గుడ్ న్యూస్.. జీఎస్టీ భారం 50 శాతం తగ్గే అవకాశం.. జీఎస్టీ 2.0లో జరగబోయే మార్పులు ఇవే..

 గుడ్ న్యూస్.. జీఎస్టీ భారం 50 శాతం తగ్గే అవకాశం.. జీఎస్టీ  2.0లో జరగబోయే మార్పులు ఇవే..

ఒకే దేశం  ఒకే పన్ను  అనే  నినాదంతో  2017లో  ప్రారంభించినప్పటినుంచి  జీఎస్టీ దేశ పరోక్ష పన్ను నిర్మాణాన్ని ఏకీకృతం చేసింది.  దేశంలో  క్లిష్టమైన పరోక్ష పన్నుల విధానాన్ని జీఎస్టీ ద్వారా సరళీకరించారు.  పారదర్శకతను  పెంచి తద్వారా  ప్రభుత్వానికి  ఆదాయం  పెరిగేలా చేయడమనే ఉద్దేశంతో  ప్రారంభించిన  జీఎస్టీ.. తన ఉద్దేశాన్ని నెరవేర్చడంతోపాటు, దేశానికీ  ప్రతిఏటా లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని  తెచ్చిపెడుతోంది.  

జీఎస్టీ  ద్వారా దేశంలో జరిగే  వ్యాపార, వాణిజ్య లావాదేవీలలో  కచ్చితత్వం, పారదర్శకత పెరిగింది.  2017-18 లో జీఎస్టీ ద్వారా సుమారు రూజ 7.19 లక్షల కోట్లు వసూల్ కాగా,  అది 2024-25 నాటికి సుమారు రూ. 22.09 లక్షల కోట్లకు పెరిగింది. దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా, ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న జీఎస్టీలో  కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తం అయింది.

ఆగస్టు 15 స్వాతంత్య్ర  దినోత్సవం రోజున ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి   ప్రధాని మోదీ తన ప్రసంగంలో రానున్న దీపావళికి కానుకగా జీఎస్టీలో భారీ మార్పులు చేయబోతున్నట్లు ప్రకటించారు. జీఎస్టీ  2.0లో జరగబోయే సంస్కరణలు ఏమిటి?  వీటిద్వారా పేద,  మధ్య తరగతికి ఊరట ఉంటుందా?  జీఎస్టీ పన్నులు తగ్గడం వలన ఆర్థికవ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? వంటివి కీలక ప్రశ్నలు.

రెండు స్లాబులు

ప్రతిపాదిత  జీఎస్టీ 2.0లో  కేవలం రెండు స్లాబులు మాత్రమే ఉండబోతున్నట్లు సమాచారం.  మొత్తం స్లాబులను 5,  18 శాతంగా వర్గీకరించనున్నారు. అంటే, 12 శాతం, 28 శాతం స్లాబులను  తొలగించనున్నారు.  అత్యంత విలాసవంతమైన వస్తువులను అలాగే  పొగాకుతో సహా  హానికారకంగా గుర్తించిన మొత్తం 7 అంశాలపై 40 శాతం పన్ను వేయనున్నారు.  దాదాపుగా 28 శాతం స్లాబులో ఉన్న 80 నుంచి 90 శాతం వస్తువులను 18 శాతం స్లాబులో చేర్చే అవకాశం ఉన్నది.

  ఫలితంగా కార్లు,  ప్రీమియం మోటార్ సైకిల్,  ఏసీ, ఫ్రిజ్​లు, లగ్జరీ కార్లు వంటి వస్తువుల ధరలు తగ్గుతాయి.  ఇక సిగిరెట్ ఇతర హానికర వస్తువులను 40 శాతం స్లాబుకు చేర్చడం ద్వారా వాటి ధరలు పెరగనున్నాయి.  ప్రస్తుతం 12శాతం స్లాబులో ఉన్న 90 శాతం వస్తువులను 5 శాతం స్లాబుకు బదిలీ చేసే అవకాశం ఉన్నది.  ఫలితంగా,    ఫుడ్ ఐటమ్స్, మొబైల్ ఫోన్స్,  ల్యాప్ టాప్, కంప్యూటర్స్,  సేవారంగంలో  కొన్ని కీలకమైన రంగాల  వస్తువుల ధరలు తగ్గుతాయి.  

ఆర్థిక స్ట్రాటజీ

హెల్త్ ఇన్సూరెన్సు,  లైఫ్ ఇన్సూరెన్సులపై విధిస్తున్న 18 శాతం  జీఎస్టీని 5 శాతం స్లాబ్ కు  చేర్చే అవకాశం ఉన్నది.  దీనివల్ల దేశంలో బీమా  పాలసీలు చౌకగా లభించే అవకాశం ఉన్నది.  హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ  ధరలు తగ్గుదల వలన ఆయా పాలసీలకు డిమాండ్ పెరుగుతుంది.  సామాన్యుడిపై  వైద్య ఖర్చుల భారం తగ్గనుంది. అటు ప్రభుత్వాలకు కూడా ప్రజా వైద్య భారాలు తగ్గుతాయి. దేశంలో  బీమా రంగం మార్కెట్ పెరగనుంది.  

