పెండింగ్ చలానాలపై ఇకపై స్పెషల్ డ్రైవ్

పెండింగ్ చలానాలపై ఇకపై స్పెషల్ డ్రైవ్

రాష్ట్రంలో వాహనాల పెండింగ్ చలానాలపై టీఆర్ఎస్ సర్కార్ రాయితీ ప్రకటించింది. 45 రోజుల పాటు ఆఫర్ కొనసాగింది. గడువు ముగిసినా చాలా మంది చలానాలు చెల్లించలేదు. దాదాపు 30 శాతం మంది చలానాలు పెండింగ్ లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో పెండింగ్ చలానాలు ఉన్న వాహనాలపై పోలీసులు నజర్ పెట్టారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించేందుకు రెడీ అయ్యారు. నెలన్నరపాటు సాగిన ప్రత్యేక రాయితీ ద్వారా రూ.3 కోట్లకు పైగా చలానాలు క్లియర్ అయ్యాయి.

ఇప్పటికే క్లియర్ అయిన వాహనాల్లో 65 శాతం కార్లు ఉండగా..70 శాతానికి పైగా ద్విచక్ర వాహనదారులు మాత్రమే పెండింగ్ చలానాలు చెల్లించారు. రూ.1700 కోట్ల పెండింగ్  చలానాల్లో వెయ్యి నాలుగు కోట్లు వసూలయ్యాయి. రాయితీ తర్వాత రూ.312 కోట్లు వసూల్ చేశారు. సర్కార్ రాయితీ ముగిసిన తర్వాత కూడా ఇంకా 30 శాతం మంది వాహనదారులు చలానాలు చెల్లించకుండానే రోడ్లపై తిరుగుతున్నారు. దీంతో ఈ వాహనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించి చలానాలు క్లియర్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఎవరైతే చలానాలు చెల్లించకుండా రోడ్లపై తిరుగుతారో వారిపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ చెప్పారు.