ఫైనాన్స్లో ఫైళ్ల కుప్ప! ప్రతి దానికీ ఆర్థికశాఖ అనుమతి తప్పనిసరి చేయడంతో.. నెలల తరబడి ఫైళ్ల పెండింగ్

ఫైనాన్స్లో ఫైళ్ల కుప్ప! ప్రతి దానికీ ఆర్థికశాఖ అనుమతి తప్పనిసరి చేయడంతో.. నెలల తరబడి ఫైళ్ల పెండింగ్
  • సాధారణ ఫైల్స్ సైతం నెలల తరబడి పెండింగ్​
  • నిబంధలను  కాస్త సడలిస్తే తప్ప పనుల్లో వేగం పెరగదనే  అభిప్రాయాలు 
  • ఆగిపోతున్న కొత్త రిక్రూట్​మెంట్స్, కాంట్రాక్ట్​ ఉద్యోగుల జీతభత్యాలు, బదిలీలు 
  • నిలిచిపోతున్న సబ్సిడీలు, అభివృద్ధి పనులు
  • ఆస్పత్రుల్లో అత్యవసర మందులు, పరికరాలకూ వెయిటింగే
  • రోడ్లు, బిల్డింగుల్లో చిన్నచిన్న మరమ్మతులకూ ఎదురుచూపులే

హైదరాబాద్, వెలుగు:రాష్ట్ర సెక్రటేరియెట్​లోని ఆర్థిక శాఖ ప్రస్తుతం ఫైళ్ల గుట్టలతో నిండిపోయింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాల్సిన ఈ కీలక శాఖలో ఫైళ్లు నత్తనడకన సాగుతుండడంతో పాలనాపరమైన స్తబ్దత నెలకొన్నది. ప్రతి చిన్న విషయానికి, రొటీన్ వ్యవహారాలకు సైతం ఆర్థిక శాఖ ఆమోదం తప్పనిసరి చేయడంతో సమస్య జటిలంగా మారింది. నిత్యం వందల సంఖ్యలో వచ్చే ఫైళ్లను ఎప్పటికప్పుడు పరిష్కరించకపోవడంతో నెలల తరబడి మూలుగుతున్నాయి. 

వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనులు, ఉద్యోగాల భర్తీ ప్రక్రియలు, ఉద్యోగుల జీతభత్యాలు, బదిలీల వంటి కీలక ఫైళ్లతో పాటు నిధులతో సంబంధంలేని సాధారణమైన ఫైల్స్​   కూడా  ఆర్థిక శాఖ పరిధిలోనే నిలిచిపోతుండడంతో సదరు విభాగాల అధికారులు తలలుపట్టుకుంటున్నారు.  ఈ క్లియరెన్స్ ఆలస్యం కారణంగానే కాంట్రాక్ట్, అవుట్‌‌సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలు అందడం లేదు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు టైంకు రెన్యువల్ కావ డం లేదు. వివిధ శాఖలతో పాటు సీఎంఓ నుంచి వెళ్తున్న ఫైల్స్ సైతం క్లియరెన్స్ కోసం నెలల తర బడి పెండింగ్​లో పడుతున్నాయి.​ ఈ నేపథ్యంలోనే పాలన సజావుగా సాగాలంటే ఫైనాన్స్ క్లియరెన్స్ నిబంధనలను కాస్త సడలించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

  • ఫైనాన్స్​ నుంచి గ్రీన్​ సిగ్నల్​ వస్తేనే అభివృద్ధి పనులు

రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ చిన్న శాఖకు నిధులు విడుదల కావాలన్నా, కొత్త నిర్ణయాలు ఆచరణలోకి రావాలన్నా ఆర్థిక శాఖ ‘గ్రీన్ సిగ్నల్’ ఇవ్వాల్సిందేనన్న కఠిన నిబంధన ఇప్పుడు క్షేత్రస్థాయి అభివృద్ధికి పెద్ద గుదిబండలా మారింది. గతంలో రొటీన్, సాధారణ పరిపాలనా నిర్ణయాలకు ఆయా సాంకేతిక, అభివృద్ధి శాఖల అధిపతులకు కొంతమేర ఆర్థిక స్వయంప్రతిపత్తి ఉండేది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో నిబంధనల పేరుతో ప్రతి చిన్న ఫైలును ఆర్థిక శాఖకే పంపుతుండడంతో అక్కడ ఫైళ్ల పర్వతం పేరుకుపోతోంది. ఆఖరికి మంజూరైన ప్రాజెక్టుల తదుపరి విడత నిధులు, నిర్వహణ ఖర్చులు, అత్యవసర మరమ్మతుల వంటి చిన్నపాటి అంశాలకు సైతం ఫైనాన్స్ అనుమతి కోరాల్సి రావడం విచిత్రంగా మారింది. 

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను మెరుగుపరిచే ఒక పైప్‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ప్రాజెక్టుకు గతంలోనే పరిపాలనా అనుమతులు లభించి, పనులు ప్రారంభమయ్యాయి. కానీ మధ్యలో ఒకచోట సాంకేతిక లోపంతో అదనపు వ్యయంతో అత్యవసర మరమ్మతులు చేయాల్సి వచ్చింది. గతంలో అయితే సదరు ఇంజనీరింగ్ శాఖాధిపతే ఈ నిధులను తక్షణమే క్లియర్ చేసి పనులు పూర్తి చేయించేవారు. కానీ ఇప్పుడు ప్రతి అదనపు పైసాకూ ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి కావడంతో ఆ ఫైలు సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌కు చేరి మూడు నెలలుగా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో పడింది.  వర్షాకాలానికి ముందే పూర్తి కావాల్సిన ఒక ఉమ్మడి జిల్లా ప్రధాన రహదారి మరమ్మతుల వ్యవహారం మరొకటి. 

