ఇది నిజమేనా : సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అవుతున్నారా..?

ఇది నిజమేనా : సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అవుతున్నారా..?

దేశ వ్యాప్తంగా సంచలనం కల్గించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు మరోసారి రాజకీయంగా వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ఢిల్లీ మద్యం స్కాంను రెండు కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు దర్యాప్తు చేస్తున్నాయి. మద్యం కుంభకోణంలో అవకతవకలు, అవినీతి వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తుంటే..ఇందులో ఇమిడి ఉన్న మనీ లాండరింగ్ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు జరుపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ కేసు తీవ్ర ప్రకంపనలు రేపింది. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారా..?. ఇదే విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలా..? వద్దా..? అనే దానిపై ప్రజల అభిప్రాయాన్ని పొందాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. డిసెంబర్ 1 నుండి 20వ తేదీ వరకు సంతకాల  సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆప్ పార్టీ నిర్ణయించింది. ఆప్ పార్టీ లేకుండా చేయాలనే కుట్రలో భాగంగా బీజేపీ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ పేరు తీసుకొచ్చిందని ఆ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ఆరోపించారు.

"మై భీ కేజ్రీవాల్' అనే పేరుతో ఆప్ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఢిల్లీలోని 2 వేల 600 పోలింగ్ బూత్ లలోకి వెళ్లి ప్రజల సంతకాలను సేకరించనున్నారు. అంతేకాదు.. కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలా..? వద్దా..? అనే దానిపైనా ప్రజల అభిప్రాయం సేకరించనున్నారు. ఇప్పటికే ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఢిల్లీ మద్యం కేసులో సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు ఇప్పటికే ఈడీ సమన్లు జారీ చేసింది. 

2023, ఏప్రిల్‌లో ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో కేజ్రీవాల్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కీలకమైన భారత కూటమి నాయకులను లక్ష్యంగా చేసుకునే బీజేపీ ప్లాన్‌లో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రిని మొదట అరెస్టు చేస్తారని కేజ్రీవాల్ పార్టీ ఆరోపించింది. 

ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని, అందుకు ఆయనే సీఎంగా ఉండాలని ఇటీవలే మంత్రి అతిషి చెప్పారు. అవసరమైతే జైలులోనే కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు అనుమతి తీసుకుంటామన్నారు.