నాలుగో టెస్టులో కరుణ్‌‌పై వేటు తప్పదా?

నాలుగో టెస్టులో కరుణ్‌‌పై వేటు తప్పదా?
  • ఇంగ్లండ్‌‌తో నాలుగో టెస్ట్‌‌కు టీమిండియా ఎంపికపై కసరత్తు
  •  సాయి సుదర్శన్‌‌కు పెరుగుతున్న డిమాండ్‌‌
  • అభిమన్యు ఈశ్వరన్‌‌పై కూడా దృష్టి

బెకెన్‌‌హామ్‌‌: టెస్ట్‌‌ల్లో ట్రిపుల్‌‌ సెంచరీ చేసిన రెండో ఇండియన్‌‌ బ్యాటర్‌‌ కరుణ్‌‌ నాయర్‌‌కు టీమిండియా రెండోసారి అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఎనిమిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన అతను ఇంగ్లండ్‌‌తో ఆడిన తొలి మూడు టెస్ట్‌‌ల్లో కేవలం 131 రన్స్‌‌ మాత్రమే చేసి ఘోరంగా నిరాశపర్చాడు. ఆడిన ఆరు ఇన్నింగ్స్‌‌ల్లో మెరుగైన ప్రారంభం లభించినా భారీ స్కోర్లు చేయలేకపోయాడు. అతని అత్యధిక స్కోరు 40 రన్స్‌‌ కావడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరు నాయర్‌‌ ఆటతీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌‌తో జరిగే నాలుగో టెస్ట్‌‌లో నాయర్‌‌పై వేటు తప్పదా? ఒకవేళ తప్పిస్తే ఎవర్ని ఆడించాలి? చీఫ్‌‌ కోచ్‌‌ గౌతమ్‌‌ గంభీర్‌‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని అందరూ వేచి చూస్తున్నారు. 

‘మూడు’కు సరిపోలే..

సీనియర్లు విరాట్‌‌ కోహ్లీ, రోహిత్‌‌ శర్మ రిటైర్మెంట్‌‌ తర్వాత టీమిండియా సంధి దశను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లిష్‌‌ కౌంటీల్లో ఆడిన అనుభవం ఎక్కువగా ఉన్న కరుణ్‌‌ నాయర్‌‌పై టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ భారీ ఆశలు పెట్టుకుంది. ఫలితంగా మూడో నంబర్‌‌కు నాయర్‌‌ న్యాయం చేకూరుస్తాడని బాగా నమ్మింది. డొమెస్టిక్‌‌ క్రికెట్‌‌లో పరుగుల వరద పారించిన యంగ్‌‌స్టర్స్‌‌ అందుబాటులో ఉన్నా నాయర్‌‌ను పట్టుబట్టి తుది జట్టులోకి తీసుకున్నారు. కానీ అతను ఘోరంగా ఫెయిలయ్యాడు. బ్యాటింగ్‌‌ టెక్నిక్‌‌లో ఇబ్బంది లేకపోయినా.. లైన్‌‌ అండ్‌‌ లెంగ్త్‌‌ను పసిగట్టడంలో  విఫలమవుతున్నాడు. లార్డ్స్‌‌లో జరిగిన మ్యాచ్‌‌ రెండో ఇన్నింగ్స్‌‌లో బ్రైడన్‌‌ కార్స్‌‌ వేసిన ఇన్‌‌ కమింగ్‌‌ డెలివరీ లైన్‌‌ అండ్‌‌ లెంగ్త్‌‌ను తప్పుగా అంచనా వేశాడు. దాంతో షాట్‌‌కు వెళ్లకుండా డిఫెన్స్‌‌ చేయడంతో వికెట్‌‌ ముందు దొరికిపోయాడు. అంతకుముందు జరిగిన టెస్ట్‌‌ల్లోనూ కాస్త అటుఇటుగా ఇదే తరహాలో వికెట్లు సమర్పించుకున్నాడు. మొత్తానికి దేశవాళీల్లో పరుగుల ప్రవాహం సృష్టించిన నాయర్‌‌ వైఫల్యం ఇప్పుడు టీమిండియా మూడో ప్లేస్‌‌పై స్పష్టమైన ప్రభావం చూపిస్తోంది. ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో ఇండియా 1–2తో వెనకబడటం, నాలుగో టెస్ట్‌‌కు వారం రోజుల సమయమే ఉండటంతో మూడో నంబర్‌‌కు సరిపోయే బ్యాటర్‌‌ ఎవరనేది అర్జెంట్‌‌గా తేల్చాల్సిన అంశం.

కుల్దీప్‌‌ను ఏం చేస్తారు?

