోయాక కాళ్ల నొప్పులతో కష్టపడుతూ ఇంటికి పోదు. సైకిల్​ మోటరెక్కి స్పీడుగ ఇంటికి పోతది. ఊరి రైతులకు సలహాలిచ్చి ఇంటి పనులన్నీ సక్కబెడతది. నవ్విన నాపచేను వెద పెట్టించి వరిని మొలిపించడం వాళ్లకీ తెల్వది. వట్టిగనే అట్ల మొదలుపెట్టినరు. మొలిచిన చోట మొలిచింది. మొలవనిచోట మొలవలే. ఒక చోట ఒత్తుగా, ఒక చోట పలుచగా ఉండె. కలుపు చావలే. శెల్క పండించడానికి ఇరాం లేకుండ పనిచేసిన్రు. పండనీకి పండింది. కానీ, పడ్డ బాధలు ఎవలికి చెప్పుకోవాలె. విత్తనం పండితె మల్లా ఎవుసం చేయాలని పెద్దలన్నరు. విత్తనమేంది? నాటేసి పండిస్తే ఎంత పండిందో అంత పండింది. కాబట్టి మళ్లీ ఈ తీర్గనే పండిద్దమనో రెండో పంటకు సిద్ధపడ్డరు. ఈపాలి చాకిరి తగ్గించుకునే ఉపాయాలు కనిపెట్టాలనుకున్నరు. కలుపు లేకుండ దుక్కిని మంచిగా చేసుకున్నరు. విత్తనాలు ఒడుపుగా చల్లడం అలవాటు చేసుకున్నరు. రెండో పంటకు కష్టం తగ్గింది. గిట్ల డెవలప్​ చేసుకుంట పోయిన్రు. దున్నేప్పుడు బాధలు తగ్గినయ్​. కూలోళ్ల సమస్య తీరింది. పెట్టుబడి తగ్గింది. దిగుబడి పెరిగింది. ‘నవ్విన నాపచేనే పండుతది’ అన్నట్లు లక్ష్మి, తిరుపతి భూమిలో బంగారం పండించిన్రు. నాలుగు పంటలు తీసి మంచిగ తెలివిడి తెచ్చుకున్నరు. గీ శెల్క ముచ్చట్లు వినాలని అగ్రికల్చర్​ యూనివర్సిటీ వాళ్లు కరీంనగర్​ జిల్లా మానకొండూరు మండలంలో ఉన్న కొండపల్కల ఊరికొచ్చిన్రు. ఎప్పుడైతే ప్రొఫెసర్లు, సైంటిస్టులొచ్చిన్రో అప్పటి సంది ఊల్లె రైతులందరికీ వీళ్లు రోల్​ మోడల్​ అయిన్రు. సాలువడ్డది లక్ష్మి ఏ తీరుగ పంట పండిస్తన్నదో ఊరి రైతులు గూడ అట్లనే వెదపెట్టి పంట తీసుడు మొదలుపెట్టినరు. అందరికీ పెట్టుబడి సగం తగ్గింది. అదే దిగుబడి అస్తున్నది. లాభం పెరిగే సరికి సుట్టుముట్టు ఊళ్లకెల్లి అచ్చుడు మొదలైంది. అట్ల లక్ష్మి శెల్కల పనిజేస్తంటే సూసేందుకు ఇరవై నుంచి పాతిక మంది అస్తరు. చూస్తరు. మాట్లాడిపోతరు. ఇట్ల పన్నెండేళ్ల నుంచి ఇక్కడ జాతర నడుస్తనే ఉంది. ఈ లక్ష్మి తీరుగనే వెదపెట్టి పండించుడు పక్క ఊళ్లను దాటి, మండలాలు దాటి, జిల్లాలు దాటింది. సాగుబడి సిద్దిపేట జిల్లాతోపాటు మంచిర్యాల, మంచిర్యాల జిల్లాలో శివారం, జైపూర్​లో, పెద్దపల్లి జిల్లా మద్దిరాల, మరిపెల్లిగూడెంలో, హుజూరాబాద్​, నర్సంపేట, ఖమ్మం సుట్టుముట్టు ఊళ్లల వెదపెట్టి వరి సాగు జేసుడెట్లనే చెప్పి