- నేటితో ముగియనున్న ప్రణీత్ రావు కస్టడీ
- ఆరు రోజుల విచారణలో కీలక ఆధారాల సేకరణ
- నిందితుడు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కస్టడీ శనివారంతో ముగియనుంది. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించేందుకు నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. కోర్టు అనుమతితో ఈ నెల 17న కస్టడీలోకి తీసుకుని వారం రోజుల పాటు విచారించారు. శనివారంతో కస్టడీ ముగియనుండడంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. అంతకుముందు ఉస్మానియా హాస్పిటల్‌లో ప్రణీత్‌కు వైద్య పరీక్షలు చేసి కోర్టులో హాజరుపరుచనున్నారు.
మరింత సమాచారం రాబట్టేందుకు మరో మూడు రోజులు కస్టడీ కోరే అవకాశం ఉంది. కాగా, ప్రణీత్ కస్టడీ ముగియనుండడంతో ఆయన న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఆరు రోజుల పాటు కొనసాగిన కస్టడీలో పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెంకటగిరి ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో ప్రత్యేక వాంగ్మూలాలు రికార్డ్ చేసినట్లు తెలిసింది. ఆయన వెల్లడించిన వివరాల ఆధారంగా సంబంధిత వ్యక్తులను కూడా ప్రశ్నించారు.
వారిచ్చిన సమాచారంతో ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారాన్ని పోల్చి చూసుకున్నారు. ప్రాసిక్యూషన్‌కు అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించారు. లాగర్ రూమ్ ఆపరేషన్స్‌కు సంబంధించిన వివరాలను పంచ్‌ల సమక్షంలో రికార్డ్ చేశారు. దీంతో పాటు లాగర్ రూమ్‌లో పనిచేసిన సిబ్బంది, ఎలక్ట్రీషియన్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కాగా, ప్రణీత్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఓ చానెల్ ఎండీ ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. ఆ సమయంలో ఆ చానెల్ ఎండీ అందుబాటులో లేరు.
సీక్రెట్ ఆపరేషన్స్ ఎలా చేశారు?
ఎస్‌ఐబీలో ఎలాంటి సీక్రెట్ ఆపరేషన్లు జరిగాయో వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఆపరేషన్స్ చేయాలని ఎవరు ఆదేశించారు? ఎప్పటి నుంచి చేశారు? ఎవరెవరి డేటా సేకరించారు? అని ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రభుత్వం లేదా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు సంబంధించిన ఉత్తర్వులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో వివరాలు రాబట్టారు. మావోయిస్టులు, టెర్రరిస్టులకు సంబంధించిన డేటాపైనా ఆరా తీసినట్లు తెలిసింది.
అధికారిక డేటా మినహా ఇతర రహస్యాలను వెలికితీసేందుకు యత్నించారు. ప్రణీత్ రావు సహా ఎస్‌ఐబీ సిబ్బంది వెల్లడించిన వివరాలను కోర్టుకు సమర్పించనున్నారు. కోర్టు అనుమతితో కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులకు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు.
