- కరీంనగర్ జిల్లా నర్సింగాపూర్‌లో ఘటన
వీణవంక, వెలుగు : భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య సైతం అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన కొమరారెడ్డి(85), చిలుకవ్వ(79) దంపతులకు నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. దంపతులు కొడుకు, కోడలితో కలిసి గ్రామంలోనే ఉంటున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన కొమరారెడ్డి శుక్రవారం ఇంటి వద్దే చనిపోయాడు.
దీంతో భర్త మరణాన్ని తట్టుకోలేని చిలుకవ్వ సైతం అక్కడికక్కడే కన్నుమూసింది. దంపతులిద్దరూ ఒకే సారి చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, దంపతులు ఒకేసారి చనిపోయిన విషయం తెలుసుకున్న హుజూరాబాద్ ఏసీపీ మాధవి ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు.
