31న సిట్ ఎదుట హాజరవుతా..ఎంక్వైరీకి సహకరిస్తా : ప్రజ్వల్ రేవణ్ణ

  31న సిట్ ఎదుట హాజరవుతా..ఎంక్వైరీకి సహకరిస్తా :  ప్రజ్వల్  రేవణ్ణ
  •     లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్‌‌‌‌‌‌‌‌‌‌ 
  •     జర్మనీ నుంచి వీడియో విడుదల
  •     తనపై నమోదైనవన్నీ తప్పుడు కేసులే అని కామెంట్

బెంగళూరు :  తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో ఈనెల 31 ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట హాజరవుతానని కర్నాటక ఎంపీ, జేడీఎస్  నేత ప్రజ్వల్  రేవణ్ణ తెలిపారు. దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తానని ఆయన చెప్పారు. ఈ మేరకు జర్మనీ నుంచి ఆయన ఓ వీడియో రిలీజ్  చేశారు. ‘‘నన్ను అపార్థం చేసుకోవద్దు. ఈనెల 31న ఉదయం 10 గంటలకు సిట్  ఎదుట ఉంటా. మన దేశ న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. నాపై నమోదైనవన్నీ తప్పుడు కేసులే. రాజకీయ కుట్రతోనే నాపై కేసులు వేశారు. 

దీంతో నేను కుంగుబాటుకు గురై ఒంటరిగా వెళ్లిపోయాను. నా ఆచూకీ గురించి తెలపనందుకు నా కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకు, చిన్నాయన కుమారస్వామికి సారీ చెబుతున్నా” అని ఆ వీడియోలో 33 ఏండ్ల ప్రజ్వల్  పేర్కొన్నారు. గత నెల 26న కర్నాటకలో ఎన్నికలు పూర్తయినపుడు తనపై ఎలాంటి కేసులు లేవని, సిట్  ఏర్పాటు చేయలేదని ఆయన చెప్పారు. 

దేశం నుంచి తాను వెళ్లిపోయిన రెండు, మూడు రోజుల తర్వాత యూట్యూబ్ లో తనపై ఆరోపణలు చూశానని చెప్పారు. దీంతో తనకు వారం రోజుల టైం కావాలని సిట్ కు తన లాయర్ తో లెటర్  రాయించానని వెల్లడించారు. తన కేసు గురించి కాంగ్రెస్  లీడర్  రాహుల్  గాంధీ, ప్రతిపక్ష నేతలు బహిరంగంగా మాట్లాడారని, ఇదొక రాజకీయ కుట్ర అని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమిలో జేడీఎస్  భాగస్వామి కావడంతోనే తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 

తాతయ్య హెచ్చరించిన తర్వాత వీడియో

లైంగిక వేధింపుల కేసులో దేశానికి తిరిగివచ్చి పోలీసులకు లొంగిపోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని తన తాత హెచ్ డీ దేవెగౌడ హెచ్చరించిన మూడు రోజుల తర్వాత ప్రజ్వల్  ఆ వీడియో రిలీజ్  చేశారు. జర్మనీలో ఆయన ఆచూకీ కనుగొన్నారు. అలాగే ప్రజ్వల్ తో పాటు ఆయన తండ్రి హెచ్ డీ రేవణ్ణపైనా రెండు లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. 

వంటమనిషిని లైంగికంగా వేధించారని ఒక కేసు, ఒక మహిళను కిడ్నాప్  చేశారని మరో కేసు ఆయనపై నమోదైంది. వంటమనిషిని ప్రజ్వల్  కూడా లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం రేవణ్ణ బెయిల్ పై బయట ఉన్నారు. కాగా, ప్రజ్వల్  వీడియోపై జేడీఎస్  అధ్యక్షుడు కుమారస్వామి మాట్లాడుతూ.. స్వదేశానికి తిరిగి రావాలని తాము చేసిన రిక్వెస్టులకు ఇప్పటికైనా ప్రజ్వల్  స్పందించాడన్నారు. పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పినందుకు తనకు సంతోషంగా ఉందన్నారు.