మునుగోడులో కాంగ్రెస్ ఖాళీ

మునుగోడులో కాంగ్రెస్ ఖాళీ
  • అన్ని మండలాల నేతల సస్పెన్షన్, అనుబంధ కమిటీలు రద్దు
  • చౌటుప్పుల్ మీటింగ్​కు  జడ్పీటీసీ, కౌన్సిలర్లు డుమ్మా
  • రాజగోపాల్​కు మద్దతుగా పార్టీ పదవులకు పలువురు రాజీనామా

నల్గొండ, వెలుగు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ అవుతోంది. రాజగోపాల్ రెడ్డి ఉన్నప్పుడు నియమించిన మండల అధ్యక్షులను, అనుబంధ విభాగాల నాయకులను పీసీసీ సస్పెండ్ చేసింది. దీంతో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కాంగ్రెస్ కు లీడర్లే లేకుండాపోయారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్​కు రాజీనామా చేయడంతో ఆయనతో పాటే మండలస్థాయి నేతలు కూడా వెళ్తే పార్టీ పరువు పోతుందని.. పీసీసీ వారి మీద సస్పెన్షన్​ వేటు వేసింది. బుధవారం నాంపల్లి, మర్రిగూడ, చండూరు, మునుగోడు మండలాల అధ్యక్షులను సస్పెండ్​ చేయగా.. గురువారం చౌటుప్పుల్, సంస్థాన్ నారాయణ్ పూర్ మండలాల అధ్యక్షులను సస్పెండ్ చేసింది. అనుబంధ విభాగాలను రద్దు చేసినట్టు యాదాద్రి డీసీసీ ప్రెసిడెంట్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రకటించారు. గురువారం చౌటుప్పల్​లో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ జడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డితో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. రాజగోపాల్​కు మద్దతుగా యాదాద్రి డీసీసీ జనరల్ సెక్రటరీ కె.శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేశారు.

మిగిలింది చండూరు ఎంపీపీ ఒక్కరే..
నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్​ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మునుగోడు మున్సిపల్ చైర్మన్ ​గతంలోనే టీఆర్ఎస్​లో చేరారు. చౌటుప్పల్ జడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, చండూరు ఎంపీపీ పల్లె కల్యాణి రవికుమార్ గౌడ్, మునుగోడు పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్​లో మిగిలారు. గురువారం చౌటుప్పల్​లో జరిగిన మీటింగ్​కు చండూరు ఎంపీపీ మాత్రమే వచ్చారు. చండూరులో పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి నిర్వహించిన సమావేశానికి కూడా లోకల్​ లీడర్లు దూరంగానే ఉన్నారు.