వైన్ షాపులు ఖాళీ.. పిచ్చి బ్రాండ్లకు డిమాండ్..

వైన్ షాపులు ఖాళీ.. పిచ్చి బ్రాండ్లకు డిమాండ్..

మరికొన్ని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది.. ప్రచారం అలా ముగుస్తుందే లేదో.. ఇలా వైన్ షాపులు మూతపడనున్నాయి. 2023, నవంబర్ 28వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఓ వైపు మైకులు బంద్ అవుతూనే.. వైన్ షాపులు క్లోజ్ కాబోతున్నాయి. మరికొన్ని గంటలు మాత్రమే ఈ రెండింటికీ టైం ఉండటంతో.. ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు. మరో వైపు పోల్ మేనేజ్ మెంట్ టీమ్స్.. లిక్కర్ షాపులతో డీల్స్ పెట్టుకున్నాయి.  చివరి రెండు రోజులు పోల్ బూత్ కమిటీ సభ్యులకు, ఓటర్ స్లిప్స్ రాసే కుర్రోళ్లు.. టెంట్స్ దగ్గర ఉంటే పార్టీ కార్యకర్తలు, నేతలను మేనేజ్ చేయటానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. 

ఇందులో భాగంగానే హైదరాబాద్ మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైన్ షాపులు ఖాళీ అయ్యాయి. బ్రాండెడ్ లిక్కర్ ఏదీ అందుబాటులో ఉండటం లేదు. టాప్ బ్రాండ్ల లిక్కర్ మొత్తం అమ్ముడైపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ లోని వైన్ షాపుల్లో అయితే.. అన్నా ఇవే ఉన్నాయి.. కావాలంటే తీసుకో లేకపోతే లేదు అని చెప్పేస్తున్నారు షాప్ సిబ్బంది. కేవలం ఒకటీ, రెండు బ్రాండెడ్ లిక్కర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 

ఇక బీర్ల విషయానికి వస్తే వారం రోజులుగా కేవలం కింగ్ ఫిషర్ బీర్ మాత్రమే లభిస్తుంది. మిగతా బ్రాండెడ్ బీర్లు అయితే అస్సలు దొరకటం లేదు. KF ఒక్కటే ఉంది.. కావాలంటే తీసుకో అంటూ ఓపెన్ గా చెప్పేయటం విశేషం. దీంతో మందు ప్రియులు చేసేది లేక ఉన్న బ్రాండ్లతోనే గొంతు తడుపుకుంటున్నారు. 

పోలింగ్ దగ్గర పడటంతోపాటు లిక్కర్ షాపులు మూసివేస్తుండటంతో.. ముందు జాగ్రత్తగానే ఆయా పార్టీల టీమ్స్ పెద్ద ఎత్తున లిక్కర్ నిల్వ చేశారు. చివరి నిమిషం హైరామా.. హంగామా.. హడావిడి పడేకంటే.. ముందుగానే కొని పెట్టేసుకుంటే బెటర్ అనే ఆలోచనతో.. వైన్ షాపులను ఖాళీ చేసేశారు. మరికొన్ని గంటల్లో క్లోజ్ కానున్న షాపుల్లో ఇప్పటికే ఉన్న అరాకొర లిక్కర్ సైతం.. ఖాళీ కావటం ఖాయం అంటున్నారు వ్యాపారులు..