మీ గురించి మీరే మాట్లాడుతరా?.. ప్రధాని మోడీని ప్రశ్నించిన రాహుల్

మీ గురించి మీరే మాట్లాడుతరా?.. ప్రధాని మోడీని ప్రశ్నించిన రాహుల్
  • కర్నాటకకు ఏం చేశారో  చెప్పాలని డిమాండ్
  • అవినీతిపై మౌనం వీడాలంటూ ఫైర్
  • మోడీ స్పీచ్ విని ప్రజలు నవ్వుకుంటున్నరని ఎద్దేవా

తిర్తహళ్లి (కర్నాటక): ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కర్నాటకకు వచ్చినప్పుడల్లా తన గురించే మాట్లాడుతారని, ఇక్కడి ప్రజల భవిష్యత్తు గురించి అస్సలు మాట్లాడరని కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ విమర్శించారు. కర్నాటకలో జరిగిన స్కామ్స్​పై ఇప్పటిదాకా నోరు విప్పలేదన్నారు. అవినీతికి పాల్పడిన సీఎం బస్వరాజ్ బొమ్మై, హోంమంత్రి అరాగ జ్ఞానేంద్ర, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప పేర్లు కూడా అస్సలు ప్రస్తావించరని విమర్శించారు. శివమొగ్గ జిల్లాలో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. ‘‘మే 10న జరగబోయే ఎన్నికలు మోడీ కోసం కావు.. కర్నాటక భవిష్యత్తు కోసం. ఇక్కడ ఉంటున్న వాళ్లతో పాటు వారి పిల్లల ఫ్యూచర్ కోసమని మోడీ గుర్తు పెట్టుకోవాలి. బీజేపీ బహిరంగ సభకు మోడీ వచ్చినప్పుడల్లా తన పార్టీ లీడర్ల పేర్లు ప్రస్తావించరు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, స్టేట్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్యనే టార్గెట్ చేస్తారు”అని రాహుల్ విమర్శించారు.


అవినీతిని అడ్డుకునేందుకు ఏం చేశారు?


మోడీ స్పీచ్ విని కర్నాటక ప్రజలందరూ నవ్వుకుంటున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. తిర్తహళ్లి నుంచి పోటీ చేస్తున్న హోంమంత్రి జ్ఞానేంద్ర ఎస్ఐ రిక్రూట్​మెంట్​లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బీజేపీ లీడర్ల గురించి మాట్లాడకపోవడానికి ప్రత్యేక కారణం ఉందన్నారు. మోడీ ఎప్పుడూ తన గురించి తానే చెప్పుకుంటూ పోతే.. ఇక వారి గురించి ఎందుకు ప్రస్తావిస్తారని విమర్శించారు.

కర్నాటకలో ఎలక్షన్స్ జరుగుతుంటే ఇక్కడి అభివృద్ధి, అవినీతి, ప్రజల గురించి మాట్లాడాలని, మూడేండ్లలో ఏం చేశారో కూడా మోడీ చెప్పాలని డిమాండ్​ చేశారు. డెమోక్రసీని నాశనం చేసి కర్నాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగిన అవినీతిపై ఎందుకు సైలెంట్​గా ఉన్నారని ప్రశ్నించారు. ‘‘యెడ్డీ, బొమ్మై, జ్ఞానేంద్ర పేర్లు చెప్పడానికి భయపడుతుంటే.. అవినీతిని అరికట్టేందుకు ఏంచేశారో అయినా చెప్పండి. ఏం చర్యలు తీసుకున్నారో వివరించండి” అని మోడీని ఉద్దేశిస్తూ రాహుల్ నిలదీశారు. కర్నాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నేతలే 40% కమీషన్​పై మోడీకి లెటర్​ రాశారన్నారు. అయినా, దీనిపై ఎలాంటి కామెంట్లు చేయలేదన్నారు.