సెక్రటేరియట్​లోని పచ్చదనంపై గొడ్డలి వేటు తప్పదా?

సెక్రటేరియట్​లోని పచ్చదనంపై గొడ్డలి వేటు తప్పదా?

ఈ చెట్లన్నీ కొట్టేసుడేనా?

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్​ నడిబొడ్డున 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో సెక్రటేరియెట్. దానిలో మర్రి, రావి, వేప, చింత, బాదాం, బొండు మల్లె, సుబాబుల్ ఇలా సుమారు వంద రకాల చెట్లు, మొక్కలు.. పచ్చదనం పరుచుకున్నట్లే ఉంటుంది. కానీ.. ఇప్పుడు ఆ పచ్చదనం గొడ్డలి వేటుకు కనుమరుగుకానుందా? సెక్రటేరియెట్​ను కూల్చి.. కొత్త సెక్రటేరియెట్​ను కట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇక్కడి చెట్లను, మొక్కలను కొట్టేస్తారేమోనని ఉద్యోగుల్లో, సందర్శకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇక్కడ సుమారు 700 చెట్లు, వేల సంఖ్యలో మొక్కలు ఉన్నాయి.  అందులో 50 ఏండ్ల నుంచి వందేండ్ల వయసున్న భారీ వృక్షాలు కూడా  ఉన్నాయి. వీటితో సెక్రటేరియట్‌‌ ఉద్యోగులకు దశాబ్దాల నుంచి అనుబంధం ఉంది. బ్రేక్​ టైమ్​లో ఉద్యోగులతోపాటు సందర్శకులు, అధికారుల కారు డ్రైవర్లంతా ఈ చెట్ల నీడలోనే సేద తీరుతుంటారు.

తొలగింపా.. వేరే ప్రాంతానికి తరలిస్తారా..?

వందల సంఖ్యలో ఉన్న చెట్లను తొలగించడమా, రీ లొకేట్ చేయడమా అన్న అంశంపై ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చ మొదలైంది. ఓ వైపు చెట్లను కాపాడాలె.. అడవులను పెంచాలని చెబుతూ, ఇన్ని వందల చెట్లను నరికివేస్తే  ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని అటవీశాఖ అధికారులు అంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున చెట్లను నరుకుతూ, ఎన్ని హరితహారాలు నిర్వహించినా వృథానేనని చెప్తున్నారు. రీలొకెట్ చేసి కనీసం అరుదైన, ఎక్కువ వయసున్న చెట్లనైనా కాపాడాలంటున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం నరికివేతకే మొగ్గు చూపుతున్నట్టు సెక్రటేరియట్‌‌ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ భారీ చెట్లు సుమారు వంద వరకు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని మాత్రం రీలొకెట్ చేసి, మిగతా వాటన్నింటిని నరికేయాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. సెక్రటేరియట్‌‌లోని ఏదో ఒక వైపు చెట్లను రీలొకెట్ చేస్తే బాగుంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేస్తే చెట్లను కాపాడడంతోపాటు, తక్కువ ఖర్చుతో పని పూర్తవుతుందని పేర్కొంటున్నారు.

ఒక్కసారి ఆలోచనజేయాలె

“35 ఏండ్లుగా ఇక్కడ్నే పనిచేస్తున్న. పోయిన నెల రిటైర్డ్ అయినా.. రోజూ సెక్రటేరియెట్‌కు రానిదే మనసు ఒప్పట్లేదు. మర్రి చెన్నారెడ్డి, ఎన్టీఆర్ కాలం నుంచి నేను పనిచేసిన. వాళ్లకు నచ్చినట్టు మార్పులు చేయించుకున్నరు. కానీ, ఎవరూ బిల్డింగులు కూలగొట్టలేదు. ఇక్కడ ఒక్కో చెట్టుకు 50 నుంచి వందేండ్ల వయసుంటది. ఇవన్నీ కొట్టేస్తరంటే పాణం సయిస్తలేదు. మళ్లీ ఇంత పెద్ద చెట్లు కావాల్నంటే అయితయా!  ఒక్కసారి ఆలోచనజేయాలె.” –  అనసూయ, రిటైర్డ్‌ స్వీపర్‌‌