- క్రూడాయిల్ ధర భారీగా పెరగడమే కారణం
- పశ్చిమాసియాలో కొనసాగుతున్న అనిశ్చితి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచే అవకాశం ఉందని ఎక్స్పర్టులు, ఎకనమిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (ఓఎంసీలు) ఎదుర్కొంటున్న నష్టాల నుంచి ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం 49 నెలల తర్వాత మొదటిసారిగా ధరలు పెంచింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.3 చొప్పున పెరిగాయి. ప్రస్తుత పెట్రో ధరల పెరుగుదల కేవలం ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఎనలిస్టులు అంటున్నారు. ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న నష్టాలను పూర్తిగా పూడ్చడానికి లీటరుకు దాదాపు రూ.30 వరకు ధరను పెంచాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.
ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లు (రూ.9,600) దాటితే ఇంధన ధరల పెంపు కొనసాగుతుందని ఒక రిపోర్ట్ పేర్కొంది. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని డీబీఎస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీనియర్ ఆర్థికవేత్త రాధికా రావు కూడా అన్నారు. 2022లో దశలవారీగా రేట్లు పెంచారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు వేగంగా పెరుగుతుండటం, ప్రస్తుత వివాదం ముగిసే సంకేతాలు కనిపించకపోవడంతో ఇంధన ధరలు మరో ఒకటి రెండు సార్లు పెరిగే అవకాశం ఉంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటర్ పెట్రోల్, డీజిల్ ధరను సుమారు రూ.7 వరకు పెంచొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన ఆర్థికవేత్త మదన్ సబ్నవిస్ ఇంధన ధరల పెంపుపై స్పందిస్తూ వినియోగదారుల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం పడకుండా ఉండటానికి చిన్న మొత్తంలో ధరలను పెంచడం మంచి పద్ధతి అని పేర్కొన్నారు.
లీటరుకు రూ.20 వరకు నష్టం
ఓంఎసీలకు పెట్రోల్, డీజిల్ విక్రయాలపై లీటరుకు రూ.15 నుంచి రూ.20 వరకు గ్రాస్ మార్కెటింగ్ మార్జిన్ నష్టం వస్తోంది. ప్రస్తుతం లీటరుకు రూ.మూడు మాత్రమే పెంచాయి. అంటే కంపెనీలకు ఉన్న మొత్తం నష్టంలో కేవలం 10 శాతం భారాన్ని మాత్రమే ఈ పెంపు ద్వారా సర్దుబాటు చేశారు. మిగిలిన 90 శాతం నష్టాన్ని కంపెనీలు ఇంకా భరిస్తూనే ఉన్నాయి. ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం ద్వారా ప్రభుత్వం ఇప్పటికే భారాన్ని తగ్గించడానికి ప్రయత్నించినప్పటికీ, చమురు ధరలు 100 డాలర్లు పైన ఉండటం వల్ల ఆశించిన ఫలితం రాలేదు.
ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగడం ఖాయమని స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే, పెట్రోల్ ఎగుమతిపై సుంకాన్ని కేంద్రం సున్నా నుంచి లీటరుకు రూ.3 కు పెంచింది. డీజిల్, ఏటీఎఫ్‌లపై ఎగుమతి సుంకాన్ని వరుసగా లీటరుకు రూ.16.5, రూ.16 కు తగ్గించింది. దేశీయ వినియోగానికి సంబంధించిన పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకం రేట్లను మాత్రం మార్చలేదు.
