పకడ్బందీ చర్యలతో.. కరోనా నష్టం తగ్గించుకున్న దేశాలు 

పకడ్బందీ చర్యలతో.. కరోనా నష్టం తగ్గించుకున్న దేశాలు 

కరోనాను హ్యాండిల్ చేయడంలో..సింగపూర్, తైవాన్, హాంకాంగ్
పకడ్బందీ చర్యలతో.. నష్టం తగ్గించుకున్న మూడు దేశాలు 

ప్రపంచ దేశాలకు ఆదర్శమంటున్న నిపుణులు

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు కరోనావైరస్ దడ పుట్టిస్తోంది. అయితే, ఆసియాలోని మూడు దేశాలు మాత్రం కరోనాను దాదాపుగా కంట్రోల్లో పెట్టేశాయి. వైరస్ నుంచి మిగతా దేశాల కంటే ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ, పకడ్బందీ చర్యలు చేపట్టి సేఫ్​సైడ్​లో నిలిచాయి. ఆ మూడు దేశాలు మరేవో కావు.. చైనాకు అతిదగ్గరగా ఉండటంతో పాటు ఆ దేశంతో ఎక్కువ సంబంధాలు కొనసాగిస్తున్న సింగపూర్, తైవాన్, హాంకాంగ్​లే. కరోనాను కట్టడి చేయడంలో చైనా కన్నా ఈ మూడు దేశాలు బాగా పని చేశాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)తో పాటు హెల్త్ నిపుణులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. కరోనా వైరస్​ను కంట్రోల్ చేయడంలో ఈ మూడు దేశాలు తీసుకున్న చర్యలను యూనివర్సిటీ ఆఫ్ ​హాంకాంగ్​కు చెందిన ఎపిడెమియాలజిస్ట్ బెంజమిన్ జె కౌలింగ్, అతడి స్టూడెంట్ వే వెన్ లిమ్ వివరించారు. చైనా పాటించిన పద్ధతులు బాగానే ఉన్నా ప్రజల హక్కులను దారుణంగా ఉల్లంఘించిందన్న విమర్శలు వచ్చాయని, కానీ ఈ మూడు దేశాలు మరీ కఠినమైన చర్యలేమీ తీసుకోకుండానే, వైరస్ ను కంట్రోల్ చేశాయన్నారు.

వెంటనే రంగంలోకి..

చైనాలో కరోనా కేసులు నమోదవుతున్నాయని తెలియగానే.. హాంకాంగ్, సింగపూర్, తైవాన్ దేశాల్లో ఎక్కడికక్కడ లోకల్ ఆఫీసర్లు రంగంలోకి దిగిపోయారు. ప్రయాణాలపై ఆంక్షలు, క్వారెంటైన్లు, సోషల్ డిస్టెన్సింగ్, పరిశుభ్రతా కార్యక్రమాల వంటివి దేశమంతటా అమలు చేశారు. సింగపూర్, తైవాన్ రెండూ ఐలాండ్ దేశాలు కావడం, హాంకాంగ్​కు చైనాతో బోర్డర్ తక్కువగా ఉండటంతో కంట్రోల్ చర్యలకు బాగా కలిసి వచ్చిందని అంటున్నారు. ఇక మార్చి 14 నాటికి హాంకాంగ్​లో  కరోనా కేసులు140 మాత్రమే రికార్డ్ కాగా, కేవలం నలుగురే చనిపోయారు. సింగపూర్ లో 200 కేసులు నమోదైనా, ఒక్క ప్రాణ నష్టం కూడా జరగలేదు. తైవాన్ లో53 కేసులు నమోదు కాగా, ఒక్కరే మృతిచెందారు. సరైన టైంలో సరైన చర్యలు తీసుకోవడంతో ఇవి కరోనాను బాగా హ్యాండిల్ చేశాయని చెప్తున్నారు.

సింగపూర్ హ్యాండిల్ చేసిందిలా..

కరోనావైరస్ ముప్పు గురించి చైనా ప్రకటించగానే, వుహాన్ నుంచి అన్ని విమానాలను క్యాన్సిల్ చేసిన మొదటి దేశం సింగపూరే. చైనా నుంచి వచ్చిన ప్రతి ప్యాసింజర్​ను ఐసోలేషన్ చేయడాన్నీ ఈ దేశమే ముందుగా ప్రారంభించింది. అధికారులు తక్షణమే మూడు యూనివర్సిటీ హాస్టళ్లను క్వారెంటైన్లుగా మార్చారు. గవర్నమెంట్ ఉద్యోగులకే కాకుండా, సెల్ఫ్​ఎంప్లాయ్ మెంట్​తో బతుకుతున్న వారికీ పరిహారం చెల్లిస్తామని సర్కారు ప్రకటించింది. కరోనా టెస్టుల నుంచి ట్రీట్ మెంట్ వరకూ అన్నింటినీ ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. సీసీటీవీ ఫుటేజీ, హోటళ్లు, ట్రావెల్ కంపెనీల నుంచి సమాచారం సేకరించి, ప్రతి పేషెంట్ కాంటాక్ట్ అయిన వ్యక్తులందరినీ గుర్తించారు. స్కూళ్లు, కొన్ని ఆఫీసులను కొనసాగించారు. స్టూడెంట్స్, ఎంప్లాయీస్​కు రోజూ థర్మల్ స్క్రీనింగ్ చేశారు.

హాంకాంగ్ తీసుకున్న చర్యలివీ..

తైవాన్, సింగపూర్ మాదిరిగా కాకుండా, హాంకాంగ్ చైనాకు బోర్డర్ లోనే ఉంది. చైనాలో భాగంగానే ఉండటం వల్ల రోజూ 3 లక్షల మంది వచ్చిపోతుంటారు. అందుకే.. చైనా నుంచి వచ్చేవాళ్లను కంట్రోల్ చేయడంపై కాకుండా, లోకల్ గా రోగం వ్యాపించకుండా చూడటంపైనే హాంకాంగ్ అధికారులు ఫోకస్ పెట్టారు. వుహాన్ లో కొవిడ్–19 కేసులు వెలుగు చూడగానే, హాంకాంగ్ అధికారులు బోర్డర్ లో ప్రతి ఎంట్రీ పాయింట్ వద్దా థర్మల్ స్క్రీనింగ్ ప్రారంభించారు. ఐదు రోజుల తర్వాతే ప్రయాణాలపై ఆంక్షలు పెట్టారు. ఫిబ్రవరి 5 తర్వాత చైనా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ 14 రోజుల క్వారంటైన్లకు పంపారు. గవర్నమెంట్ కట్టించిన కొత్త ఇండ్లను క్వారంటైన్లుగా మార్చారు. ఇప్పటికీ 2,47000 మందిని క్వారంటైన్లలో ఉంచారు. భారీ ప్రోగ్రాంలను రద్దు చేశారు. స్కూళ్లకు ఏప్రిల్ వరకూ సెలవులు ప్రకటించారు. వీలైన ప్రతి డిపార్ట్ మెంట్ లోనూ ఉద్యోగులను నెలరోజుల పాటు ఇంటి నుంచే పనిచేయాలని చెప్పారు.