ఇటీవల పత్రికలలో, మీడియాలో హైదరాబాద్ నగరం అతి పెద్ద నగరంగా అవతరించిందనే ప్రధాన శీర్షికల వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. హైదరాబాద్ నగరం విస్తృతి వేరు. నగర పాలక సంస్థ విస్తృతి వేరు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విస్తరించింది. స్థానిక ప్రభుత్వ పరిధి పెరిగిందనే శీర్షిక ఎక్కడా కనపడలేదు. ప్రభుత్వం ఇచ్చే సమాచారాన్ని ప్రజలకు విడమరిచి చెప్పాల్సిన బాధ్యత మీడియా మీద ఉన్నది.
నగర పాలనా సంస్థ పరిధికి, నగర విస్తృతికి మధ్య సంబంధం ఉన్నా నగరాభివృద్ధిలో ఆ లంకె ఉండదు. భారతదేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడడం ఎంత కఠినమో, కొత్త జిల్లాలు ఏర్పడడం ఎంత సులువో, ఒక నగర పాలక సంస్థ పరిధి పెంచడం అంతకంటే సులువుగా మారింది. స్వాతంత్ర్య భారత్‌లో 3 రకాల ప్రభుత్వాలు రాజ్యాంగంలో నిర్వచించారు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక పంచాయతీ, మున్సిపల్ ప్రభుత్వాలు. వీటి పరిధిలో అనేక మార్పులు గత కొన్ని ఏండ్లుగా జరుగుతున్నాయి.
గత తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్, పంచా యతీ చట్టాలను సవరించింది. అధికారుల పాలనకు ఆస్కారం కల్పించింది. ప్రజా ప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చింది. చెట్లు నాటకపోతే, చెట్లు నరికితే కూడా సర్పంచులను తొలగించే అధికారం అదనపు జిల్లా కలెక్టర్లకు ఒక చట్టం ద్వారా కట్టబెట్టింది. తెలంగాణలో పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 37 ప్రకారం నిధుల
దుర్వినియోగం, విధులను నిర్వర్తించకపోవడం లేదా చెట్ల నరికివేత వంటి అనధికార కార్యకలాపాలకు పాల్పడినందుకు సర్పంచ్‌లను తొలగించిన కేసులు నమోదయ్యాయి. 2019 చట్టం మున్సిపల్ స్వయంప్రతిపత్తిని బలహీనపరిచిందని, కలెక్టర్లు, కమిషనర్లకు అధికారాలను ఇచ్చిందని స్థానిక సంస్థల ప్రతినిధులు వాదిస్తున్నారు. కౌన్సిల్లర్లు, కార్పొరేటర్లు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జడ్సీటీసీలతో సహా ఎవరూ కూడా విడిగా, కలిసి కూడా ఏమీ చేయలేని స్థితికి స్థానిక ప్రభుత్వాలను దిగజార్చారు. మొత్తం పంచాయతీలు, మున్సిపల్ సంస్థలు అన్నీ కూడా అధికారుల పాలనలో, కేంద్రీకృత పాలనలో బందీ అయినాయి. ఈనాటి హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధి విస్తరణకు ఒక్కటే లక్ష్యం. కేంద్రీకృత అధికార పాలన.
ఇది రెండోసారి విస్తరణ
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ద్వారా 27 మున్సిపాలిటీలను నగరంలో కలిపింది. హైదరాబాద్ నగర విస్తరణ ఇది మొదటిసారి కాదు. 2007లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీహెచ్)ను చుట్టుపక్కల 12 మున్సిపాలిటీలు, 8 గ్రామ పంచాయతీలతో విలీనం చేయడం ద్వారా జీహెచ్ఎంసీ అధికారికంగా ఏర్పడింది. హైదరాబాద్‌ను మెట్రోపాలిటన్ పౌర సంస్థగా మార్చిన మొదటి పెద్ద విస్తరణ ఇది. గత 40 సంవత్సరాలలో హైదరాబాద్ మున్సిపల్ ప్రాంతం నాటకీయంగా విస్తరించింది. 1980లలో హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కింద దాదాపు 54 చదరపు కిలోమీటర్లు ఉండేది.
