గద్వాల గర్భిణి మృతి కేసులో క్రిమినల్ చర్యలు తీసుకుంటరా?లేదా?

గద్వాల గర్భిణి మృతి కేసులో క్రిమినల్ చర్యలు తీసుకుంటరా?లేదా?
  • వచ్చే విచారణ సమయానికి చెప్పండి
  • ఆ డాక్టర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే చాలదు
  • గద్వాల గర్భిణి మృతి కేసులో సర్కారుకు హైకోర్టు ఆదేశం
  • తదుపరి విచారణ జూన్​ 10కి వాయిదా

హైదరాబాద్, వెలుగు: ‘‘సాటి మహిళ పురిటి నొప్పులతో వస్తే ఆరుగురు డాక్టర్లు దయలేకుండా ట్రీట్​మెంట్​ అందించేందుకు నిరాకరించారు. దీంతో 220 కిలోమీటర్లు ప్రయాణించి ఆరు ఆస్పత్రుల చుట్టూ తిరిగింది. చివరికి ప్రసవించిన తర్వాత ఆమెతోపాటు పసికందూ కన్నుమూశాడు. ఇంత దారుణానికి కారణమైన డాక్టర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటే చాలదు. వారిపై ఎఫ్‌ఐఆర్‌ పెట్టి క్రిమినల్‌ చర్యలు తీసుకుంటారో? లేదో? వచ్చే విచారణ సమయానికి చెప్పండి”అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గద్వాల జిల్లాకు చెందిన జెనీలా(20) అనే గర్భిణి కొద్దిరోజుల క్రితం పలు ఆస్పత్రులకు తిరిగినా కరోనా భయంతో ట్రీట్​మెంట్​ చేసేందుకు డాక్టర్లు నిరాకరించారు. దీంతో ఆమె గద్వాల నుంచి మహబూబ్‌నగర్, హైదరాబాద్‌ ఇలా 220 కిలోమీటర్లు ప్రయాణం చేసి పలు ఆస్పత్రులకు తిరగాల్సి వచ్చింది. చివరికి పేట్ల బురుజు ఆస్పత్రిలో ఆమెకు పురుడు పోశారు. అయితే ఆ తర్వాత బాబు, తల్లి చనిపోయారు. దీనిపై పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఇద్దరు లాయర్లు వేర్వేరుగా రాసిన లేఖలను హైకోర్టు పిల్‌గా స్వీకరించింది. ఈ ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం హైకోర్టుకు నివేదిక ఇచ్చింది. బుధవారం చీఫ్  జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల డివిజన్‌ బెంచ్‌ ఈ కేసుపై మరోసారి విచారణ జరిపింది.

శాఖాపరమైన చర్యలే అంటే ఎలా?

మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆప్పత్రి డాక్టర్లు ప్రశాంతి, రాధ, సుల్తాన్‌బజార్‌ మెటర్నిటీ ఆస్పత్రి డాక్టర్‌ అమృత, గాంధీ ఆస్పత్రి డాక్టర్లు మహాలక్ష్మి, అపూర్వ, షర్మిల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ధారించిందని, వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని అడ్పొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ చెప్పారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. దీనిపై స్పందించిన బెంచ్.. ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు శాఖాపరమైన చర్యలకే పరిమితమైతే ఎలాగని, కరోనా సమయంలోనూ అత్యవసర సేవలు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా పట్టించుకోని వారిపై చర్యలు తీసుకోకపోతే ఎలాగని ప్రశ్నించింది. తదుపరి విచారణను జూన్‌ 10న జరుపుతామని, అప్పటిలోగా ఆరుగురు డాక్టర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి క్రిమినల్​ చర్యలు తీసుకుంటారో? లేదో? చెప్పాలని ఆదేశించింది. ఇలాంటి ఘటనల్లో కఠిన చర్యలు తీసుకుని, ప్రజలకు ముఖ్యంగా వైద్య రంగానికి స్పష్టమైన సంకేతాలు పంపాలని సూచించింది.