- ఇక్కడే భూగర్భంలో శుద్ధి చేసిన 540 కిలోల యురేనియం!
- ఒక్కొక్కటి వెయ్యి కిలోలుండే బంకర్ బస్టర్ బాంబులతో పేల్చివేత
- ట్రూత్ సోషల్‌లో పేలుళ్ల వీడియో పోస్టు చేసిన ట్రంప్
- శత్రువులను మరింత బలంగా దెబ్బతీస్తం: ఐఆర్జీసీ కమాండర్ అబ్దుల్లాహి
- అలీరెజా హత్యకు ప్రతీకారం తప్పదని ప్రకటన
- హార్మూజ్లో నిలిచిపోయిన 18 భారత షిప్‌లు
- వాటిన్నింటిని సురక్షితంగా తీసుకువచ్చే ప్రయత్నాల్లో భారత్
టెహ్రాన్: అమెరికా–ఇజ్రాయెల్ మంగళవారం తెల్లవారుజామున ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగరంపై బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడ్డాయి. ఒక్కొక్కటి వెయ్యి కిలోలుండే ఈ బాంబులతో చేసిన అటాక్‌తో అక్కడ తీవ్రమైన పేలుళ్లు, భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అక్కడి ఆయుధాల డిపోను ధ్వంసం చేశామంటూ ఆ పేలుళ్ల వీడియోను ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. ఇస్ఫహాన్‌లోని భూగర్భంలో ఇరాన్ రహస్యంగా నిర్మించిన న్యూక్లియర్ సెంటర్ లోనే 540 కిలోల శుద్ధి చేసిన యురేనియం నిల్వలున్నాయని అమెరికా ఆరోపిస్తున్నది.
అందుకే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఈ అణు కేంద్రమే లక్ష్యంగా భారీ దాడులు చేశాయని సమాచారం. మరోవైపు హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై టోల్ విధించాలని, అమెరికా–ఇజ్రాయెల్‌తో పాటు తమపై ఆంక్షలు విధించిన దేశాల నౌకలను నిషేధించాలని ఇరాన్ పార్లమెంటు ఆమోదించింది. అలాగే శత్రువులను ఇంకా బలంగా దెబ్బ తీస్తామని ఐఆర్జీసీ కమాండర్ అలీ అబ్దుల్లాహి హెచ్చరించారు.
హార్మూజ్ జలసంధిలో 18 భారత నౌకలు చిక్కుకున్న నేపథ్యంలో వాటిని సేఫ్‌గా తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నది. బ్రిటన్ నుంచి బయల్దేరి వెళ్లిన అమెరికా బీ2 బాంబర్లు మంగళవారం తెల్లవారుజామున ఇరాన్‌లోని ఇస్ఫహాన్ సిటీపై విరుచుకుపడ్డాయి. నగరంలోని న్యూక్లియర్ ఫెసిలిటీ సెంటర్‌పై, కీలకమైన ఆయుధ డిపోపై బంకర్ బస్టర్ బాంబులతో భారీగా దాడులు చేశాయి.
23 లక్షల జనాభా ఉన్న ఈ సిటీలో ఇరాన్ కీలక మిలిటరీ హబ్, బదర్ మిలిటరీ ఎయిర్‌పోర్ట్ ఉన్నాయి. వీటన్నింటిని టార్గెట్ చేస్తూ ఒక్కొక్కటి వెయ్యి కిలోలు ఉండే బంకర్ బస్టర్ బాంబులతో పేల్చివేశారు. ఈ బాంబులు భూగర్భలోకి దాదాపు 200 ఫీట్ల వరకు చొచ్చుకెళ్లి బంకర్లను పూర్తిగా ధ్వంసం చేస్తాయి. ఆయుధాల నిల్వల వల్ల సెకండరీ బ్లాస్టులు కూడా జరిగి మంటలు, పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడుల వీడియోను తన ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. వీడియోలో వరుస పేలుళ్లు, తీవ్రమైన మంటలు, పొగలు కనిపిస్తున్నాయి. ఇరాన్ ఇస్ఫహాన్‌లోని భూగర్భ న్యూక్లియర్ కేంద్రాల్లో సుమారు 540 కేజీల ఎక్కువ సాంద్రత యురేనియం నిల్వలు దాచినట్లు అమెరికా ఆరోపిస్తున్నది. దీన్ని నాశనం చేసే లక్ష్యంతో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఈ దాడులు చేసినట్టు సమాచారం. ఇస్ఫహాన్‌పై అటాక్‌లో పెద్ద సంఖ్యలో పెనిట్రేటర్ బాంబులు వాడడంతో న్యూక్లియర్ సెంటర్ ధ్వంసమైనట్టు అమెరికా అధికారి ఒకరు చెప్పినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. దాడిలో ప్రాణనష్టం వివరాలేవీ బయటకు రాలేదు.
