కొడుకుతో కలసి భర్తను చంపిన భార్య

కొడుకుతో కలసి భర్తను చంపిన భార్య

గద్వాల, వెలుగు: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి చనిపోగా ఇన్వెస్టిగేషన్​లో అది మర్డర్​గా తేలింది. మృతుడి భార్య, కొడుకు కలిసి అతడిని చంపారని అలంపూర్ సీఐ సూర్య నాయక్ తెలిపారు. మంగళవారం కోదండాపురం పీఎస్​లో ఆయన వివరాలు తెలిపారు. ఇటిక్యాల మండలం పుట్టానుదొడ్డి గ్రామానికి చెందిన మూల సోమన్న, మూల లక్ష్మీదేవిలు భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కొడుకులున్నారు.  ఈనెల 18న మూల సోమన్న(51) చనిపోయాడు. భార్య లక్ష్మీదేవి, చిన్న కొడుకు పరశురాముడు సోమన్న గుండెనొప్పితో చనిపోయాడని అందరినీ నమ్మించారు. గొంతుపై గాయాలు ఉండడంతో అనుమానం వచ్చిన ఇతర కుటుంబసభ్యులు ప్రశ్నించగా  ఏమీ తెలియనట్లు పోలీసులకు కంప్లయింట్​ చేశారు. అయితే పోలీసుల అనుమానానికి పోస్ట్​మార్టం రిపోర్ట్​ ఆధారమైంది. అందులో గొంతు పిసకడం వల్లే సోమన్న చనిపోయాడని తేలడంతో లక్ష్మీదేవిని గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. 
అనుమానం అంతం చేసింది 
లక్ష్మీదేవి, సోమన్న మధ్య 20 ఏండ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని సోమన్న ఆమెను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడు. కొంతకాలంగా ఇది ఎక్కువైంది. భార్య ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆమెకు తెలియకుండా వెళ్తూ గమనిస్తున్నాడు. చిన్న కొడుకు పరశురాముడు, లక్ష్మీదేవి ఎంత చెప్పినా వినడం లేదు. ఈనెల 17న ఈ విషయమై భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. అదే రోజు రాత్రి తల్లి ఇంటి ముందు ఏడ్చుకుంటూ కూర్చోగా పరశురాముడు ఏమైందని అడిగాడు. విషయం చెప్పడంతో కోపంతో తండ్రిపై కూర్చున్నాడు. తల్లి అరవకుండా నోరు మూయగా గొంతు పిసికి చంపేశాడు. కేసును 302,182 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద నమోదు చేసి ఇద్దరిని రిమాండ్ తరలించారు. ఈ కేసును చేధించడంలో కీలకంగా వ్యవహరించిన కొండాపురం ఎస్సై వెంకటస్వామిని సీఐ అభినందించారు.