భార్యాబిడ్దలకు నిప్పు…భార్య మృతి

భార్యాబిడ్దలకు నిప్పు…భార్య మృతి
  • అర్ధరాత్రి అత్తింట్లో కిచొరబడి దారుణం
  • ఒకరు మృతి,నలుగురికి తీవ్ర గాయాలు..
  • సిద్దిపేట జిల్లా ఖమ్మంపల్లిలో ఘటన

కట్టు కున్న భార్య, కన్న బిడ్డతోపాటు అత్తింటి వారిపై పెయింట్ థిన్నర్ (పెయింట్లో కలిపే లిక్విడ్) పోసి నిప్పటించాడో వ్యక్తి. ఒకరు చనిపోగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. గ్రామస్తులు, పోలీసుల సమాచారం ప్రకారం.. ఖమ్మంపల్లికి చెందిన రాయమల్లి రామయ్య కూతురు విమల(35) కు కరీంనగర్ జిల్లా నెమలికొండ గ్రామానికి చెందిన లక్ష్మీరాజ్యంతో 2007లో పెళ్లయ్యింది.వీరికి కూతురు పవిత్ర(12), కొడుకు జైపాల్(10) ఉన్నారు. చాలాకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా.. పెద్దలు సర్ది చెపుతూ వస్తున్నారు. అయినా లక్ష్మీరాజ్యం లో మార్పు రాలేదు. ఏడాది క్రితం సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో భర్తపై విమల కేసు పెట్టింది. 6 నెలల క్రితం జడ్జి వద్ద భార్యను సరిగా చూసుకుంటానని చెప్పిన లక్ష్మీరాజ్యం.. సిద్దిపేట భారత్ నగర్ లోని ఓ అద్దె ఇంట్లోకి మకాం మార్చాడు. విమల గురువారం కూతురు, కొడుకును తీసుకుని పుట్టింటికి వెళ్లింది. విమల సోదరి సునీత ఖమ్మంపల్లి రావడంతో రాత్రి అక్కడే ఉండేందుకు నిర్ణయించుకుంది. భోజనాలు చేసిన తర్వాత విమల, సోదరుడు జాన్ రాజు, సోదరి సునీత, మరదలు రాజేశ్వరి, కూతురు పవిత్ర ఒక గదిలో, విమల సోదరులైన సంజీవ్, అనిల్,కుమారుడు జైపాల్ మరో గదిలో పడుకున్నారు. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో అత్తగారింటికి వచ్చిన లక్ష్మీరాజ్యం.. పెద్ద కట్టె మొద్దుతో తలుపులు బద్దలు కొట్టాడు. ఇంట్లోకి చొరబడి వెంట తెచ్చుకున్న పెయింట్ లో కలిపే థిన్నర్ ను నిద్రిస్తున్న వారిపై పోసి.. సుతిల్ బాంబులు వేసి నిప్పు పెట్టి పారిపోయాడు. బాంబుల శబ్దానికి, వారి అరుపులకు పక్కగదిలో ఉన్న సంజీవ్, అనిల్ తోపాటు చుట్టు పక్కలవారు లేచారు . మంటలతో ఇంట్లో నుంచి బయటకు వస్తున్న వారిని చూసి కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో విమల, జాన్ రాజు, రాజేశ్వరి, సునీత, పవిత్ర తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించి ఫస్ట్​ఎయిడ్ చేసి.. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో విమల చనిపోగా, కూతురు పవిత్రతో పాటు మరొకరికి సీరియస్ గా ఉందని డాక్టర్లు చెప్పారు.