దాడులు కొనసాగుతాయి: ఐఆర్జీసీ
తమ నేవీ కమాండర్ అలీరెజా మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఐఆర్జీసీ కమాండర్ అలీ అబ్దుల్లాహి ఒక ప్రకటనలో తెలిపారు. శత్రువులపై దాడులు కొనసాగుతాయని చెప్పారు. ‘‘అమెరికా, ఇజ్రాయెల్‌ను ఐఆర్జీసీ యోధులు ఇంకా బలంగా దెబ్బ తీస్తారు” అని అన్నారు. ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ కూడా ప్రతీకారం తప్పదని హెచ్చరించారు.
నౌకల్లో ఎల్పీజీ, ఎల్ఎన్జీ, క్రూడాయిల్
ఇండియాకు చెందిన 18 షిప్‌లు హార్మూజ్ జలసంధిలో పశ్చిమ వైపు చిక్కుకున్నాయి. వీటిలో నాలుగు ఎల్పీజీ ట్యాంకర్లు, నాలుగు క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు, ఒక ఎల్ఎన్జీ క్యారియర్ ఉన్నాయి. మిగతా నౌకల్లో కొన్నింటిలో పెట్రో ఉత్పత్తులు, కొన్నింటిలో వివిధ సరుకులు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ 18 ఓడలపై మొత్తం 485 మంది నావికులు ఉన్నారు. యుద్ధం మొదలైనప్పుడు ఈ ప్రాంతంలో 28 భారతీయ ఓడలు ఉండగా.. వాటిలో కొన్ని ఇప్పటికే సురక్షితంగా బయటపడ్డాయి.
జలసంధిలో నిలిచిపోయిన మిగతా వాటిని తీసుకువచ్చేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తున్నది. నౌకలు, వాటిలో సిబ్బంది సురక్షితంగా ఉన్నట్టు సోమవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. హార్మూజ్ నుంచి ఓడలను సురక్షితంగా తీసుకురావడానికి ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలు జరుపుతున్నట్టు తెలిపింది. ఇరాన్ కూడా భారత్‌కు వస్తున్న రవాణా నౌకలకు ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల బీడబ్ల్యూ టీవైఆర్, బీడబ్ల్యూ ఈఎల్ఎం షిప్‌లు 94,000 టన్నుల ఎల్పీజీతో హార్మూజ్ నుంచి సురక్షితంగా బయటపడి భారత్ వైపు వస్తున్నాయి. ఇంధన దిగుమతులపై ప్రభావం తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తున్నది.
హార్మూజ్ జలసంధిపై టోల్‌కు ఇరాన్ నిర్ణయం
యుద్ధం నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్ హార్మూజ్ జలసంధి ద్వారా వెళ్లే నౌకలపై టోల్‌లు విధించే ప్రణాళికను ఆమోదించింది. ఈ ప్రణాళికలో భాగంగా అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలు అలాగే ఇరాన్‌పై ఆంక్షలు విధించిన దేశాల నౌకలకు ఈ మార్గంలో ప్రయాణాన్ని నిషేధించారు. ఈ నిర్ణయం ద్వారా ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన హార్మూజ్ జలసంధిపై ఇరాన్ తన నియంత్రణను మరింత పెంచుకోనుంది. అలాగే ఒమన్‌తో కలిసి ఈ మార్గానికి సంబంధించిన చట్టపరమైన వ్యవస్థను రూపొందించాలనే అంశాన్ని ప్రణాళికలో చేర్చారు. ఇరాన్ చేపట్టిన ఈ చర్యలు అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.
అమెరికాకు 31 రోజుల్లో 27 బిలియన్ల ఖర్చు
అమెరికా-ఇరాన్ యుద్ధానికి సోమవారంతో 31 రోజులు పూర్తయ్యాయి. ఈ యుద్ధంపై అమెరికా ఇప్పటికే 27 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. యుద్ధానికి ప్రతి సెకనుకు 10,300 డాలర్లు, ప్రతి గంటకు 37 మిలియన్ డాలర్లు ఖర్చవుతున్నాయి. రోజుకు దాదాపు 890 మిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నారు. ఇందులో ఆయుధాలకు 320 మిలియన్, విమానాలకు 245 మిలియన్, నేవీకి 155 మిలియన్, రక్షణ వ్యవస్థలకు 95 మిలియన్ ఖర్చవుతున్నది. అయితే ఈ డబ్బుతో అమెరికాలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
దుబాయ్‌లో మిసైల్ శకలాలు పడి ఇద్దరు భారతీయులకు గాయాలు
ఇరాన్ ప్రయోగించిన మిసైల్‌లను దుబాయ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకోగా, ఆ శకలాలు మీదపడి ఇద్దరు భారతీయులు గాయపడ్డారు. దుబాయ్ సౌత్పార్ట్లోని అల్ బదా ఏరియాలో ఇది చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం నలుగురు విదేశీయులు స్వల్ప గాయాల పాలయ్యారు.
వారిలో ఇద్దరు ఇండియన్లు, బంగ్లా, శ్రీలంక వాసులు ఒక్కొక్కరు ఉన్నారు. గాయపడిన వారిని పోలీసులు హాస్పిటల్‌కు తరలించి ట్రీట్మెంట్ అందించారు. శకలాలు ఒక ఇంటిపై పడి మంటలు అంటుకున్నాయి. ఫైర్‌సిబ్బంది వచ్చి వెంటనే మంటలను అదుపు చేశారు.
