డేంజర్ బెల్స్: స్తంభాలపై అస్తవ్యస్థంగా కేబుల్స్

డేంజర్ బెల్స్: స్తంభాలపై అస్తవ్యస్థంగా కేబుల్స్
  • సిటీలో అంతా అస్తవ్యస్థం
  • సత్యం థియేటర్​ సమీపంలో ఆదివారం అగ్ని ప్రమాదం
  • కాలిపోయిన కేబుళ్లు
  • వాహనాల రాకపోకలకూ ఆటంకమే

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ట్విన్ సిటీస్ లో చాలా ప్రాంతాల్లో కరెంట్, టెలిఫోన్ స్తంబాలకు కేబుల్స్ చుట్టలు చుట్టలుగా వేలాడుతున్నాయి. ఎక్కడ చూసినా మీటర్ల కొద్దీ వైర్ బండిల్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సంజీవరెడ్డి నగర్, అమీర్ పేట, ఎల్లారెడ్డిగూడ, శ్రీనగర్ కాలనీ, వెంగళరావునగర్, యూసుఫ్ గూడ, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, సనత్ నగర్ ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ట్విన్ సిటీస్ లోని చాలా ప్రాంతాల్లో ఈ సమస్య ఉన్నప్పటికీ అధికారులు దీనిగురించి పట్టించుకోవడం లేదు. అమీర్‌‌‌‌పేటలోని సత్యం థియేటర్‌‌‌‌ సమీపంలో గత ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగి కేబుళ్లు కాలిపోయాయి. గుర్తు తెలియని వ్యక్తులు నేలపై చెత్త వేసి తగులబెట్టడంతో వైర్లకు మంటలు అంటుకున్నాయి. కేబుల్స్‌‌‌‌తోపాటు కరెంట్ వైర్లకు సైతం మంటలు అంటుకుని కాలిపోయాయి. దీంతో అక్కడ కరెంట్ సప్లయ్ నిలిచిపోయింది. చాలా వరకు స్తంభాలకు కేబుల్స్ కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి ప్రాంతాల్లో ఇవి ఆ మార్గంలో వాహనదారులకు అడ్డంకిగా మారాయి. పొరపాటున వేలాడుతున్న వైర్లు  తగిలితే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయని వాహనదారులు అంటున్నారు.  మరికొన్ని ప్రాంతాల్లో కేబుల్స్ కిందకు జారి నేలపై  పడుతున్నాయి. ఇలాంటి సందర్బాల్లో కాలినడకన వెళ్లేవారి మెడకు కేబుల్స్ చుట్టుకుని వారు కిందపడి గాయపడుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ట్రాన్స్‌‌‌‌ఫార్మర్‌‌‌‌ వద్ద, మరికొన్ని చోట్ల ఫ్యూజ్‌‌‌‌ బాక్స్‌‌‌‌ల వద్ద కేబుల్స్ ప్రమాదకరంగా మారాయి. వీటిలో ఎక్కువగా ఇంటర్‌‌‌‌నెట్‌‌‌‌ కనెక్షన్ ఉన్న కేబుల్స్ ఉండగా… మరికొన్ని కేబుల్‌‌‌‌ టీవీలకు సంబంధించిన వైర్లు, మరికొన్ని టెలిఫోన్‌‌‌‌ కనెక్షన్ కేబుల్స్, కరెంట్ కనెక్షన్ కేబుల్స్ ఉన్నాయి.  స్తంభాలపైన ఇవి చిక్కులు చిక్కులుగా ఉంటూ ప్రమాదకరంగా మారాయి. సమ్మర్ కావడంతో వీటి వల్ల భారీ అగ్ని ప్రమాదాలు జరగకముందే అధికార యంత్రాంగం మేలుకుంటే మంచిదని ఆయా ప్రాంతాల జనం అభిప్రాయపడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఏ వైర్ ఎటు వెళ్తుందో.. కేబుల్‌‌‌‌కు ఏ కనెక్షన్‌‌‌‌ ఉందో తెలియని పరిస్థితి నెలకొందని వారు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల కరెంట్ స్తంభాల కింద నుంచి పై వరకు కేవలం కేబుల్స్ మాత్రమే ఉంటున్నాయి. ఇలా రహదారులపై పడిన వైర్లను ఎవరూ సరిచేయకపోవడంతో వాహనదారులు, కాలినడకన వెళ్లేవారు ఇబ్బందిపడుతున్నారు. అస్తవ్యస్తంగా మారిన కేబుల్స్ ను సరిచేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతాల వారు కోరుతున్నారు.