పెరిగిన వన్యప్రాణులు..నిజామాబాద్ జిల్లాలోని ఏడు ఫారెస్ట్ రేంజ్ లలో సంతతి వృద్ధి

పెరిగిన వన్యప్రాణులు..నిజామాబాద్ జిల్లాలోని ఏడు ఫారెస్ట్ రేంజ్ లలో సంతతి వృద్ధి
  • చిరుతలు 88, ఎలుగుబంట్లు 51
  •  90 కి మించి సాంబార్ జింకలు, 160 నీల్​గాయ్​లు
  •  500 జింకలు, 55 డోలే కుక్కలువందల సంఖ్యలో నెమళ్లు

నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్​జిల్లాలో వన్యప్రాణుల సంతతి రెట్టింపైంది.  86 వేల హెక్టార్లలో ఫారెస్ట్ విస్తరించి ఉంది. అటవీ శాఖ 7 ఫారెస్ట్​ రేంజ్​లుగా విభజించింది. నిజామాబాద్​ నార్త్​, సౌత్​, ఇందల్వాయి, వర్ని, సిరికొండ, కమ్మర్​పల్లి, ఆర్మూర్ రేంజ్​లు ఉన్నాయి. అన్ని జోన్లలో వన్యప్రాణులు పెరిగాయి. ఇటీవల సీసీ కెమెరాల ఆధారంగా జంతువులను ఫారెస్ట్ అధికారులు లెక్కించారు. 88 చిరుతలు, 51 ఎలుగుబంట్లు, 90కి మించి సాంబార్ జింకలు, 160 నీల్​గాయ్​లు, 500 జింకలు, 55 డోలే కుక్కలు ఉన్నట్లు తేలింది.

వేల సంఖ్యలో కుందేళ్లు, వందల సంఖ్యలో నెమళ్లు, అడవి పందులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఏనుగు, పులి, సింహం తప్ప అన్నిరకాల జంతువులు జిల్లా ఫారెస్ట్​లో ఉన్నట్లు తేల్చారు. ఐదేండ్లలో వన్యప్రాణులు 40 శాతానికి పెరిగాయి. చిరుతల సంఖ్య పెరగడంతో అప్పుడప్పుడు జనసంచారంలోకి వస్తుండడం కలకలం రేపుతోంది. ఇందూర్​ నగర శివారులోని డంపింగ్ యార్డు వద్దకు ఈ నెల 8న, నాగారం కాలనీ బార్డర్​లో జూలై 14న చిరుత సంచరించడం ఆ ప్రాంతవాసులను వణికిస్తోంది.

జూలై 26న నవీపేట మండలం నందిగావ్​, 24న సిరన్ పల్లిలో నాలుగు మేకలను ఎత్తుకెళ్లాయి.  కమలాపూర్, అల్జాపూర్, అబ్బాపూర్ (ఎం)లో చిరుతలను పట్టుకునేందుకు బోనులు ఏర్పాటు చేసినా అవి చిక్కలేదు. జూలై 17న సిరికొండ మండలం పాకాల విలేజ్ శివారులో చిరుత లేగదూడను చంపి తిన్నది. జూలై 10న ఎడపల్లి మండలం జాన్కంపేట బార్డర్​లో సందీప్​కు చెందిన నాలుగు మేకలను ఎత్తుకెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డైంది.  అక్కడి పోలీస్​ ట్రైనింగ్ క్యాంప్, ఠాణాకాలాన్  గ్రామంలో చిరుతల సంచారం బెంబేలెత్తిస్తోంది.

ఫారెస్ట్​కు చేరువగా ఉన్న గ్రామాల ప్రజలు సాయంత్రం అయ్యిందంటే ఇండ్లకే పరిమితమవుతున్నారు. మరోపక్క రాత్రివేళ రోడ్డు దాటే క్రమంలో వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. జూలై నెలలో మంచిప్ప, ఇందల్వాయి, కుర్నాపల్లిలో లారీలు ఢీకొని ఎలుగుబంట్లు మృతి చెందాయి. దీంతో ఇందల్వాయి మండలం చంద్రాయన్​పల్లి నుంచి తిర్మన్​పల్లి హైవే రోడ్డు పక్కన,  డిచ్​పల్లి మండలంలోని ఫారెస్ట్​ రోడ్డులో కంచెలు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాత మిగతా అటవీ ప్రాంతాల్లోనూ కంచెలను నిర్మించనున్నారు. 

ఫెన్సింగ్ ఏర్పాటుకు కృషి..

హైవే రోడ్ల పక్కన ఫారెస్ట్​కు ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నాం. పెరిగిన వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత ఉంది. చిరుతల సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. - రవి మోహన్​భట్, రేంజ్ ఆఫీసర్, ఇందల్వాయి