2007లో జీహెచ్ఎంసీ ఏర్పడినప్పుడు 625 చదరపు కిలోమీటర్లకు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లోపల చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీల విలీనం తర్వాత 2025లో 2,053 చదరపు కిలోమీటర్లకు చేరుకుంది. ఈ విధంగా అతి పెద్ద నగర పాలక సంస్థగా జీహెచ్ఎంసీ మారింది. ప్రభుత్వం దీనిని 3 లేదా 6 కార్పొరేషన్లుగా మార్చి, వాటిని ఏకీకృతం చేసి ఒక అథారిటీ కిందకు తేవాలని ప్రణాళిక అట! విలీనం, విడగొట్టడం, ఏకీకృతం, చివరికి ఒకే సంస్థ కిందకు తేవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమి ఉంటుంది?
విలీనం ఎందుకు?
తెలంగాణ ప్రభుత్వం ప్రకారం నిధులు ఒకే దగ్గర చేసి బృహత్ ప్రణాళికలు చేయవచ్చని పైకి చెబుతున్నా ఆఖరికి ఇది ‘సామ్రాజ్యవాద’ విలీనాన్ని తలపిస్తుంది. 27 మున్సిపాలిటీలు ఇందులో కలిస్తే వాటికి వచ్చే ప్రయోజనాలు విడమరిచి చెప్పడం లేదు. ఆయా పురపాలక సంస్థలలో ప్రస్తుతం ఉన్న సమస్యలకు విలీనం ఏ విధంగా పరిష్కారం అవుతుందో అంతుపట్టడం లేదు. 2007లో విలీనమైన ప్రాంతాలలో పౌర సమస్యలు ఇంకా జటిలం అయినాయి.
సంస్థాగత వ్యవస్థను పెద్దగా చేయడం వల్ల, కేంద్రీకృతం చేయడం వల్ల సమస్యలు పెరుగుతాయి తప్పితే తగ్గే అవకాశం లేదు. విలీనం చేసి, మళ్లీ తెగ్గొడుతామంటున్నారు. ఈ ఆలోచనా విధానం పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకం. భవనాల అనుమతుల ఆదాయం, ఆస్తి పన్ను వగైరా ఆదాయ వనరులు ఇప్పుడు మహానగర పురపాలక సంస్థకు చేరుతాయి.
అయితే జీహెచ్ఎంసీ నిధుల
సేకరణలో చాలా వెనుకబడి ఉన్నది. 625 చ.కి.మీ విస్తీర్ణంలో దాని ఆదాయం రూ.3,500 కోట్లు మించలేదు. ఇప్పుడు 2 వేల చ.కి.మీ పరిధిలో కనీసం రూ.10 వేల కోట్లకు చేరాలి. చేరుతుందా? చేరితే దేనిమీద ఖర్చు పెడతారు? దేని మీద ఖర్చు పెట్టాలని ఎవరు, ఏ విధంగా నిర్ణయిస్తారు? ఈ ప్రశ్నలకు జవాబు బట్టి విలీనం మంచిదా, అవసరమా వంటి అనుమానాలు నివృత్తి అవుతాయి.
జీహెచ్ఎంసీ ఆదాయం రూ.5వేల కోట్లలోపే!
హైదరాబాద్ నగరం స్థూల ఆదాయం దాదాపు రూ.8 లక్షల కోట్లుగా లెక్క వేశారు. అయితే, నగర పాలక సంస్థ మొత్తం ఆదాయం కేవలం రూ.5 వేల కోట్లు లోపు మాత్రమే. అందులో పన్నుల ద్వారా ఆదాయం కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే. ఇప్పుడు 27 పురపాలక సంస్థలు విలీనం ద్వారా బహుశా ఇంకొక 25 శాతం పెరుగుతుండవచ్చు. అన్నీ కూడితే వనరులు పెరుగుతాయి, పెద్ద పనులు చేయవచ్చు అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. విలీనం వలన ఎక్కువ పెట్టుబడులు వస్తాయి అంటున్నారు.
