ఇబ్రహీంపట్నం ఘటనకు బాధ్యత వహిస్తూ హరీశ్ రాజీనామా చేయాలె

ఇబ్రహీంపట్నం ఘటనకు బాధ్యత వహిస్తూ హరీశ్ రాజీనామా చేయాలె

ఇబ్రహీంపట్నం ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి హరీష్ రావు రాజీనామా చేయాలని టీపీసీసీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ డిమాండ్ చేశారు. ‘‘పోర్చుగల్‌లో గర్భవతి అయిన భారతీయ పర్యాటకురాలు మరణించడంతో అక్కడి ఆరోగ్య మంత్రి రాజీనామా చేశారు. ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు రాజీనామా చేస్తారా..?’’ అని ట్వీట్ చేశారు.

ఈ ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శస్త్ర చికిత్స అనంతరం చనిపోయిన బాధితు కుటుంబాలకు అండగా ఉండాలని గవర్నర్ ప్రభుత్వానికి సూచించారు. చికిత్స పొందుతున్న మహిళలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఆపరేషన్ వికటించడంతో ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ పొందుతున్న మహిళల్ని త్వరలోనే పరామర్శించనున్నట్లు తమిళిసై ప్రకటించారు. 

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. అయితే శస్త్ర చికిత్స విఫలమై నలుగురు మహిళలు మృతి చెందారు. మిగితావారు నిమ్స్, అపోలో ఆస్పత్రులలో  చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో వైద్య విధాన పరిషత్ రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ ను తాత్కాలికంగా నిలిపేసింది.