నార్కట్పల్లి, వెలుగు: “ మేము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వండి.. లేదంటే మాకే ఓటేసినట్టు దేవుడిపై ప్రమాణం చేయండి” అంటూ ఓడిన అభ్యర్థి, ఆయన భార్య ఇంటింటికి వెళ్లి కోరారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఔరవాణి గ్రామానికి చెందిన కల్లూరి బాలరాజ్ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున సర్పంచ్అభ్యర్థిగా పోటీ చేశాడు. అతనిపై కాంగ్రెస్ అభ్యర్థి జక్కలి పరమేశ్448 ఓట్ల మెజార్టీతో గెలిచాడు.
దీంతో శనివారం అభ్యర్థి దంపతులు దేవుడి ఫొటో పాటు పురుగుల మందు డబ్బా పట్టుకుని ఇంటింటికీ తిరిగారు. తమకే ఓట్లు వేశామని చెప్పే ఓటర్లను దేవుడిపై ప్రమాణం చేయించుకున్నారు. ఓటు వేయనివాళ్లు డబ్బులు తిరిగి ఇవ్వాలని అభ్యర్థించారు. అందరూ ఓట్లు వేస్తే ఎలా ఓడిపోయానంటూ బాలరాజ్ కన్నీరు పెట్టుకున్నాడు.
రూ.10 లక్షలకు పైగా పంచానని ఆవేదన వ్యక్తం చేశాడు. 50 లేదా 60 ఓట్ల తేడాతో ఓడిపోతే డబ్బులు అడగకపోయేవాళ్లమని, 450 ఓట్లతో ఓడిపోయినందునే తిరిగి అడుగుతున్నామని బాలరాజ్ భార్య తెలిపారు.