వాహనాలు, హోటల్స్ అండ్ టూరిజం, రియల్ ఎస్టేట్ వంటి రంగాలకు డిమాండ్ పెరగబోతుంది. అంతేకాకుండా  వ్యవసాయం, టెక్స్​టైల్స్,  ఆటో విడి భాగాలు, చేతివృత్తులు, వైద్య పరికరాలు వంటి రంగాల  వస్తువులను 5 శాతం స్లాబులోకి చేర్చడం ద్వారా  ఆయా వస్తువుల ధరలు విపరీతంగా తగ్గుతాయి.  ఇది ఒకవిధంగా పేద, మధ్య తరగతి వారికి మేలు చేసేదే. 

వినియోగదారుడికి మిగులు

2024-–25 ఆర్థిక సంవత్సరంలో  జీఎస్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సుమారు 22 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి.  అంటే,  నెలకు  సగటున సుమారు  రూ.1.8 లక్షల కోట్ల ఆదాయం.  గణాంకాల ప్రకారం మొత్తం  జీఎస్టీ ఆదాయంలో  సుమారు 70 శాతం ఆదాయం కేవలం 18 శాతం స్లాబ్ నుంచి మాత్రమే వస్తుంది. 12 శాతం స్లాబు నుంచి వచ్చే ఆదాయం కేవలం 5 శాతం ఆదాయం మాత్రమే.  5 శాతం స్లాబు నుంచి కేవలం 7 శాతం ఆదాయం మాత్రమే వస్తుంది.  

ఈ 12 శాతం స్లాబులోని వస్తువులను 5 శాతం స్లాబులోనికి తీసుకురావడం ద్వారా పెద్దగా ఆదాయ ప్రభావం ఉండకపోవచ్చు.  12 శాతం స్లాబులో ఉన్న నెయ్యి,  పండ్ల రసాలు, మొబైల్ ఫోన్ వంటి మొత్తం 14 రకాల ఉత్పతులు 5 శాతం స్లాబుకు చేర్చి 28 శాతం స్లాబులోని ఏసీ,  కార్ల వంటి ఉత్పతులు 18 శాతం స్లాబులోకి చేర్చడం ద్వారా కేంద్రానికి నష్టమేమీ ఉండదు. ఎందుకంటే, 28 శాతం స్లాబులో ఉన్న విలాసవంతమైన,  ఆరోగ్య హానికర వస్తువులను 40 శాతానికి చేర్చడం ద్వారా ఆదాయం పెరుగుతుంది.

  అలాగే, 12,  28 శాతం స్లాబ్ వస్తువులను 5, 18 శాతం స్లాబుకు చేర్చడం ద్వారా ‘వినియోగదారుని మిగులు’ పెరుగుతుంది. ఉదాహరణకు ప్రస్తుతం 12 శాతం స్లాబులో ఉన్న నెయ్యి ధర 100 రూపాయల  ఉంటే,  5 శాతం స్లాబుకు చేర్చడం ద్వారా దాని విలువ మార్కెట్ లో రూ.70 పడిపోతుంది. అప్పుడు వినియోగదారునికి 30 రూపాయలు మిగులుతాయి. తిరిగి ఆ 30 రూపాయలను ఇతర వస్తువులపై వెచ్చించడం ద్వారా  కేంద్ర ప్రభుత్వానికి ఆయా వస్తువులపై పన్ను చేరుతుంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రాబడిలో ఏమాత్రం తగ్గుదల ఉండదు. 

50 శాతం జీఎస్టీ భారం తగ్గే అవకాశం

జీఎస్టీ 2.0 ద్వారా దేశీయ వినియోగం పెరుగుతుంది. ఇది ఒకవిధంగా  అమెరికా విధించిన 50 శాతం పన్ను భారం పడకుండా మన ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయనుంది.   దేశంలోని ఎమ్.ఎస్. ఎమ్.ఈ ల ఉత్పతులపై పన్నులు తగ్గడం ద్వారా వాటి మార్కెట్ డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా, ఆయా సంస్థల ఆర్థిక స్థిరత్వానికి దారి తీస్తుంది.  ద్రవ్యోల్బణం కూడా తగ్గి దేశ జీడీపీ పెరుగుతుంది. ఇప్పటికే రాష్టాల ఆర్థిక మంత్రులతో  కూడిన   కమిటీకి ఈ  ప్రతిపాదనలను  కేంద్రం  పంపించింది.

దీనిపై కమిటీ చర్చించి జీఎస్టీ మండలికి తగు సిఫారసులు చేస్తుంది. ఒకవేళ సవరించిన సిఫార్సులను జీఎస్టీ  కౌన్సిల్ ఆమోదిస్తే అప్పుడు స్లాబుల మార్పు వీలవుతుంది.   కేంద్రం దీపావళి ముందునాటికి  ఈ స్లాబుల కుదింపు అంశం ఒక కొలిక్కి తెచ్చి  దేశప్రజలకు  దీపావళి  ముందు అమలుచేసే అవకాశం ఉన్నది.

- డా. రామకృష్ణ బండారు,   కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్,  సెంట్రల్ వర్సిటీ ఆఫ్ కేరళ–