
Covid Cases Surge: రెండేళ్ల కిందట ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా వైరస్ కోట్ల మంది ప్రాణాలను హరించంగా లక్షల కుటుంబాల్లో కన్నీటిని మిగిల్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచం ఆ కుదుపు నుంచి ఇంకా తేరుకోక మునుపే మరోసారి కరోనా వైరస్ కైసులు విపరీతంగా పెరగటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
తాజాగా ఆసియాలోని హాంకాంగ్, సింగపూర్ ప్రాంతాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ప్రజలు ఎక్కువగా ఉండే ఈ ఫైనాన్షియల్ హబ్ లలో పెరుగుతున్న కరోనా కేసులపై అక్కడి అధికారులు అందరినీ అప్రమత్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే ఆసియాలో మరోసారి కోవిడ్ వేవ్ ప్రభలే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా హాంకాంగ్ నగరంలో కేసులు తారా స్థాయిల్లో పెరుగుతున్నాయని నగరంలోని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ కమ్యూనికేషన్ డిసీజ్ బ్రాంచ్ అధిపతి ఆల్బర్ట్ ఔ పేర్కొన్నారు.
ప్రస్తుతం చేస్తున్న కొవిడ్ టెస్టుల్లో అత్యధికంగా పాజిటివ్ రావటంతో కేసులు ఏడాది గరిష్ఠాలకు చేరాయని హాంకాంగ్ అధికారులు చెబుతున్నారు. వైరస్ తీవ్రంగా ప్రభావితం చేసిన కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగిందని డేటా చెబుతోంది. ప్రస్తుతం 70 లక్షల మంది నివసిస్తున్న నగరంలో పరిస్థితులు చేజారి గతంలో స్థాయికి చేరలేదని అయితే కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోందని వెల్లడైంది.
ఇదే సమయంలో సింగపూర్ నగరంలో కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ నెలలో కరోనా కేసులు భారీగా పెరిగినట్లు వెల్లడించింది. మార్చి 3 నాటికి కేసుల సంఖ్య 14వేల 200గా ఉన్నట్లు ప్రకటించింది. రోజూ వైరస్ భారీన పడటం కారణంగా ఆసుపత్రి పాలవుతున్న వ్యక్తుల సంఖ్య 30 శాతం వరకు పెరిగింది. అయితే ప్రస్తుతం సివియర్ కేసుల సంఖ్య చాలా తక్కువగానే ఉందని హెల్త్ అధికారులు వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడిప్పుడే ప్యాండమిక్ కాలంలో జరిగిన నష్టం నుంచి తిరిగి కోలుకుంటున్న ప్రస్తుత సమయంలో కరోనా కేసులు మళ్లీ పెరగటం ప్రపంచ దేశాలను తిరిగి ఆందోళనల్లోకి నెట్టేస్తోంది. అయితే ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండటం చాలా కీలకంగా ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.