రేపు ప్రధాని మోడీతో మమత భేటీ

రేపు ప్రధాని మోడీతో మమత భేటీ

ఢిల్లీ: రేపు (బుధవారం) ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవనున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జ్యూరిస్ డిక్షన్ పెంపు, బెంగాల్‌కు కేంద్ర నిధుల కేటాయింపు లాంటి అంశాలను మోడీతో చర్చించనున్నారు. అలాగే త్రిపురలో రాజకీయ హింస, తృణమూల్ కార్యకర్తలపై దాడులు అంశాన్ని కూడా మమత ప్రస్తావించే అవకాశముంది. ఈ ఇష్యూలో సోమవారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు తృణమూల్ ఎంపీలు.

మరోవైపు ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీని విస్తరించే పనులపై మమత దృష్టి పెట్టారు. బీహార్‌‌లోకి తృణమూల్‌ పార్టీని తీసుకెళ్లడంలో భాగంగా ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ప్రముఖ నేతలను తమ పార్టీలోకి చేర్చుకున్నారు.  దర్బంగా మాజీ ఎంపీ కీర్తి ఆజాద్ టీఎంసీలో చేరారు. మాజీ క్రికెటర్, 1983  వరల్డ్ కప్ గెలిచిన టీమ్ లో సభ్యుడైన కీర్తి ఆజాద్.. దర్బంగా నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున 3 సార్లు ఎంపీగా గెలిచారు. 2019 ఫిబ్రవరిలో కాంగ్రెస్ లో చేరిన కీర్తి ఆజాద్.. దర్బంగా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక జేడీయూ మాజీ జనరల్ సెక్రటరీ పవన్ వర్మ కూడా తృణమూల్‌లో చేరారు. పవన్ వర్మకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మమత. ఇలాంటి సమయంలో దేశానికి మమత లాంటి లీడర్ అవసరమన్నారు నేతలు.

హర్యానాలో కూడా ఎంటరవుతున్నారు మమత. ఆ రాష్ట్రానికి కాంగ్రెస్ మాజీ నేత అశోక్ తన్వర్ టీఎంసీలో చేరారు. హర్యానా మాజీ పీసీసీ అధ్యక్షుడైన అశోక్ తన్వర్... 2019లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీని ఓడించగల ఒకే లీడర్ మమత అని తన్వర్ అభిప్రాయపడ్డారు. బీజేపీని ఓడించడమే తమ టాప్ ప్రయారిటీ అని మమత చెప్పారు. అన్ని రాష్ట్రాలకు వెళ్తానన్నారు.