పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రైవేట్ టీచర్లు

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రైవేట్ టీచర్లు

హైదరాబాద్, వెలుగు:ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్లు విడుదలతో చేయడంతో నిరుద్యోగులు, విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. సర్కారు కొలువు కోసం లక్షల మంది ప్రయత్నిస్తున్నారు. వీరిలో ప్రైవేట్ టీచర్లు కూడా ఉన్నారు. స్కూళ్లలోని జాబ్స్​మానేసి, కోచింగ్​సెంటర్లలో క్లాసులు చెప్తూనే తమ ప్రిపరేషన్​కొనసాగిస్తున్నారు. దాదాపు 40 నుంచి 50 శాతం మంది టీచర్లు ఎలాగైనా క్వాలిఫై అవ్వాలనే లక్ష్యంతో చేస్తున్న జాబ్స్​వదిలేసి ప్రత్నిస్తున్నారు.

ఫ్యాకల్టీ కొరత

ప్రస్తుతం కోచింగ్ సెంటర్లకు అభ్యర్థుల తాకిడి ఎక్కువగా ఉంది. ఫిజికల్ క్లాసులతోపాటు ఆన్ లైన్ క్లాసులు, రికార్డెడ్ వీడియోల ద్వారా ప్రిపేర్ అవుతున్నవారు అనేక మంది ఉన్నారు. కొన్ని కోచింగ్ సెంటర్లలో ఫ్యాకల్టీ కొరత ఉండడంతో నిర్వాహకులు ప్రైవేట్ టీచర్లను ఆశ్రయిస్తున్నారు. సబ్జెక్టుపై10 నుంచి15 ఏండ్లు అనుభవం ఉన్నవారిని తీసుకుంటున్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న టీచర్లు పార్ట్​టైం, ఫుల్ టైం కోచింగ్​క్లాసులు చెబుతున్నారు. ప్రస్తుతం స్కూళ్లకు వేసవి సెలవులు ఇచ్చినప్పటికీ పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు, స్టడీ అవర్లు జరుగుతున్నాయి. కాగా చాలామంది ప్రైవేట్​టీచర్లు చేస్తున్న జాబ్​ను పూర్తిగా మానేశారు. మరికొందరు సెలవుల్లో ఖాళీగా ఉండకుండా కోచింగ్ క్లాసులు చెప్తున్నారు.

సెంటర్లలోనే అకామిడేషన్​

ప్రైవేట్ టీచర్లు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారికి కోచింగ్ ఇస్తూనే పనిలో పనిగా సబ్జెక్ట్ రివిజన్ చేసుకుంటున్నారు. కొన్ని సెంటర్లలో ఫ్యాకల్టీకి అకామిడేషన్ కల్పిస్తున్నారు. దీంతో అక్కడే ఉంటూ రోజులో గంటా, రెండు గంటలపాటు అభ్యర్థులకు క్లాసులు తీసుకుని మిగతా సమయాన్ని తమ ప్రిపరేషన్ కి ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం ఉద్యోగాలకు వయోపరిమితి పెంచడంతో చాలా మందికి కలిసొచ్చింది. గతంలో ప్రయత్నించి స్కోర్ చేయలేకపోయిన వారందరూ మళ్లీ రాస్తున్నారు. తామైతే ఇదే ఆఖరిసారి అన్నంతగా సిద్ధమవుతున్నామని టీచర్లు చెబుతున్నారు. సెంటర్లలో కోచింగ్​ఇస్తున్నవారితోపాటు ఆన్​లైన్​అకాడమీలు, యూట్యూబ్ ఛానళ్లలో లైవ్‌‌‌‌లు ఇస్తున్నవారు కూడా ఉన్నారు. డీఎస్‌‌‌‌సీకి మాత్రమే కాకుండా ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకూ ప్రయత్నిస్తున్నారు. 

డైలీ 1– 2 గంటలు క్లాసులు

14 ఏండ్లుగా టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. ఎంఏ హిస్టరీ చేశాను. సోషల్ ఫ్యాకల్టీగా పనిచేస్తుండేవాడిని. గతంతో టెట్ రాశాను. రాలేదు. ఇప్పుడు మళ్లీ ప్రయత్నిస్తున్నా. టెట్, డీఎస్‌‌‌‌సీతోపాటు కానిస్టేబుల్, ఎస్సై ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాను. నేను ప్రిపేర్ అవుతూనే పటాన్ చెరులోని కోచింగ్ క్యాంప్‌‌‌‌లో కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు పోటీ పడుతున్న అభ్యర్థులకు క్లాసులు చెబుతున్నాను. డైలీ గంట, రెండు గంటల పాటు ట్రైనింగ్ ఉంటుంది.తర్వాత క్యాంప్‌‌‌‌లోనే నేను ప్రిపేర్ అవుతున్నాను. 
– నాగేశ్వరరావు, టీచర్, ఎంఏ బీఈడీ

డీఎస్సీనే లక్ష్యంగా ప్రిపేర్ ​అవుతున్న

పదేండ్ల నుంచి కెమిస్ట్రీ టీచర్‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్నాను. ప్రస్తుతం సమ్మర్ హాలీడేస్ కావడంతో పూర్తిస్థాయి ప్రిపరేషన్ మీద ఫోకస్​ చేశాను. గతంలో ఒకసారి డీఎస్సీ 5 మార్కులతో పోయింది. ఈసారి ఎలాగైనా కొట్టాలని సిద్ధమతువున్నా. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారికి జనరల్ సైన్స్‌‌‌‌ క్లాసులు చెప్తున్నా. నేను ఫ్రీ కోచింగ్ క్యాంప్‌‌‌‌లో టీచ్​ చేస్తున్నా. కానీ మాకు మినిమమ్ పేమెంట్ ఇస్తున్నారు. ఆర్థికంగా హెల్ప్ ఫుల్ గా ఉంది. 
- భాస్కర్, టీచర్

సగం మంది ట్రై చేస్తున్నరు

ప్రైవేట్ టీచర్ల పరిస్థితి అందరికీ తెలిసిందే. కరోనా టైంలో చాలా మంది జాబ్స్ లేక ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. నోటిఫికేషన్లు రావడంతో సగం మంది ప్రైవేట్​టీచర్లు పోటీ పరీక్షలపై ఫోకస్​పెట్టారు. టెట్ కొట్టాలని 25 నుంచి 30 శాతం మంది ప్రయత్నిస్తుంటే 10 శాతం మంది ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలని చూస్తున్నారు. ఇందుకోసం ఉద్యోగాలను వదిలేసి ప్రయత్నిస్తున్నవారు కూడా ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కోచింగ్​ ఇస్తూనే ప్రిపేర్​ అవుతున్నారు. 
– మహదేవ్, టీచర్