దొంగ ఓట్ల గుట్టు విప్పుతున్న రాహుల్ ఉద్యమం.. బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయాలి మరి !

దొంగ ఓట్ల గుట్టు విప్పుతున్న రాహుల్ ఉద్యమం.. బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయాలి మరి !

‘కంచే - చేను మేసినట్టు’ ఓటరు నమోదు ప్రక్రియ, ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా చేపట్టి, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి లొంగిపోయిందని ప్రజల్లోనూ బలంగా వినిపిస్తున్న ఆరోపణ. ప్రపంచంలో  అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి బీజేపీ పాలన అతిపెద్ద కళంకంగా మారింది.  కర్నాటక, మహారాష్ట్ర, హర్యానా,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అడ్డదారుల్లో బీజేపీ, మోదీ గెలుపునకు సహకరించిందని ప్రతిపక్షాలు నిరంతరం చెపుతూనే ఉన్నాయి. ఎన్నికల సంఘం  ఓటర్ లిస్టులో అవకతవకలు   ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. ఈ ఓటు చోరీనీ దేశ ప్రతిపక్ష నేత  రాహుల్ గాంధీ 6 నెలల రీసెర్చ్ తర్వాత, మోదీ, ఎన్నికల సంఘం కలిసి చేస్తున్న ఈ ఓటు చోరీ నేరప్రక్రియని ఆగస్టు 7, 2025 నిర్వహించిన మీడియా సమావేశంలో ఆధారాలతో  వివరించారు. 

బీజేపీకి అనుకూలమైన కిరాయి మనుషులతో ఓట్ల కోసం, ఫారం-6 ను దుర్వినియోగం చేస్తూ, కొత్త ఓటర్లను చేర్చటం,  నకిలీ అడ్రస్,  నకిలీ పేర్లు,  నకిలీ ఫొటోలతో కొత్త ఓటర్లను సృష్టిస్తున్నారనీ రాహుల్​ ఆధారాలతో నిరూపించారు. ఇన్నాళ్లు తమ పాలన చూసి,  ప్రజలు ఓట్లువేసి  గెలిపించాలని కల్లబొల్లి కబుర్లు చెప్పిన మోదీ.. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో వాళ్ల  మనుషులతో ఓటర్ నమోదు చేయించి, ఆ ఓట్లతోనే గెలుస్తున్నారని వెల్లడించారు.  బెంగళూరు సెంట్రల్ పార్లమెంటు నియోజకవర్గంలోని మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో  బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి 1,00,250 దొంగ ఓట్లు నమోదు చేసి, ఆ ఓట్లతో గెలిచారన్న రాహుల్​ గాంధీ ఆరోపణకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. 

ఈసీ దగ్గర సమాధానం లేదు!
మోదీ అండ్​ కో.. వన్ నేషన్ వన్ ఎలక్షన్,  వన్ నేషన్ వన్ ట్యాక్స్ పదాలు వల్లె వేస్తారు.  తాము అధికారంలోకి రావడానికి  వన్ నేషన్  వన్ ఓటర్ కార్డు కాకుండా దానికి బదులు వన్ నేషన్ మల్టిపుల్ ఓటర్ కార్డులు అనే ఓటు  పద్ధతులను అనుసరిస్తున్నారు. అంతేకాదు, రాహుల్ గాంధీ కోరినట్టుగా..  ఎందుకు ఎలక్ట్రానిక్ ఓటర్ లిస్టు ఎన్నికల కమిషన్ ఇస్తలేదు?   మిషన్ రీడబుల్ ఫార్మాట్ లో డేటా ఎందుకు ఇవ్వరు?  సాయంత్రం పోలింగ్ సమయం ముగిసిన తరువాత ఓట్లు ఎవరు వేశారో నిర్ధారణ కోసం సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడంలో భయమెందుకు? కర్నాటక మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో లక్షకు పైగా దొంగ ఓట్లు ఎలా నమోదు అయ్యాయి? ఈ ప్రశ్నలకు ఎలక్షన్ కమిషన్ దగ్గర సమాధానం లేదు. అడిగిన డేటా ఇవ్వకపోగా  రాహుల్ గాంధీని ప్రమాణ పత్రం ఇవ్వమని అడగడం గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకోవడమే!

బలపడిన రాహుల్ ​ఆరోపణలు
రాహుల్ గాంధీ ఈ ఓటు చోరీ అంశాన్ని తేవడానికి ముందు, ఎన్నికల సంఘం ఆగస్టు 1న ఆన్​లైన్​ వెబ్​సైట్లో  బిహార్ ఓటర్ లిస్ట్,   పీడీఎఫ్ రూపంలో ఉంది. ఎప్పుడైతే  బిహార్​లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు తమ తమ ప్రాంతంలోని ఓట్లను ఎన్నికల కమిషన్ వెబ్​సైట్​లో చూసుకోవడం మొదలుపెట్టారో, ఎలక్షన్ కమిషన్ ఆ  ఎలక్ట్రానిక్  డేటా ఫార్మాట్​ను మార్చేశారు. ఫైల్​ను సెర్చ్ చేసి, చదివి, పోల్చి చూసుకునే అవకాశం లేకుండా, కఠినతరం చేస్తూ ఈ మార్పులు చేశారు.  ఈ మార్పులతో, ఓట్ల చోరీలో ఎలక్షన్ కమిషన్ పాత్రపై రాహుల్ గాంధీ  చేసిన ఆరోపణలు మరింత బలపడ్డాయి.

