మనీలాండరింగ్ కేసులో WinZO గేమింగ్ యాప్ డైరెక్టర్ల అరెస్ట్.. డబ్బు సీజ్ చేసిన ఈడీ

మనీలాండరింగ్ కేసులో WinZO గేమింగ్ యాప్ డైరెక్టర్ల అరెస్ట్.. డబ్బు సీజ్ చేసిన ఈడీ

రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ WinZO వ్యవస్థాపకులు సౌమ్య సింగ్ రాథోర్, పావన్ నందను బెంగళూరులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ అధికారులు అరెస్ట్ చేసింది. వీరిద్దరూ WinZO గేమింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్స్‌గా ఉన్నారు. ఈడీ అధికారుల విచారణ తర్వాతే అరెస్టులు జరిగినట్లు వెల్లడైంది. 

ఈ క్రమంలోనే బెంగళూరు, గురుగ్రామ్ ప్రాంతాల్లో మనీలాండరింగ్ చట్టాల కింద కంపెనీ ఆఫీసులు, డైరెక్టర్ల ఇళ్లతో పాటు అనుబంధ సంస్థలైన గేమ్స్ క్రాఫ్ట్ టెక్నాలజీస్, నిర్థేశ నెట్వర్స్ సంస్థలపై కూడా దాడులు జరిపింది ఈడీ. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మోసం, గేమ్ ఫలితాల మార్పులు, ఇతర అవినీతి ఆరోపణలపై అధికారులు సోదాలు చేపట్టారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం రియల్ మనీ గేమ్స్ పై నిషేధం విధించినప్పటికీ యూజర్లకు సంబంధించిన రూ.43 కోట్లకు పైగా నిధులను తిరిగి చెల్లించకుండా కంపెనీ తమ వద్దే ఉంచుకున్నట్లు అధికారులు గుర్తించారు. సోదాల్లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డేటాను స్వాధీనం చేసుకున్నారు. ఆరు బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.18.57 కోట్లను కూడా ఫ్రీజ్ చేశారు.

ఈ దర్యాప్తు ఆన్‌లైన్ గేమింగ్ వ్యవస్థలో యూజర్ నిధుల పరిరక్షణపై పెరుగుతున్న ఆందోళన మధ్య జరుగుతోంది. ప్రభుత్వం నిషేధించినప్పటికీ.. రూ. 30 కోట్ల పైగా నిధులు ఇంకా ఎస్క్రో ఖాతాల్లో ఉండగా.. వాటిని వినియోగదారులకు తిరిగి ఇవ్వడంలో ఆలస్యమవుతోంది. ప్రస్తుతం అధికారులు గేమింగ్ దిగ్గజ కంపెనీల్లో ఫైనాన్షియల్ లావాదేవీలను పరిశీలిస్తూ.. లక్షల మంది ప్రభావిత గేమర్లకు బాధ్యత వహించే దిశగా ముందడుగు సాగుతున్నట్లు కనిపిస్తోంది.