ఎంత ఎక్కువ ప్రైవేటు పెట్టుబడులు వస్తే, నగరం ఎంత విస్తరిస్తే ఆమేరకు మౌలిక వసతుల మీద పురపాలక సంస్థ పెట్టుబడులు పెట్టాలి. ఆ పెట్టుబడులకు నిధులు కావాలి. నిధులు రాబట్టడానికి పన్నులు ఒక్కటే మార్గం. ఇతరత్రా భూములు అమ్ముకోవడం. గత పదేండ్లలో పన్నులు పెంచలేదు. ఇక మిగిలింది భూములు అమ్ముకోవడం. ఈ భూముల కోసం ఈ విలీనం కావచ్చు. 625 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న పురపాలక భూములు ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్ తదితర సంస్థలకు ఇచ్చారు. 2,053 చదరపు కిలోమీటర్లలో ఉన్న భూములు నిధుల కోసం, అప్పులు తీర్చటానికి, వడ్డీ కట్టడానికి ఉపయోగపడతాయి.
అర్బన్ కమిషన్ ఏర్పాటు చేయాలి
హైదరాబాద్ నగరపాలక సంస్థ అతి పెద్దదిగా మారుతున్నదని సంతోషించేవారు ఇతర నగరాల ఆదాయం చూడాలి. భారతదేశంలోని ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లు (ఎఫ్వై 2025–26 బడ్జెట్లు). ముంబై (బీఎంసీ) రూ.43,159 కోట్ల ఆదాయం. చెన్నై (జీసీసీ) రూ.8,267 కోట్ల మొత్తం వసూళ్లు. బెంగళూరు (బీబీఎంపీ) రూ.19,930 కోట్ల బడ్జెట్ వ్యయం. ఢిల్లీ (ఎంసీడీ) జనవరి 2025 వరకు రూ.1,908 కోట్లు వసూలు అయ్యాయి (రూ.4,300 కోట్ల లక్ష్యం).
న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) రూ.4,444 కోట్ల ఆదాయ వసూళ్లు (ఎఫ్వై 2024–25). మొత్తానికి హైదరాబాద్ నగరపాలక సంస్థ పెరుగుదల కేవలం ఒక బుడగలాంటి పెరుగుదల. తాజా విలీనంలో ప్రజా ప్రయోజనాలు ఏమీ లేవు. ఈ విలీనం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు. విలీనం వల్ల ప్రజాస్వామిక పాలన తగ్గి అధికార పాలన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ నగరానికి ఇదివరకు సిఫారసు చేసిన అర్బన్ కమిషన్ ఏర్పాటు చేస్తే పరిష్కారాలు లభించవచ్చు.
ప్రస్తుతం ఉన్న వివిధ బాధ్యతలు ఉన్న వివిధ సంస్థల మధ్య సమన్వయానికి ఈ కమిషన్ ద్వారా సాధ్యం చేయవచ్చు. హైదరాబాద్ నగరానికి ఒక కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చెయ్యాలి. ప్రస్తుత భూమి వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక బృహత్ ప్రణాళిక తయారు చేస్తే ఈ విలీనం వల్ల కొంత సౌలభ్యం లభించవచ్చు.
పట్టణీకరణకు ఆజ్యం
ప్రభుత్వ పెట్టుబడులన్నీ రాజధాని, నగరాలు, పెద్ద పట్టణాలు, చిన్న పట్టణాలకు పరిమితం చేయడం వల్ల
పల్లె ప్రజలకు పట్టణాలకు చేరడం తప్ప వేరే దారి లేదు. పల్లె ఆర్థిక వ్యవస్థలను విధ్వంసం చేస్తూ, విద్య, ఉద్యోగ కల్పన, జీవనోపాధి అవకాశాలు, వైద్యం, రోడ్లు, మంచి నీరు, మురుగునీటి వ్యవస్థ,
ఇతర సౌలభ్యాలు అన్నీ పట్టణాలలోనే కేంద్రీకరించి పట్టణీకరణకు ఆజ్యం పోస్తున్నారు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు.
- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్
