విదేశీ హెచ్1బి నిపుణులను వాడుకుని పంపేస్తాం.. యూఎస్ ట్రెజరీ కార్యదర్శి సంచలన కామెంట్స్

విదేశీ హెచ్1బి నిపుణులను వాడుకుని పంపేస్తాం.. యూఎస్ ట్రెజరీ కార్యదర్శి సంచలన కామెంట్స్

అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఒక ఇంటర్వ్యూలే తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. అమెరికా విదేశీ నిపుణులను శాశ్వతంగా తమ దేశంలో ఉంచుకోవాలని అనుకోవటం లేదని.. వారి నైపుణ్యాన్ని ఉపయోగించుకొని అమెరికా కార్మికులను శిక్షణ ఇవ్వించాలనే ఉద్దేశంతో హెచ్1బి వీసా హోల్డర్లను తమ దేశానికి పిలుస్తోందని బెసెంట్ అన్నారు.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన ఈ కొత్త విధానంపై దృష్టి పెట్టడం అవసరమని ఆయన పేర్కొన్నారు.  అమెరికాకు సెమీకండక్టర్ల తయారీని తిరిగి తీసుకురావటానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అందుకే విదేశీ నిపుణులను ఏడేళ్ల పాటు అమెరికాకు ఆహ్వానించి, వారు స్థానిక కార్మికులను శిక్షణ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. శిక్షణ ఇచ్చాక హెచ్1బి నిపుణులు తిరిగి తమ దేశాలకు వెళ్లవచ్చని.. అప్పుడు అమెరికా కార్మికులు పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరిస్తారని బెసెంట్ అన్నారు. 

దీని వెనుక ఉన్న భావన స్పష్టంగా ఉంది.. అమెరికాకు ఈ క్షణానికి ఆ నైపుణ్యం లేకున్నా, తాత్కాలికంగా విదేశీ నిపుణులను ఉపయోగించి పరిశ్రమలు మళ్లీ పునరుద్ధరించుకోవడమే లక్ష్యం. ఉదాహరణకు అరిజోనాలో ప్రారంభమవుతున్న భారీ సెమీకండక్టర్ కర్మాగారాలు ఈ విధానం కింద నడుస్తాయని తెలుస్తోంది. ఈ విధానంపై భారీగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

విదేశీయులు ఎక్కువగా అమెరికాకు వచ్చి ఉద్యోగ, ఉపాధి పొందటంపై అమెరికన్లు తమ జాబ్స్ పోతున్నాయనే వాదనకు బెసెంట్ జవాబు ఇచ్చారు. ప్రస్తుతం అమెరికన్లకు ఆ ఉద్యోగాలను ఇవ్వటం సాధ్యం కాదని.. ఎందుకంటే వారు ఇంకా సాంకేతికంగా సిద్ధంగా లేరని ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఇంతలోనే ట్రంప్ సర్కార్ హెచ్1బి వీసాల దరఖాస్తు రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచి రూల్స్ కఠినతరం చేసింది. ఈ రూల్స్ కారణంగా చాలా కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవటానికి వెనుకడుగు వేస్తున్నాయి. ఇక అమెరికాలో చదువుకున్న అంతర్జాతీయ విద్యార్థులు ఉద్యోగాల కోసం చేసే వీసా దరఖాస్తులకూ అవకాశాలు తగ్గాయి. తాత్కాలికంగా విదేశీ నైపుణ్యాన్ని వినియోగించి.. సొంత కార్మిక శక్తిని పెంచుకోవాలని అమెరికా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.