టీబీ కేసులు పెరుగుతున్నయ్

టీబీ కేసులు పెరుగుతున్నయ్
  • చెస్ట్ ​హాస్పటల్​కు డైలీ100కు పైనే ఓపీలు
  • కొవిడ్​, టీబీ కి ఒకే రకమైన సింప్టమ్స్​
  • గతేడాదితో పోలిస్తే 20శాతం ఎక్కువ 
  • గుర్తించకపోవడంతోనే పెరిగినయంటున్న డాక్టర్లు

హైదరాబాద్, వెలుగు: కొవిడ్​తర్వాత టీబీ కేసులు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 20 శాతం అధికమయ్యాయి. సెకండ్ వేవ్ తర్వాత పాజిటివ్​ కేసులు తగ్గుతుండగా మరోవైపు టీబీ లక్షణాలు ఎక్కువ మందిలో బయటపడుతున్నాయి. ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్ ఓపీకి ప్రతిరోజు వంద మందికి పైనే టీబీ పేషెంట్లు వస్తుండగా, ఇందులో 15 నుంచి 20 మంది కొత్తగా అడ్మిట్ అవుతున్నారు. ముఖ్యంగా పాండమిక్ ​టైమ్​లో జనాలు సరిగా పట్టించుకోలేదని, కరోనా, టీబీకి రెండింటికి ఒకే రకమైన సింటమ్స్​ ఉండగా గుర్తించడం కూడా కష్టమైందని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఫస్ట్​వేవ్​, సెకండ్ ​వేవ్​ లాక్ డౌన్ లో  కేసులు పెద్దగా రాలేదని, ఇప్పుడు పెరుగుతున్నాయని వెల్లడిస్తున్నారు. సెకండ్ వేవ్ తర్వాత ఆయాసం, దగ్గు తో బాధపడే పేషెంట్లు  చాలామంది వచ్చారని వారికి టెస్ట్ లు చేస్తే టీబీ బయట పడుతుందని చెప్తున్నారు. 

పోస్ట్ కొవిడ్ పేషెంట్లలోనూ..

లాక్ డౌన్ టైమ్​లో ఇంట్లోనే ఉండడం, కొవిడ్​వచ్చిన వారు స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడారు. దీంతో ఏ ఇబ్బంది కలిగినా కరోనా వల్లే అనుకుని హాస్పిటల్ కి వెళ్లలేదు.  ఇలా లాక్​డౌన్​​టైమ్​లో చాలావరకు టీబీ కేసులు నమోదు కాలేదు. సెకండ్ వేవ్ పోయే వరకు కూడా ఏది కరోనా, ఏది టీబీనో జనాల్లో క్లారిటీ రాలేదు. ఆ తర్వాత చెక్ చేయింకుంటుండగా జబ్బు బయటపడుతుందని డాక్టర్లు చెప్తున్నారు.  పోస్ట్ కొవిడ్ పేషెంట్లలోనూ టీబీ కేసులు 20శాతం పెరిగినట్టు గుర్తించామని  పేర్కొంటున్నారు. 

రెండింటిని వేరుగా చూడకపోవడంతోనే.. 

కరోనా వైరస్ లంగ్స్ పై ఎఫెక్ట్​ చూపడడం, టీబీ కూడా ఎక్కువగా లంగ్స్ కే సోకుతుండడం వల్ల ఆ రెండింటిని వేరుగా చూడకపోవడంతోనే టీబీ కేసులు తగ్గాయి. రెండు నెలల నుంచి కరోనా తగ్గుతుండగా, మరోవైపు టీబీ కేసులు పెరిగాయి. లాక్ డౌన్ టైమ్​లో నిర్లక్ష్యంగా ఉన్న వారిలో ఇప్పుడు బయటపడుతుంది. హాస్పటల్స్​కు వెళ్లిన పేషెంట్లకు నిర్ధారణ అయ్యాక ఇంజెక్షన్స్ తో పాటు మెడిసిన్స్ ఇస్తున్నారు. రెగ్యులర్ చెకప్ లు కూడా చేస్తున్నామని, ప్రతి పేషెంట్ పై మానిటరింగ్ ​పెడుతున్నామని డాక్టర్లు పేర్కొంటున్నారు.

స్టెరాయిడ్స్​ కూడా కారణం

కరోనా సోకిన వారిలో  5 శాతం కంటే తక్కువ మంది టీబీ బారిన పడ్డారు. ఒకే టైంలో లంగ్స్ పై రెండు రకాల ఎఫెక్ట్ లు  పడ్డాయి. అధికంగా స్టెరాయిడ్స్ వాడడం కూడా దీనికి కారణంగా చెప్పొచ్చు. ప్రస్తుతం పేషెంట్లకు  మంత్లీ చెకప్ లు చేయడం, మెడిసిన్స్ ఇవ్వడం, రెండు నెలల తర్వాత దవడ పరీక్ష, ఎక్స్ రేలు తీయడం, బ్లడ్ టెస్ట్ లు ఇలా అన్నీ చేస్తున్నాం. దీంతో పాటు ట్రీట్​మెంట్ వల్ల ఇతర కాంప్లికేషన్లు వస్తున్నాయా అనేది కూడా చెక్ చేస్తున్నాం.

-  డాక్టర్​ మెహబూబ్, సూపరింటెండెంట్, చెస్ట్ హాస్పిటల్