వచ్చిన్రు. పెట్టుబడి తక్కువని తెలిసి లక్ష్మి, తిరుపతిరెడ్డి సాగుజేస్తున్న పొలం సూడనీకి హార్టికల్చర్​ కమిషనర్​ వెంకట్రామి రెడ్డి ఓపాలి కొండపల్కల పోయిండు. ముచ్చటపడిన ఆయన ‘గీ ఎవుసం మా రైతులకి మీరే నేర్పాలె, తప్పక రావాలె’అని బోధన్​ దగ్గర ఉన్న వాళ్ల ఊరికి పట్టుబట్టి తీస్కపోయిండు. సాగుని బాగు చేసిండు. రైతుకి రెండింతల లాభం మొదటిపంటలో ఎకరానికి 40 బస్తాలు పండినయ్. రెండో పంటలో అయిదు బస్తాలు పెరిగినయ్. మూడో పంటలో 50కి పెరిగింది. అప్పటి సంది 50 నుంచి 55 మధ్యనే. అంతకంటే ఎన్నడూ తగ్గలే. ఒకపాలి 57 బస్తాలు పండినయ్ . ఎప్పుడైనా పునాస పంట కంటే ఏసంగిలో ఎకరానికి 3, 4 బస్తాలు ఎక్కువే పండుతున్నయ్ . సన్నా లు వేసినా, దొడ్డు రకాలు వేసినా ఎన్నడూ దండగ రాలే. –తిరుపతి రెడ్డి అందరికీ మేలే ఇప్పటిదాంక పెట్టుబడి తగ్గించుకోవాలనే చూసినం. ఇప్పటి సంది పురుగు మందులు, కెమికల్​ ఫెర్టిలైజర్స్​ లేకుండా వరి పండించాలని పెట్టుకున్నం. ఓ మూడెకరాల పొలంలో ఆర్గానిక్​ పంట పండిస్తన్నం. అది కూడా దిగుబడి పెంచుకుంట, ఏటా దీని గురించి తెలుసుకుంట మాలాంటి రైతులందరికి మేలు చేస్తం.– లక్ష్మి సైంటిస్టులకే పాఠాలు వరిపంట వేసే సీజన్​ అచ్చినప్పుడు ‘మా ఊరికి రావాలె’ అని కొన్ని ఊళ్ల నుంచి రైతులు తీస్కపోతరు. వాళ్ల ఊళ్లె పొలాలన్నీ దమ్ము చేసి, వడ్లు మొలకలు కట్టి రెడీగ ఉంటరు. ఆ శెల్కని ఎట్ల మార్చుకోవాలో చెప్పి, మొలకలు చల్లుడు చెబుతరు. మొలిచినంక ఏం జేయాలో చెబుతరు. కలుపు మందు, కలుపు తీసుడు, ఎరువేసుడన్నీ చెబుతరు. మళ్లొచ్చి వాళ్ల చెల్కలో వాళ్ల పని చేసుకుంటరు. 2017 నుంచి అగ్రికల్చర్​ యూనివర్సిటీ స్టూడెంట్స్​కి, సైంటిస్టులకి, రైతులకు సాగుపాఠాలు చెబుతనే ఉన్నరు ఈ ఆదర్శ రైతులు. వీళ్లు, వాళ్లని లేదు. ఎవలు పిలిచినా పోయి నేర్పినరు. ఆ ఆదర్శ దంపతుల్ని రాష్ర్ట వ్యవసాయ మంత్రి నిరంజన్​ రెడ్డి పిలిచి మెచ్చుకున్నడు.  హరీష్​ రావు మెచ్చుకున్నడు. ఇండియన్ కౌన్సిల్​ ఆఫ్​ అగ్రికల్చర్​ (ఐసీఎంఆర్) వీళ్లకు బాబూ జగ్జీవన్​ రామ్​ అవార్డు ఇచ్చింది. హైదరాబాద్​లోఉన్న అగ్రికల్చర్​ యూనివర్సిటీ, బెంగళూరులో ఉన్న ఇండియన్​ ఇని​స్టిట్యూట్​ ఆఫ్​ సైన్స్​, ఇండియన్​సైన్స్​ కాంగ్రెస్​, తెలంగాణ గవర్నమెంట్​ ఈ ఆదర్శ రైతుల్ని ‘ఉత్తమ రైతు’ అవార్డుతో గౌరవించింది.-నాగవర్ధన్​ రాయల