
- లేటరల్ ఎంట్రీ ద్వారా భర్తీ చేయనున్న కేంద్రం
మరోమారు లేటరల్ ఎంట్రీ సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ కు ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు రెడీ అవుతోంది. దేశ దశ దిశను నిర్దేశించే థింక్ ట్యాంక్ ‘నీతి ఆయోగ్’లోకి 54 మంది ప్రైవేట్ ప్రొఫెషనల్స్ ను రిక్రూట్ చేసుకోనుంది. వీటిలో డైరెక్టర్ స్థాయి నుంచి జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ పోస్టులున్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని పెద్దాఫీసరు ఒకరు వెల్లడించారు. ఇప్పటివరకూ నీతి ఆయోగ్ లో కన్సల్టెంట్ లను కాంట్రాక్టు పద్దతిలో రిక్రూట్ చేసుకుంటూ వచ్చారని వివరించారు. ప్రస్తుతం నీతి ఆయోగ్ లో వివిధ స్థాయిల్లో 516 ఖాళీలు ఉన్నట్లు చెప్పారు. వీటిలో 54 పోస్టులను లేటరల్ ఎంట్రీ విధానంలో భర్తీ చేయాలని కేంద్రం భావిస్తోందన్నారు. ఇలా రిక్రూట్ చేసుకున్న వాళ్లను సాధారణ ఐఏఎస్ ఆఫీసర్ల మాదిరే పరిగణిస్తారని వెల్లడించారు. వీళ్లకూ సేమ్ ర్యాంకు, స్టేటస్, బాధ్యతలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా లేదా జులై నెలలో లేటరల్ ఎంట్రీకి నోటిఫికేషన్ వెలువడుతుందని స్పష్టం చేశారు.
కన్సల్టెంట్ల మాటకు విలువ లేదు!…
నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వంలోని ఇతర విభాగాల నుంచి సమాచారం సేకరించి పాలసీ మేకింగ్ లో సాయపడుతుంది. దీని కోసం థింక్ ట్యాంక్ లో పని చేసే కన్సల్టెంట్లు అడిగిన సమాచారాన్ని చాలా మంత్రిత్వశాఖలు ఇవ్వడం లేదు. వాళ్ల మాటను సీరియస్ గా తీసుకోవడం లేదు. దీని వల్లే లేటరల్ ఎంట్రీ ద్వారా ఐఏఎస్ లను తీసుకోవాలని సర్కారు నిర్ణయించినట్లు పెద్దాఫీసరు వెల్లడించారు.
ఐదేళ్ల పరిమితి…
సివిల్ సర్వీసుల్లో చాలా ఖాళీలు ఉన్నాయి. ఏటా వేల సంఖ్యలో పోస్టులకు నోటిఫికేషన్ వెలువడుతున్నా.. భర్తీ అవుతోంది వందల్లోనే. దీంతో అవసరమైన మేరకు ఫ్రెష్ టాలెంట్ ను ఐదేళ్ల పాటు తీసుకోవడానికి లేటరల్ ఎంట్రీ స్కీమ్ ను కేంద్రం తీసుకొచ్చింది. గత ఏడాది 10 జాయింట్ సెక్రటరీ పోస్టులకు విడుదలైన లేటరల్ ఎంట్రీ నోటిఫికేషన్ కు 6,077 మంది దరఖాస్తు చేసుకున్నారు. యూపీఎస్‌సీ వడపోత తర్వాత 89 మందిని ఇంటర్వ్యూకి పిలిచింది. అంతిమంగా 9 మందిని ఎంపిక చేసింది. లేటర్ ఎంట్రీ ద్వారా ఐఏఎస్ స్థాయిలో ఉద్యోగాల్లో చేరే వారి పని తీరును మూడేళ్ల తర్వాత కేంద్రం బేరీజు వేస్తుంది. బావుంటే.. మరో రెండేళ్ల పాటు అదే పొజిషన్ లో కొనసాగిస్తుంది.