ఇంగ్లండ్‌‌తో బ్యాటింగ్‌‌లోనే ఎక్కువగా పోటీ పడుతున్న ఇండియా బౌలింగ్‌‌ మార్పులపై కూడా ఆలోచిస్తోంది. పేసర్‌‌ బుమ్రా ఈ మ్యాచ్‌‌లో ఆడతాడా? లేదా? అన్నది సందిగ్ధంలో ఉంది. ఒకవేళ ఆడకపోతే ప్రసిధ్‌‌ కృష్ణను తీసుకుంటారా? లేక చైనామన్‌‌ స్పినర్‌‌ కుల్దీప్‌‌కు చాన్స్‌‌ ఇస్తారా? చూడాలి.  ప్రస్తుతం జట్టులో ఉన్న జడేజా, సుందర్‌‌ బ్యాటింగ్‌‌తో పాటు స్పిన్నర్లుగానూ జట్టుకు బాగా ఉపయోగపడుతున్నారు. కాబట్టి వీళ్లలో ఒకర్ని తప్పించి కుల్దీప్‌‌ను తీసుకోవడం దాదాపు అసాధ్యం. మరోవైపు సిరీస్‌‌ను సమం చేయాలంటే  నాలుగో టెస్ట్‌‌లో బుమ్రాను ఆడించాలనే డిమాండ్‌‌ కూడా ఎక్కువగా వినిపిస్తోంది. మొత్తానికి నాలుగో టెస్ట్‌‌కు తుది జట్టులో ఒక మార్పుతో వెళ్తారా? లేక అనూహ్యమైన నిర్ణయాలు ఏమైనా  వస్తాయా? చూడాలి.

సాయి సుదర్శన్‌‌పైనే దృష్టి..

ఇప్పుడున్న పరిస్థితుల్లో నాలుగో టెస్ట్‌‌ తుది జట్టులో మార్పులు కచ్చితంగా అవసరమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నాయర్‌‌ ఫామ్‌‌లేమి, బుమ్రా ఫిట్‌‌నెస్‌‌ అంశాలతో పాటు యంగ్‌‌స్టర్స్‌‌ను ఎలా ఆడించాలన్న దానిపై కూడా మేనేజ్‌‌మెంట్‌‌ కఠినమైన నిర్ణయానికి రావాల్సి ఉంది. ఒకవేళ నాయర్‌‌ను కంటిన్యూ చేయాలనుకుంటే టీమ్‌‌లో ఉన్న యంగ్‌‌స్టర్స్‌‌కు ఇంగ్లండ్‌‌లో ఆడిన అనుభవం రావడానికి మరో ఐదేళ్లు పట్టొచ్చు. కానీ అంతవరకు వేచి చూసే అవకాశం మేనేజ్‌‌మెంట్‌‌ ఇవ్వకపోవచ్చు. అందుకే డొమెస్టిక్‌‌ సర్క్యూట్‌‌లో రాణించిన సాయి సుదర్శన్‌‌, అభిమన్యు ఈశ్వరన్​లో ఒకరికి చాన్స్‌‌ ఇవ్వాలని మాజీలు డిమాండ్‌‌ చేస్తున్నారు. సుదర్శన్‌‌ను ఆడించడం వల్ల ఎనిమిదో నంబర్‌‌లో ఎక్స్‌‌ట్రా బ్యాటింగ్‌‌ అప్షన్‌‌ అందుబాటులోకి వస్తుంది. లీడ్స్‌‌లో అరంగేట్రం చేసిన సుదర్శన్‌‌ 0, 30 రన్స్‌‌ మాత్రమే చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ వాషింగ్టన్‌‌ సుందర్‌‌ కోసం బెంచ్‌‌కు పరిమితమయ్యాడు. 

కానీ సిరీస్‌‌ను సమం చేసే మ్యాచ్‌‌ కావడంతో ఎక్స్‌‌ట్రా బ్యాటర్‌‌ కమ్‌‌ లెగ్‌‌ బ్రేక్‌‌ బౌలింగ్‌‌ ఆప్షన్‌‌ కూడా అందుబాటులోకి వస్తుంది. ‘మనం ఇంకా సిరీస్‌‌లో సజీవంగా ఉన్నాం. లార్డ్స్‌‌ మ్యాచ్‌‌ చాలా దగ్గరగా వచ్చి చేజారింది. కాబట్టి నాయర్‌‌ను తప్పించి యంగ్‌‌స్టర్‌‌ సుదర్శన్‌‌కు చాన్స్‌‌ ఇవ్వాలి. అతనిపై పెట్టుబడి పెట్టడం చాలా ఉపయోగకరం. మరో నాలుగేళ్ల తర్వాత కూడా పనికొస్తాడు. కరుణ్‌‌కు మంచి అవకాశాలే వచ్చాయి. అవకాశాల కంటే ఆట ముఖ్యం. క్రీజులో అతను సౌకర్యవంతంగా కనిపించడం లేదు. టెక్నికల్‌‌గా నాయర్‌‌ క్రీజులో నుంచే ఆడతాడు. ఈ పిచ్‌‌లపై అది కొద్దిగా కష్టమవుతుంది. దాని వల్ల రన్స్‌‌ చేయలేకపోతున్నాడు. కాబట్టి కొత్త వాళ్లకు చాన్స్‌‌ ఇవ్వాలి. మూడో ప్లేస్‌‌లో ఆడే బ్యాటర్‌‌ దృఢంగా కనిపించాలి. దానివల్ల ఇన్నింగ్స్‌‌పై పట్టు పెరుగుతుందనేది నా అభిప్రాయం’ అని మాజీ వికెట్‌‌ కీపర్‌‌ దీప్‌‌ దాస్‌‌గుప్తా వెల్లడించాడు.