తెలంగాణలో గుజరాత్, యూపీ తరహా పాలనందిస్తం - లక్ష్మణ్

తెలంగాణలో గుజరాత్, యూపీ తరహా పాలనందిస్తం - లక్ష్మణ్

తెలంగాణలో గుజరాత్, యూపీ తరహా పాలన అందిస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. అవినీతి, కుంభకోణాలు ఎక్కడ జరిగినా తెలంగాణలో దాని మూలాలు బయటపడుతున్నాయని అన్నారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన డబ్బులను వేరే పనులకు వినియోగించారని ఆరోపించారు. రంగులు మార్చే ఉసరవెల్లి కేసీఆర్ ను చూసి సిగ్గుపడుతుందన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందని.. దీనిని మొదటి స్థానంలోకి తీసుకెళ్లడానికి కేసీఆర్ కృషి చేస్తున్నారని మండిపడ్డారు.

మునుగోడులో టీఆర్ఎస్ గెలుపుకోసం కాంగ్రెస్ పనిచేస్తోందని లక్ష్మణ్ అన్నారు. మునుగొడులో మంత్రులు మకాం వేసి.. ఓటర్లకు విందు, మందు, డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు. ట్విట్టర్ టిల్లు ఏదిపడితే అది చెబుతున్నాడని.. రాష్ట్రంలో బుల్డోజర్ సర్కార్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు ఇంటికొక ఉద్యోగమన్న కేసీఆర్.. వచ్చాక ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ఇంట్లో మాత్రం అందరికి ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు.

ఎలక్షన్లు వచ్చినప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉద్యోగ నోటిఫికేషన్లు గుర్తుకొస్తాయని లక్ష్మణ్ మండిపడ్డారు. మునుగోడు ఎన్నిక  కోసం గిరిజన బంధు తీసుకొచ్చారని.. బీసీలకు బీసీ బంధు ఎందుకు తీసుకరాలేదని ప్రశ్నించారు. సూరత్ నుంచి నాసిరకం బతుకమ్మలు తెచ్చి నేతన్నల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు. బీజేపీతోనే సామాజిక న్యాయం సాధ్యమని.. మునుగోడులో బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.