జంబ్లింగ్​ ఉంటదా.. లేదా?

జంబ్లింగ్​ ఉంటదా.. లేదా?

ఇంటర్ ప్రాక్టికల్స్ పై
ఇంకా తేల్చని సర్కారు
సెల్ఫ్​ సెంటర్లలోనే
కొనసాగుతున్న ప్రాక్టికల్స్​

కాలేజీల్లో పూర్తిస్థాయిలో కనిపించని ల్యాబ్స్
అందుకే జంబ్లింగ్​ అమలు వాయిదా: బోర్డు
కార్పొరేట్​కాలేజీల ఒత్తిడివల్లే: స్టూడెంట్స్​యూనియన్లు

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో ఇంటర్మీడియెట్​ ప్రాక్టికల్​ పరీక్షల్లో జంబ్లింగ్​ విధానం అమలుపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామని అధికారులు చెబుతున్నా.. ఈ ఏడాది కూడా జంబ్లింగ్​ విధానం అమలయ్యే పరిస్థితి కనిపించడంలేదని నిపుణులు చెబుతున్నారు. గతేడాదిలానే ఇప్పుడు కూడా చివరి నిమిషంలో జంబ్లింగ్​ లేదని ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 2,558 జూనియర్​ కాలేజీలు ఉన్నాయి. అందులో పది లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. సెకండియర్​లో దాదాపు 2 లక్షల మంది సైన్స్(ఎంపీసీ, బైపీసీ) స్టూడెంట్లు ఉన్నారు. సైన్స్​స్టూడెంట్లకు ఏటా జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటివారంలో ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఇందులో ఎంపీసీ స్టూడెంట్లకు 60 మార్కులు, బైపీసీ స్టూడెంట్లకు 120 మార్కులు ఉంటాయి. ఎంసెట్​లో ఇంటర్​ మార్కులకు వెయిటేజ్​ ఉండడంతో సైన్స్​ విద్యార్థులకు ప్రాక్టికల్స్​ మార్కులు కీలకంగా మారుతున్నాయి.

సెల్ఫ్​ సెంటర్లలోనే ప్రాక్టికల్స్​ నిర్వహించడంతో ప్రైవేటు, కార్పొరేట్​ కాలేజీలు ఇష్టారాజ్యంగా మార్కులు వేసుకుంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో అక్రమాలకు చెక్​ పెట్టేందుకు ఇంటర్​ ప్రాక్టికల్స్​లోనూ జంబ్లింగ్​ విధానం అమలుచేయాలని స్టూడెంట్​ యూనియన్లు, విద్యావేత్తలు చాలా కాలంగా డిమాండ్​ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. ఏటా ఈ విద్యాసంవత్సరం నుంచి జంబ్లింగ్​ విధానం అమలుచేస్తామని ప్రకటించడం.. చివరి నిమిషంలో ఏదో ఒక కారణంచెప్పి జంబ్లింగ్​ను వచ్చే ఏడాదికి వాయిదా వేయడం జరుగుతోంది. ఈ ఏడు కూడా జంబ్లింగ్​ అమలుచేసే పరిస్థితి కనిపించడంలేదనే అభిప్రాయాలు వినబడుతున్నాయి. దీనికి ప్రైవేటు, కార్పొరేట్​ కాలేజీల ఒత్తిడే కారణమనే విమర్శలూ ఉన్నాయి.

కాలేజీల్లో ల్యాబ్​లు ఉన్నాయా..?

ప్రైవేటు కాలేజీలకు ఇంటర్​ బోర్డ్​ అనుమతి రావాలంటే కాలేజీలో సైన్స్​ల్యాబ్​ ఉండాల్సిందే.. కానీ అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేసి, ల్యాబ్​లు లేకున్నా గుర్తింపు ఇచ్చేస్తున్నారు. సర్కారుతో పాటు కొన్ని ప్రైవేటు కాలేజీల్లో ల్యాబులు పేరుకే ఉంటయి.. వాటిలో పరికరాలు, కెమికల్స్ ​ఉండవు. చాలా కార్పొరేట్ కాలేజీలు తమ విద్యార్థులతో ల్యాబ్​లలో కనీసం ఒక్క పరీక్ష కూడా చేయించకున్నా.. లెక్చరర్లతో ఫుల్​ మార్కులు వేయిస్తున్నాయని విమర్శలున్నాయి. చాలా మంది విద్యార్థులకు కనీసం పరికరాలు, కెమికల్స్​పేర్లు కూడా తెలియవని గతంలో ప్రాక్టికల్స్​పరీక్షలకు పర్యవేక్షకులుగా వెళ్లిన అధికారులు చెప్తున్నారు. కొంతమంది విద్యార్థుల రికార్డులు కూడా వేరే వారితో రాయించడం లేదా పాత రికార్డులనే చూపించడం చేస్తుంటారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

డబ్బులిస్తేనే మార్కులు..

ప్రాక్టికల్​పరీక్షలు సెల్ఫ్ సెంటర్లలో జరుగుతుండటంతో మేనేజ్​మెంట్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. ఎంసీపీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు బాటనీ, జువాలజీ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఒక్కో సబ్జెక్ట్​కు 30 మార్కులు ఉంటాయి. అయితే ఇంటర్​లో వచ్చే ఒక్కో మార్కు, ఎంసెట్​మార్కులను తారుమారు చేస్తుంది. దీంతో ప్రాక్టికల్స్​ను పేరెంట్స్​కూడా కీలకంగా తీసుకుంటారు. దీన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేటు కాలేజీల మేనేజ్​మెంట్లు ఒక్కో సబ్జెక్ట్​కు రూ.2 వేల నుంచి 10వేల వరకూ వసూలు చేస్తుంటాయి. ఈ డబ్బులను పర్యవేక్షణకు వచ్చే అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందని చెబుతుంటారు. మరోపక్క కార్పొరేట్ కాలేజీలు ర్యాంకుల కోసం ప్రాక్టికల్ మార్కులనూ కీలకంగానే చూస్తాయి. జంబ్లింగ్​ విధానం అమలైతే, తమ స్టూడెంట్స్​కు తక్కువ మార్కులు వచ్చే అవకాశముందని, కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్లు వ్యతిరేకిస్తున్నాయి. కాలేజీలలో వసతులు లేవనే కారణం చూపిస్తూ అధికారులు ఏటా వెనక్కి తగ్గుతున్నారు. ఈ ఏడు కూడా జంబ్లింగ్​ విధానం అమలు చేయాలా వద్దా అనేది ఆలోచిస్తామంటూ విద్యాశాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి ఇటీవల ప్రకటించడం గమనార్హం.

పరిశీలిస్తున్నాం.. త్వరలో నిర్ణయం: ఉమర్​ జలీల్

ఈ విద్యాసంవత్సరం ఇంటర్ ప్రాక్టికల్స్​లో జంబ్లింగ్ విధానం అమలు చేయడంపై పరిశీలిస్తున్నాం. అన్ని కాలేజీల్లో వసతులు ఉన్నాయా లేవా అనే దాని చూస్తున్నాం. త్వరలోనే దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

మరిన్ని వార్తల కోసం