- మూడు నెలల్లో 9 మంది.. ఏడాదిలో 40 మంది మహిళల దారుణ హత్యలు
- తల్లిని కోల్పోయి, తండ్రి జైలుకెళ్లి అనాథలవుతున్న చిన్నారులు
- పురుషుల్లో పెరుగుతున్న ఈగో సమస్యలు
- మానసిక వ్యాధే ప్రధాన కారణమంటున్న నిపుణులు
ఏడడుగులు నడిచి జీవితాంతం తోడుంటానని మాటిచ్చిన భర్తలే, ఇప్పుడు అనుమానాల ఊబిలో దిగుతూ భార్యల పాలిట యములుగా మారుతున్నారు. ప్రేమ, నమ్మకంపై నిలవాల్సిన దాంపత్య బంధంలో ‘అనుమానం’ అనే మానసిక వికృతి చొరబడడంతో పచ్చని సంసారాలు రక్తపు మడుగుల్లో ముగుస్తున్నాయి.
చిన్న చిన్న అనుమానాలు, ఈగో సమస్యలు, క్షణికావేశాలు కలిసి నగరంలో భయంకర హత్యలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఈ దారుణాల్లో ప్రాణాలు కోల్పోతున్నది భార్యలే కాదు.. వారి పిల్లల భవిష్యత్తు కూడా చిద్రమవుతోంది. వరుస ఘటనలు కుటుంబ వ్యవస్థ, దాంపత్య బంధాలపై ఆందోళన కలిగిస్తున్నాయి.
భార్యను గన్‌తో కాల్చి చంపిండు..
మల్కాజిగిరి పరిధిలోని మారుతీనగర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి డి.అరుణ్ కుమార్(48) కు భార్య నిషితా రాణి(నిషా) ప్రవర్తనపై అనుమానం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమె తనకు చేతబడి చేస్తోందని అనుమానించాడు. గత మార్చిలోనే ఆమెను చంపేందుకు బిహార్ నుంచి తుపాకీ తెప్పించి పోలీసులకు దొరికిపోయి, బెయిల్‌పై బయటకు వచ్చాడు.
అయినప్పటికీ కక్ష చల్లారని అరుణ్, జూన్ 10 మంగళవారం రాత్రి గొడవలు సర్దుబాటు చేసుకుందామని నమ్మించి నిషాను ఇంటికి పిలిపించాడు. తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో, తన వద్ద దాచిన కంట్రీమేడ్ పిస్టల్‌తో నిషాపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
అహంకారం, అనుమానంతో..
మీర్‌పేట్ పరిధిలో వ్యాపారంలో నష్టాలు వచ్చి ఖాళీగా ఉంటున్న రాము, తన భార్య లావణ్య(32) ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఆమె స్కూల్‌కు వెళ్లడం, అక్కడ ఎవరితోనైనా మాట్లాడటం నచ్చక అనుమానం పెంచుకుని, తెల్లవారుజామున నిద్రిస్తున్న లావణ్యను గొడ్డలితో విచక్షణారహితంగా నరికి చంపాడు. మరో ఘటనలో మియాపూర్ మాతృశ్రీ నగర్‌లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేసే మల్లికార్జున్, కవిత(28) దంపతుల మధ్య ఫోన్ కాల్స్ విషయంలో గొడవ జరగడంతో, భర్త పెద్ద బండరాయితో భార్య తలపై మోది హతమార్చాడు.
హైదరాబాద్ సిటీ, వెలుగు: పచ్చని సంసారాల్లో ‘అనుమానం’ అనే రక్కసి చిచ్చు పెడుతోంది. ఫోన్‌లో మాట్లాడుతోందని ఒకరు, వివాహేతర సంబంధం ఉందనే అపోహతో మరొకరు కక్ష పెంచుకుని భార్యల ప్రాణాలు తీస్తున్నారు. నగరంలో చిన్న చిన్న కుటుంబ కలహాలు, భార్యలపై పెరిగిన అనుమానాల కారణంగా గడిచిన మూడు నెలల్లోనే దాదాపు 9 మంది మహిళలు, గ్రేటర్ పరిధిలో ఏడాది కాలంలో 35 నుంచి 40 మందికి పైగా అమాయక మహిళలు భర్తల చేతుల్లోనే కిరాతకంగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది.
నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వెలుగుచూసిన వరుస ఘటనలు సమాజాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. జగద్గిరిగుట్ట సంజయ్‌నగర్‌లో భార్య రేణుక(24) ఎవరితోనో ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతోందని అనుమానించిన లారీ క్లీనర్ శివ, ఆమె గాఢ నిద్రలో ఉండగా కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. చాదర్‌ఘాట్ పద్మానగర్ బస్తీలో ఇమ్రాన్ అనే వ్యక్తి తన భార్య ఫాతిమా(26)కు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో రోజూ వేధించి, చివరకు పిల్లలను పక్కగదిలో పడుకోబెట్టి బెడ్‌రూమ్‌లో ఆమెను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం గుండెపోటుతో చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు.
భయంకరమైన మానసిక వ్యాధి..
భర్తలు ఇంత కిరాతకంగా భార్యలను హత్య చేయడానికి వెనుకాడకపోవడంపై సైకియాట్రిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘అనుమానం’ అనేది భయంకరమైన మానసిక వ్యాధి అని చెబుతున్నారు. దీని బారినపడినవారు చిన్న విషయాలను కూడా పెద్దగా ఊహించుకుంటారు. భార్య ఎవరితోనైనా ఫోన్ మాట్లాడినా, బయటకు వెళ్లినా తప్పుగా అర్థం చేసుకుంటారు.
తమ భాగస్వామిపై తమకే పూర్తి హక్కు ఉందనే విపరీతమైన పొసెసివ్‌నెస్ చివరకు ప్రాణాలు తీసే స్థాయి క్రూరత్వానికి దారితీస్తుంది. హత్య చేస్తే జైలుకెళ్లాల్సి వస్తుందని తెలిసినా క్షణికావేశంలో సైకోలా మారి భార్యలను హత్య చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.
భార్యాభర్తల మధ్య గొడవలు మొదలైనప్పుడే ఇరువైపుల పెద్దలు కూర్చుని మాట్లాడటం లేదా కౌన్సెలింగ్ ఇప్పించడం అవసరమని సూచిస్తున్నారు. సమస్య తీవ్రంగా ఉండి కలిసి బతకడం అసాధ్యమైతే చట్టబద్ధంగా విడాకులు తీసుకోవాలే తప్ప, అనుమానంతో సైకోలుగా మారి ప్రాణాలు తీయకూడదని హెచ్చరిస్తున్నారు.
ఈగో కూడా ప్రధాన కారణమే..
సమాజంలో పెరుగుతున్న ఈగో సమస్యలు, అహంకారం కూడా ఈ నేరాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. భార్య ఆర్థికంగా ఎదగడం లేదా సమాజంలో చురుగ్గా ఉండటం కొందరు పురుషుల్లోని పాతకాలపు అహంకారాన్ని దెబ్బతీస్తోంది. భార్య తన అదుపులో లేదనే భావనతో ఆమె ప్రతి కదలికను అనుమానంగా చూడటం మొదలుపెడుతున్నారు. సోషల్ మీడియా అధిక వినియోగం వల్ల వచ్చే అపోహలు, విచక్షణ కోల్పోవడం, కోపాన్ని అదుపు చేసుకోలేకపోవడం కూడా హింసాత్మక చర్యలకు దారితీస్తున్నాయి.
అనాథలవుతున్న పిల్లలు..
ఈ హత్యలు కేవలం ఒక ప్రాణాన్ని బలితీసుకోవడం మాత్రమే కాదు.. ఒక కుటుంబాన్ని పూర్తిగా ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. చేసిన నేరానికి తండ్రి జైలుపాలు కావడం, తల్లి చనిపోవడంతో పిల్లలు రాత్రికి రాత్రే అనాథలుగా మారుతున్నారు.
అమ్మ లేని లోటు, నాన్న చేసిన దారుణాన్ని తలచుకుంటూ ఆ పసివాళ్లు జీవితాంతం మానసిక వేదన అనుభవించాల్సి వస్తోంది. మీర్‌పేట్ ఘటనలో ఉదయం లేచి తల్లి రక్తపు మడుగులో శవమై పడి ఉండటాన్ని చూసిన 8 ఏళ్ల బాలుడు బోరున విలపించడం, జగద్గిరిగుట్ట, మియాపూర్ ఘటనల్లో పసిపిల్లలు కన్నతల్లి శవం వద్ద ఏడవడం నగరవాసులను కంటతడి పెట్టించింది.
