
మరి కొద్ది గంటల్లో ఐపీఎల్ క్రికెట్ పండగ మొదలవబోతుంది. మార్చి 31న సాయంత్రం 6 గంటలకు అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. ఆ తర్వాత 7గంటల 30 నిమిషాలకు డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగబోతుంది. అయితే మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉందా అనే అనుమానం అభిమానుల్లో కలుగుతోంది. ఇందుకు గుజరాత్లో వర్షాలు పడటమే.
గుజరాత్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మార్చి 30వ తేదీన భారీ వర్షాలు కురిశాయి. వానల కారణంగా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 6 డిగ్రీల వరకు తగ్గాయి. దీంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మ్యాచ్ సమయంలో అహ్మదాబాద్‌లో వర్షం కురుస్తుందేమో అని భయపడుతున్నారు. అభిమానుల ఆందోళనల మధ్య వాతావరణ శాఖ చల్లటి వార్త చెప్పింది. గుజరాత్లో మిగతా చోట్ల వానలు కురిసినా... అహ్మదాబాద్ మాత్రం వర్షాలు పడవని వెల్లడించింది.
వానగండం లేదు..
అహ్మదాబాద్లో మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశమే లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. ఉష్ణోగ్రతలు 23 డిగ్రీల నుంచి 34 మధ్యలో ఉంటాయని పేర్కొంది. ఐపీఎల్ ప్రారంభ వేడుకలు మొదలైనప్పటి నుంచి మ్యాచ్ ముగిసే వరకు వర్షం బెడదే ఉండదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.