తెలంగాణలో టీడీపీకి బలమైన నాయకత్వం ఉంది : కాసాని

తెలంగాణలో టీడీపీకి బలమైన నాయకత్వం ఉంది : కాసాని
  • రాష్ట్రంలో టీడీపీకి బలమైన నాయకత్వం ఉంది
  • క్యాండిడేట్లను చంద్రబాబే ఫైనల్ చేస్తారని కామెంట్

హైదరాబాద్, వెలుగు: టీడీపీకి రాష్ట్రంలో బలమైన నాయకత్వం ఉందని,119 సీట్లలో అభ్యర్థులను ప్రకటిస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. టీడీపీలో కొత్త లీడర్​షిప్ తయారవుతున్నదని, అందరూ కలిసికట్టుగా పని చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షతన ఆదివారం పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏడాది కాలంలో ఖమ్మంలో బహిరంగ సభ, ఇంటింటికీ టీడీపీ, కరీంనగర్ శంఖారావం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టామని గుర్తు చేశారు. 119 నియోజకవర్గాల్లోని బ్యాలెట్ పేపర్లపై సైకిల్ గుర్తు ఉండాలనేది తమ తపన అని అన్నారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పార్టీ నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును 44 రోజులుగా అక్రమంగా, అన్యాయంగా జైల్లో పెట్టారన్నారు. టీడీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఏపీ ప్రభుత్వం ఆయనపై తప్పుడు కేసులు పెట్టిందని విమర్శించారు.

ఒకటి రెండు రోజుల్లో జాబితా

టీడీపీ తరఫున పోటీ చేసేందుకు 190కు పైగా అప్లికేషన్లు వచ్చాయని కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను రెండు రోజుల్లో చంద్రబాబును కలిసి ఇస్తామన్నారు. వీరిలో అర్హులైన వారిని చంద్రబాబే ఫైనల్ చేస్తారని, వారికే బీఫామ్​లు ఇస్తామని వివరించారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా.. అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. టీడీపీ పోటీ చేయడం లేదని కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటిని తిప్పి కొట్టాలని తెలిపారు. టీడీపీ బీసీల పార్టీ అని, ఎన్టీఆర్ ఈ పార్టీ పెట్టిందే.. బడుగు, బలహీన వర్గాల చైతన్యం కోసమని క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు తెలిపారు. సమావేశంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు ప్రేమ్ కుమార్ జైన్, జ్యోత్స్న, కార్యదర్శి కాసాని వీరేశ్, పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.