
- కత్తులతో పొడిచిన సుపారీ గ్యాంగ్
- చావు బతుకుల మధ్య భర్త
ఎల్బీనగర్ /మెహిదీపట్నం, వెలుగు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారీ ఇచ్చి భర్తను అంతం చేయాలని ప్లాన్చేసింది ఓ భార్య. సుపారీ గ్యాంగ్ భర్తను కత్తులతో పొడిచి చనిపోయాడనుకొని వదిలేసి పోయింది. తీవ్రంగా గాయపడిన బాధితుడు చావుబతుకు మధ్య ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. హైదరాబాద్‌లోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ఈ దారుణం జరిగింది. అమీర్‌పేట్‌కు చెందిన షేక్ ఒసామాకు ఏడాది కింద షైస్తా అనే మహిళతో పెండ్లయ్యింది.
దుబాయ్వెళ్తే డబ్బు బాగా సంపాదించవచ్చని, తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉండవని షైస్తా భర్తను ఒప్పించింది. దీంతో ఒసామా దుబాయ్ వెళ్లాడు. ఇక్కడే ఉన్న షైస్తా కు సమీర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇది వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన ఒసామాకు ఈ వ్యవహారం తెలిసి భార్యను నిలదీశాడు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్‌వేసింది. ప్రియుడితో కలిసి ఒసామాను చంపాలని సుపారీ గ్యాంగ్‌ను కలిసింది. వారు అడిగినంత డబ్బు ఇచ్చి భర్తను హత్యచేయాలని చెప్పింది.
సుపారీ తీసుకున్న గ్యాంగ్ సోమవారం రాత్రి ఒసామా ఇంటికి వస్తుండగా దాడి చేసి కత్తులతో పొడిచింది. అతను అపస్మారక స్థితికి వెళ్లడంతో చనిపోయాడనుకొని వెళ్లిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి చూడగా అతని బతికే ఉండడంతో ఆస్పత్రిలో చేర్చారు. ఒసామా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.