ఆరు గ్యారెంటీలు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా: కేంద్ర మంత్రి బండి సంజయ్

ఆరు గ్యారెంటీలు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా: కేంద్ర మంత్రి బండి సంజయ్

హుజూరాబాద్, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలుచేస్తున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్​ అన్నారు. శనివారం ఆయన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌‌‌‌లోని సిర్సపల్లి, రంగాపూర్ సమీపంలోని ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ స్థలాన్ని పరిశీలించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనావాసాల మధ్య డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం సరైంది కాదని, ప్రజలతో పాటు వన్యప్రాణులకు కూడా హాని కలిగించే నిర్ణయమని అన్నారు. హుజూరాబాద్ ప్రజల ఆందోళనకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. తక్షణమే డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ప్రజలతో కలిసి బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు.

తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేశామని సీఎం చెప్పడం పచ్చి అబద్ధమని బండి సంజయ్ విమర్శించారు. కేరళ మీడియాతో కలిసి తెలంగాణలో పర్యటించి గ్యారంటీలు అమలయ్యాయని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. మహిళలకు రూ.2,500, తులం బంగారం, స్కూటీ, రూ.4 వేల ఆసరా పెన్షన్, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు, నిరుద్యోగులకు రూ.4 వేల భృతి వంటి హామీలు అమలు కాలేదని ఆరోపించారు. మోదీ చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలు గుర్తించి బిహార్, ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌ను ఓడించారని అన్నారు.

రాముడు నడయాడిన నేల ఇల్లందకుంట..
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో జరుగుతున్న సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పెద్ద రథోత్సవంలో బండి సంజయ్​ పాల్గొన్నారు. రథంపై కొలువుదీరిన సీతారామచంద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరాముడు అరణ్యవాస సమయంలో నడిచిన ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఇల్లందకుంట ఒకటని ఆయన తెలిపారు. 

అనంతరం వీణవంకలో పితృవియోగం చెందిన బీజేపీ నాయకుడు కొలను సతీష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి ప్రణవ్ బాబు, మున్సిపల్ చైర్‌‌‌‌పర్సన్లు రెంటాల సుహాసిని, మొలుగు ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.