కొండగట్టు: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో టెండ'రింగ్' ప్రక్రియ వివాదాస్ప దంగా మారింది. టెండరుదారులు కుమ్మక్కై వరుసగా మూడోసారి వేలంపాటను బహిష్క రించడంతో అధికారులు టెండర్లను వాయిదా వేశారు. ఆలయంలో కొబ్బరి కాయలు, కూల్ డ్రింక్స్, ఆట వస్తువులు, హోటల్ తదితర 14 రకాల షాపుల నిర్వహణకు ఫిబ్రవరి 18న టెండర్లు నిర్వహించగా.. నిబంధనల మార్పు డిమాండ్ చేస్తూ వ్యాపారులు వేలంలో పాల్గొనలేదు. జీఎస్టీ రద్దు చేయాలని, టెండర్ గడువు రెండు సంవత్సరాలకు పెంచాలని కోరారు.
అనంతరం మార్చి 18న మరో సారి టెండర్లు నిర్వహించినప్పటికీ వేలానికి దూరంగా ఉన్నారు. దీంతో టెండర్ ప్రక్రియ ను కరీంనగర్ లోని అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి మార్చారు. మార్చి25న టెండర్లు జరగాల్సి ఉండగా ఎవరూ టెండర్లు దాఖలు చేయకపోవడంతో మరోసారి వాయిదా పడింది. వ్యాపారులు కుమ్మక్కై మూడుసార్లు పాల్గొనక పోవడం వల్ల ఆలయ ఆదాయానికి గండిపడే పరిస్థితి నెలకొంది. ప్రతి ఏడాది ఈ షాపుల ద్వారా సుమారు రూ.3.5 కోట్ల ఆదాయం వస్తుండగా, ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
