పెండింగ్​ బిల్లులివ్వకపోతే రాజీనామాలు చేస్తం : సర్పంచ్ లు

పెండింగ్​ బిల్లులివ్వకపోతే రాజీనామాలు చేస్తం : సర్పంచ్ లు

తొగుట ,(దౌల్తాబాద్)/దుబ్బాక,  వెలుగు : పెండింగ్​బిల్లుల కోసం సర్పంచులు ఆందోళన బాట పట్టారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని 24 గ్రామ పంచాయతీల సర్పంచులు తమ పెండింగ్ బిల్లులను 15 రోజుల్లో చెల్లించాలని లేకపోతే రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్న డీజిల్ బిల్లులు, ట్రాక్టర్ ఈఏంఐ లు, గ్రామంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల బిల్లులను ప్రభుత్వం ఫ్రీజింగ్ చేయడం సరికాదన్నారు. తర్వాత ఎంపీడీవో రాజేశ్​కు వినతిపత్రం అందజేశారు. సర్పంచ్ లు స్వామి, యాదగిరి, మధుసూధన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, మల్లగౌడ్, సత్యనారాయణ, నర్సింహులు, శ్రీనివాస్ పాల్గొన్నారు. మరోవైపు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో ఎంపీడీవోకు వినతిపత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు తుమ్మ బాల్​రాజ్​ మాట్లాడుతూ అప్పులు తెచ్చి గ్రామాలను అభివృద్ధి చేశామని, బిల్లులు రాక నెలలు గడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెచ్చిన అప్పులకు మిత్తీలు పెరుగుతున్నాయని, వాటిని తీర్చలేక మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోందని, దీంతో పలుచోట్ల సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. మరో ఐదారు నెలల్లో తమ పదవీ కాలం పూర్తవుతుందని, ఇప్పటి వరకు పెండింగ్​ బిల్లులతో పాటు తమకు గౌరవ వేతనం కూడా ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేచి చూసే ధోరణిలో ఉంటే దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేయడమే కాకుండా రాజీనామాలు చేయడానికి వెనుకాడబోమని ప్రకటించారు. సర్పంచ్​లు శ్రీనివాస్​, వెంకట్​ రెడ్డి, కిష్టయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు.  

జగిత్యాల జిల్లా మల్యాలలో..

మల్యాల :  బిల్లులు చెల్లించకుంటే రాజీనామాలు చేస్తామని జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని 15 గ్రామాల సర్పంచులు హెచ్చరించారు. ప్రతి సర్పంచ్ కు రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. వెంటనే విడుదల చేయకపోతే రాజీనామాలతో పాటు, ధర్నాలు చేస్తామన్నారు. కలెక్టర్ ను కలవడానికి వెళ్లిన వారిని  కలెక్టరేట్ లో చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్​ బుజ్జగించే ప్రయత్నం చేశారు. జూన్ లో బిల్లులు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చినా వినలేదు. దీంతో ‘మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి’ అంటూ ఎమ్మెల్యే వెళ్లిపోయాడని సర్పంచులు ఆరోపించారు.