ఇదిలా ఉంటే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్ రాష్ట్రంలో అక్కడి ప్రజల ఓటరు లిస్టు ప్రత్యేక తీవ్రమైన సవరణ పేరుతో  ఓట్లను తొలగిస్తున్నారు. ఈ ఎస్.ఐ.ఆర్  ప్రక్రియలో బిహార్ ప్రజలు, భారతదేశ పౌరులుగా నిరూపించుకోవడానికి ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, రేషన్ కార్డ్  పనికిరావని, కేవలం పాస్-పోర్ట్ మాత్రమే మనదేశ పౌరులను గుర్తించే అధికారిక డాక్యుమెంట్ అని సుప్రీంకోర్టుకు  తెలిపింది.  కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం, 140 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో కేవలం 10 కోట్ల మంది పౌరులకు మాత్రమే భారతీయ పాస్-పోర్ట్ ఉంది. అంటే, ఎన్నికల సంఘం కొత్త నియమం ప్రకారం కేవలం 10 కోట్ల మంది మాత్రమే ఓటుహక్కు కలిగి ఉండడానికి అర్హులా? 

ధ్రువీకరణ పత్రంగా ఆధార్ కార్డు
 వింత ఏమిటంటే, అత్యున్నత వ్యవస్థ  ఎన్నికల సంఘానికి,  పాస్-పోర్ట్ జారీ చేయటానికి కూడా ఆధార్ కార్డునే  ధ్రువీకరణపత్రంగా తీసుకుంటారనే విషయం తెలవదా? ఇది కేవలం  బీజేపీకి ఓట్లు పడని ప్రాంతాల్లో వివిధ  మతాలకు,   కులాలకు సంబంధించిన ఓటర్ల ఓటు హక్కును తొలగించడానికి అక్రమమార్గంలో ఎన్నికల సంఘం చేస్తున్న పని అనే అనుమానం బలపడుతోంది.  ప్రపంచంలో అతి ఎక్కువ కాలం జీవించిన రికార్డు, జీనే కాల్మెంట్ అనే ఫ్రెంచ్ మహిళ  122 సంవత్సరాలు పేరున ఉంది.  కానీ, మనదేశంలో  కేంద్ర ఎన్నికల కమిషన్  ప్రచురించిన డేటా ప్రకారం బిహార్ రాష్ట్రానికి చెందిన ‘మింతాదేవి అనే మహిళ 124 సంవత్సరాలుగా ఇంకా బతికే ఉంది’.  ఇది  గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కించాల్సిన అంశం.  ఇలా మన ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఒక ప్రహసంగా మారింది.

బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయాలి మరి!
బిహార్​లో ఫర్జీ ఓటర్లు ఉన్నారు అనే నెపంతో ఎలక్షన్ కమిషన్ ఎస్.ఐ.ఆర్  పేరుతో  సవరణలు చేస్తుంది. మరి, ఇదే ఓటర్లతో ఎన్నికైన  బీజేపీ పార్లమెంట్ సభ్యులందరినీ కూడా రాజీనామా చేయించి, ఎస్ఐఆర్ తర్వాత ఫ్రెష్ ఎలక్షన్  చేపట్టాలి. తద్వారా వారు చేసేపనికి ఒక సార్థకత ఉంటుంది. మోదీ ఎంపీగా గెలుపొందిన వారణాసి పార్లమెంటు నియోజకవర్గంలో ఒకే రూమ్ లో కమల్ దాస్ అనే తండ్రికి 50 మంది పిల్లలు ఉన్నట్టు, పెద్ద కొడుకుకు 72 సంవత్సరాలు ఉన్నట్టు చిన్న కొడుకుకు 28 సంవత్సరాలు ఉన్నట్టు ఎన్నికల సంఘం డేటాలో ప్రచురించింది. ఇవి దొంగ ఓట్లు అని చెప్పడానికి ఇంతకంటే ఆధారం ఏం కావాలి?  

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి
మోదీ,  ఎన్నికల సంఘం కలిసి ఎవరు ఓట్లేయాలో నిర్ణయిస్తున్నారు. డెమోక్రసీ అర్థాన్ని మార్చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఓట్ల చోరీనీ ఎండగడుతూ.. రాహుల్ గాంధీ  చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా భారత సైన్యంలో పనిచేసిన మాజీ ఉన్నతాధికారులందరూ ఢిల్లీలో రోడ్లమీదకొచ్చి నినాదాలు చేస్తూ బాహాటంగా మద్దతు ప్రకటించారు.  జర్నలిస్టులు, కవులు, కళాకారులు, మేధావులు, ప్రతి ఒక్కరూ ఈ ఓట్ల చోరీపై గొంతు ఎత్తాల్సిన సమయం వచ్చింది. మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత  పౌరులుగా మనందరిది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే వారిని గద్దె దింపడమే దేశ పౌరులుగా మన కర్తవ్యం. ఇదే నిజమైన దేశభక్తి.  రాహుల్ గాంధీ ఈ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ఓట్ల చోరీపై చేస్తున్న మహా పోరాటానికి అందరూ మద్దతుగా నిలవాలని కోరుతున్నాం.

డా. కొనగాల మహేశ్, కాంగ్రెస్​ పార్టీ, సీనియర్ అధికార ప్రతినిధి