గుంతలమయమైన ఆ రోడ్డు పనులకు బడ్జెట్ కేటాయింపులు ఉన్నప్పటికీ, కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌కు ఇవ్వాల్సిన మొదటి విడత (మొబిలైజేషన్ అడ్వాన్స్) నిధుల విడుదల ఫైలు ఆర్థిక శాఖ క్లియరెన్స్ దగ్గర ఆగిపోయింది. ఈ కేంద్రీకృత విధానంతో వివిధ అభివృద్ధి శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీల నుంచి క్షేత్రస్థాయి ఆఫీసర్ల వరకు అందరూ ఆర్థిక శాఖ ఆమోదం కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి దాపురించింది.  

  • రిక్రూట్​మెంట్​.. వెల్ఫేర్​ ఫైల్స్​ సైతం

 కేవలం మౌలిక వసతులు, అభివృద్ధి పనుల నిధుల విడుదలే కాకుండా.. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఎంతో కాలంగా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్​ ప్రక్రియ కూడా ఆర్థిక శాఖ అనుమతుల దగ్గరే చిక్కుకుని నలుగుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాదిగా ఉన్న ఖాళీల భర్తీకి సంబంధిత బోర్డులు లేదా కమిషన్లు నోటిఫికేషన్లు జారీ చేయాలంటే, దానికి ముందు సదరు పోస్టుల జీతభత్యాల భారాన్ని భరించేందుకు ఆర్థిక శాఖ కచ్చితంగా క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 

కానీ నెలల తరబడి ఈ ఫైళ్లు ఆ శాఖ  టేబుళ్లపైనే మురిగిపోతుండటంతో నియామక ప్రక్రియలన్నీ అర్ధంతరంగా నిలిచిపోయాయి. వివిధ శాఖలు ప్రజల కోసం అమలు చేసే సంక్షేమ పథకాలు, రాయితీలు (సబ్సిడీలు), రోజువారీ పాలనాపరమైన విధాన నిర్ణయాల ఫైళ్లు సైతం ఆర్థిక శాఖలోనే మగ్గిపోతున్నాయి. ఉదాహరణకు వ్యవసాయ శాఖకు సంబంధించి రైతులకు అందించే సబ్సిడీ ట్రాక్టర్లు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు, విత్తనాల రాయితీ నిధుల ఫైళ్లు క్లియర్ కాకపోవడంతో  రైతులకు సాయం అందడం లేదు.  

వైద్యారోగ్య శాఖలో ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యవసర మందుల సరఫరా, వైద్య పరికరాల వార్షిక నిర్వహణ ఒప్పందాల ఫైనాన్స్ క్లియరెన్స్ లేక ఆగిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు కుంటుపడుతున్నాయి.  చివరకు ఏ శాఖకు సంబంధించిన ఏ చిన్న అంతర్గత వ్యవహారమైనా, ఉద్యోగుల ఏ సమస్యకైనా తుది పరిష్కారం ఆర్థిక శాఖ గుమ్మం దగ్గరే తేలాల్సి వస్తోంది. ఈ అతి కేంద్రీకృత నియంత్రణ ధోరణి వల్ల సచివాలయంలోని విద్య, వైద్యం, నీటిపారుదల, రెవెన్యూ వంటి మిగిలిన కీలక శాఖలకు సంబంధించిన కీలక ఫైల్స్​ ముందుకుపడడం లేదు.  

 సదరు శాఖల మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు కనీసం తమ సిబ్బంది బదిలీలు లేదా పదోన్నతులను కూడా స్వతంత్రంగా ఖరారు చేసుకునే అధికారం లేకపోవడంతో, యావత్ సెక్రటేరియట్ పాలన అంతా ఒక్క ఆర్థిక శాఖ చుట్టూనే ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది.  అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో  మరో ప్రాంతానికి వెళ్లే ‘ప్రత్యేక బదిలీల’  ఫైళ్లు సైతం ఆర్థిక శాఖ అనుమతి లేనిదే అంగుళం కూడా కదలడం లేదు.  

  • అధికారాల వికేంద్రీకరణ చేయాలనే అభిప్రాయం

ఆయా శాఖల్లోని కాంట్రాక్ట్, అవుట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం నెలలతరబడి శాలరీలు జమ కావడం లేదు. ఏటా రెన్యూవల్​ కావాల్సిన వారి సర్వీసు కూడా ఆర్థిక శాఖ దగ్గరే ఆగిపోతున్నది.  అరకొర జీతాలతో ఇండ్లు వెళ్లదీసే వీరికి, ఆర్థిక శాఖ నుంచి సకాలంలో నిధుల విడుదల కాకపోవడంతో మూడు నాలుగు నెలల వరకు వేతనాలు అందక ఇబ్బందులు పడతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతినెలా రెగ్యులర్​ ఉద్యోగుల మాదిరి కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులకూ ఒకటో తేదీనే శాలరీలు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

 ఆర్థిక శాఖకు ప్రతి ఫైలును పంపే పాత పద్ధతికి స్వస్తి పలికి, నిబంధనలను కొంతమేర సడలించాలని నిపుణులు సూచిస్తున్నారు. నిర్దిష్ట పరిమితి లోపు ఉండే బడ్జెట్ ఫైళ్లను ఆయా శాఖల హెచ్‌‌‌‌‌‌‌‌ఓడీలే క్లియర్ చేసుకునేలా అధికారాల వికేంద్రీకరణ జరిపితేనే ఈ ఫైళ్ల కుప్పల నుంచి విముక్తి లభిస్తుందని సెక్రటేరియెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.