2027 వరల్డ్ కప్‌లో బుమ్రా, భువీ ఆడతారా?.. అశ్విన్ బిగ్ స్టేట్‌మెంట్!

2027 వరల్డ్ కప్‌లో బుమ్రా, భువీ ఆడతారా?.. అశ్విన్ బిగ్ స్టేట్‌మెంట్!

Bhuvneshwar Kumar: భారత టీ20 జట్టులోకి అరంగేట్రం చేసిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) భవిష్యత్తుపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) ఆసక్తికరమైన జోస్యం చెప్పారు. న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికైన భువీ.. రాబోయే వన్డే ప్రపంచకప్‌లో జస్ప్రీత్ బుమ్రాతో కలిసి బౌలింగ్ చేసే అవకాశం ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన అశ్విన్, భువనేశ్వర్ కెరీర్, అతని బౌలింగ్ విన్యాసాలపై ప్రశంసల జల్లు కురిపించారు.

అన్ని ఫార్మాట్లలో కింగ్ అయ్యేవాడు: 

* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన కనబరిచిన భువీ.. 2025, 2026 ఐపీఎల్ టోర్నీల్లో కలిపి ఏకంగా 45 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా 2026 సీజన్‌లో 28 వికెట్లతో చెలరేగడమే ఆయన రీఎంట్రీకి మార్గం సుగమం చేసింది. 

* భువనేశ్వర్ కుమార్ చాలా నిరాడంబరుడైన వ్యక్తి.. అతను గాయాలపాలవకుండా, కొంచెం కష్టపడి ఉంటే తనకున్న అద్భుతమైన స్కిల్‌సెట్‌తో అన్ని ఫార్మాట్లలోనూ భారత్‌కు కింగ్‌లా ఉండేవాడు అని అశ్విన్ ప్రశంసించారు.

* బంతిని ఇరువైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం, మంచి పేస్, అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యాలు భువీ సొంతమని కొనియాడారు.

వన్డే జట్టులోకి కూడా రీఎంట్రీ పక్కా: 

* న్యూజిలాండ్ టూర్‌లో భువనేశ్వర్ కుమార్ తన ఫిట్‌నెస్ నిరూపించుకుంటే, సెలెక్టర్లు వెంటనే అతన్ని వన్డే జట్టులోకి కూడా పరిగణలోకి తీసుకుంటారని ఆర్. అశ్విన్ ధీమా వ్యక్తం చేశారు.

* అతను ఇప్పుడు న్యూజిలాండ్‌కు వెళ్తున్నాడు.. అక్కడ రాణిస్తే, అందరూ వెంటనే అతన్ని వన్డే జట్టులోకి కూడా తీసుకోవాలని కోరుకుంటారు. సెలెక్టర్లు కూడా దీనిని నిశితంగా పరిశీలిస్తారని పేర్కొన్నారు.

* సౌతాఫ్రికా గడ్డపై జరగనున్న ప్రపంచకప్‌లో జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ కలిసి కొత్త బంతితో బౌలింగ్ చేయడం తాను కచ్చితంగా చూడగలనని అశ్విన్ జోస్యం చెప్పారు.

బౌలింగ్ విభాగానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ లాంటివాడు: 

* వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్న నేపథ్యంలో.. భువనేశ్వర్ లాంటి సీనియర్ పేసర్ జట్టుకు ఎంతో అవసరమని అశ్విన్ అభిప్రాయపడ్డారు.

* ప్రస్తుత పరిస్థితుల్లో జట్టుకు అనుభవజ్ఞులైన బౌలర్లు అవసరమని, సౌతాఫ్రికా వంటి పిచ్‌లపై అనుభవం లేకపోతే ప్రత్యర్థులు ఎదురుదాడి చేస్తారని హెచ్చరించారు. 

* అందుకే సెలెక్టర్లు మళ్లీ భువీని టీ20 జట్టులో ఓ 'ఫిక్స్‌డ్ డిపాజిట్' (6 శాతం వడ్డీ లాంటి నమ్మకమైన ఆప్షన్) లాగా ఎంపిక చేశారని రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించారు.