కొత్త రేషన్ కార్డులు.. 2.7 లక్షల కుటుంబాలకు లబ్ది

కొత్త రేషన్ కార్డులు.. 2.7 లక్షల కుటుంబాలకు లబ్ది

కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో గ్రేటర్ హైదరాబాద్‌లో తాజాగా 2లక్షల 72 వేల కుటుంబాలకు లబ్ది కలగనుంది.  కరోనా కష్టకాలంలో ఆహార భద్రత కార్డులు వస్తుండటంతో జనాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డులను జారీ చేసిన వెంటనే ... సరుకులు కూడా ఇవ్వాలని జనం కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న 15 కేజీల ఉచిత బియ్యం కూడా అందించాలంటున్నారు. 

కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో... రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లను క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2 లక్షల 72 వేల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందనున్నాయి.  ఈ నేపథ్యంలో మరో 15 రోజుల్లో పెండింగ్ అప్లికేషన్లను క్లియర్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14న జరిగే మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం తర్వాత కొత్త కార్డుల గైడ్ లైన్స్ జారీ అయ్యే అవకాశముంది.  

హైదరాబాద్ జిల్లా పరిధిలో కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు 1లక్షా 77 వేల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి.  వీటిల్లో 44,734 అప్లికేషన్లపై గ్రౌండ్ లెవల్లో విచారణ పూర్తయి కార్డులు మంజూరయ్యాయి. మరో 5 వేలకు పైగా కార్డులను జారీ చేయాల్సి ఉంది. దాదాపు లక్ష అప్లికేషన్లపై గ్రౌండ్ లెవల్లో అధికారులు పరిశీలన చేయాల్సి ఉంది.  ఇవి కాకుండా రేషన్ కార్డుల్లో సవరణ కోసం 99 వేల మందికి పైగా కార్డులు అప్లయ్ చేశారు.  వీటిల్లో 38 వేల కార్డులకు సవరణలు పూర్తయ్యాయి. 

రంగారెడ్డి జిల్లాలో కొత్త కార్డుల కోసం 74,254 కుటుంబాలు అప్లయ్ చేసుకున్నాయి.  వీటిల్లో 21 వేలకు పైగా దరఖాస్తుల విచారణ పూర్తయింది. ఇంకా 36 వేలకు పైగా అప్లికేషన్లపై ఎంక్వైరీ జరగాల్సి ఉంది.  మేడ్చల్ జిల్లాలో కొత్త కార్డుల కోసం 99,854 అప్లికేషన్లు వచ్చాయి. వీటిల్లో 27వేలకు పైగా కార్డులు ఇష్యూ అయ్యాయి.  మరో 6 వేల అప్లికేషన్లను అధికారులు తిరస్కరించారు.  ఇంకా పెండింగ్‌లో ఉన్న 61 వేల ధరఖాస్తులను అధికారులు పరిశీలించాల్సి ఉంది.  

కాగా.. హైదరాబాద్‌లో ప్రజల సౌకర్యార్థం మరో 32 కొత్త షాపులు ఏర్పాటు చేస్తున్నట్టు పౌరసరఫరా శాఖాధికారులు చెబుతున్నారు.  జిల్లా పరిధిలో 670 రేషన్ షాపులకు... ప్రస్తుతం 613 షాపులు పనిచేస్తున్నాయి. వీటిల్లో పాతిక దుకాణాలు పనిచేయడం లేదు.  డీలర్లు చనిపోవడంతో అవి మూతపడ్డాయి. అయితే మృతి చెందిన డీలర్ల కుటుంబ సభ్యులు రేషన్ షాపుల నిర్వహణకు ఆసక్తి చూపిస్తే... వాళ్ళకే కేటాయిస్తామంటున్నారు.